.
ఆర్ కె లక్ష్మణ్ (1921-2015) జగమెరిగిన వ్యంగ్య చిత్రకారుడు. దశాబ్దాలపాటు ఆయన గీచిన ఒక్కో కార్టూన్ ఒక్కో సామాజిక పరిశోధన గ్రంథంతో సమానం. 1990 ప్రాంతాల్లో ఆయన గీచిన కార్టూన్లో ఒక బ్యాంక్ క్యాష్ కౌంటర్. బ్యాంకును దోచుకోవడానికి వచ్చిన దొంగ. తనపై తుపాకీ గురిపెట్టిన దొంగతో క్యాష్ కౌంటర్లో ఉన్న బ్యాంక్ ఉద్యోగి ఇలా అంటాడు.
“We have a loan scheme. I assure you it is equally good. Why don’t you try that instead?
“మా దగ్గర రుణసదుపాయం ఉంది. మీ దొంగతనానికి సరితూగేది. హాయిగా లోన్ తీసుకోకుండా… ఎందుకొచ్చిన ఈ దొంగతనం?”
Ads
బ్యాంక్ లోన్ తీసుకుని హాయిగా ఎగ్గొట్టే రాజమార్గం ఉండగా… ఇంత శ్రమ ఎందుకు? అని దొంగకు కౌంటర్లో బ్యాంక్ ఉద్యోగి జ్ఞానబోధ చేసే ఈ కార్టూన్ దాదాపు ముప్పయ్యేళ్ళ కిందటిది. అప్పటికే ఆర్ కె లక్ష్మణ్ అలా అన్నాడంటే… ఇప్పుడయితే ఏమనేవాడో!
అప్పిచ్చువాడు లేని ఊళ్లో ఉండనే ఉండవద్దని శతకకారుడి ప్రబోధం.
“ఋణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయాః
ఋణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవనా”
రుణానుబంధమే లౌకిక ప్రపంచానికి అత్యంత కీలకమయినది. బ్యాంకులతో ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఉన్నది జన్మ జన్మల అలౌకిక, పారమార్థిక (పారమార్థిక అనగా పరమ ఆర్థిక సంబంధమైన అన్న వ్యుత్పత్తి అర్థం తప్ప ఇంకే అర్థమూ తీసుకోకూడదని మనవి) రుణానుబంధమే. ఆ ఎగవేత దారుణ రుణ భారం తీర్చాల్సింది బాధ్యతగల సగటు భారతీయులే. ఆ కోణంలో వారిది పెద్ద పారమార్థిక కర్మ. మనది వారి ఉద్దేశపూర్వక కర్మల దెబ్బకు కాలిన ఇంకా పెద్ద “పరమ దౌర్భాగ్య ఖర్మ”!
“అప్పులేని సంసారమైనపాటే చాలు తప్పులేని జీతమొక్క తారమైన జాలు కంతలేని గుడిసొక్క గంపంతైన జాలు చింతలేని యంబలొక్క చేరెడే చాలు వింతలేని సంపదొక్క వీసమే చాలు…” అని అన్నమయ్య అప్పుల పెను భారం గురించి అయిదు వందల ఏళ్ల కిందటే వెంకన్న దగ్గర మొరపెట్టుకున్నాడు.
కొన్ని శతాబ్దాల బ్యాంకింగ్ సేవలను నిశితంగా గమనించిన నిపుణులు తేల్చిందేమిటంటే-
“అప్పు ఎగ్గొట్టే అత్యంత సంపన్నులను బ్యాంకులు ఏమీ చేయలేవు. అప్పు బాధ్యతగా తిరిగి కట్టేవారి నుండి ఎంత ఎక్కువ వీలయితే అంత ఎక్కువ వడ్డీలు వసూలు చేసుకుంటాయి. జనం డిపాజిట్లకు నామమాత్రపు వడ్డీ ఇవ్వాలి. వేల, లక్షల కోట్ల అప్పులు ఎగ్గొట్టిన వారి భారాన్ని… సామాన్యులు మోయాలి. ఇదొక తీరని రుణం. కరుణ లేని దారుణం”.
అమెరికాలో వేల కోట్ల బ్యాంక్ మోసాలు చేసిన ఒకడిని చివరికి ఎలాగో పట్టుకుని… జైల్లో వేశారు. అలాంటి బ్యాంక్ మోసాలను గుర్తించి జాగ్రత్త పడడానికి బ్యాంకులు తరచుగా జైలుకు వెళ్లి అతడి సేవలను వినియోగించుకునేవి. శిక్ష పూర్తయి బయటికొచ్చాక అతడు బ్యాంక్ మోసాలను గుర్తించే సేవల కంపెనీ పెట్టి వేల కోట్లు సంపాదించాడు. ఇంకా సంపాదిస్తున్నాడు. అతడి కథతో ఏకంగా హాలీవుడ్ లో “క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్” అని సినిమానే వచ్చింది.
ఈ లెక్కన మన భారత్ లో ఎన్నెన్ని “క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్” సినిమాలు తీయాలో! ఈ సినిమాల నిర్మాణాలకు కూడా బ్యాంకులు ఎన్నెన్ని లక్షల కోట్లు అప్పులిచ్చి “వుయ్ కాంట్ క్యాచ్ యూ ఫర్ ఎవర్” అని సమాధానంగా తూరుపు తిరిగి దండం పెట్టుకోవాలో!!
ముళ్ళపూడి వెంకటరమణ అద్భుతమైన హాస్య రచనల్లో “రుణానందలహరి” ఒకటి.
ఆయనే ఉండి ఉంటే “రుణ ఎగవేతానందలహరి” పేరిట మరో సీరీస్ రాసేవారు- సీరియస్ గా!
సందర్భం:- పదేళ్ళలో ఉద్దేశపూర్వక ఎగవేతదారులనుండి వసూలు చేసుకోలేక… ఇక రావని లెక్క చెరిపేసి (రైటాఫ్ చేసి)… బుడితి ఖాతాల్లో రాసేసుకుని… వారిని దయతో వదిలేశారు. అలా రైటాఫ్ చేసిన మొత్తం అక్షరాలా పదహారు లక్షలా ముప్పయ్ అయిదు వేల కోట్ల రూపాయలు మాత్రమేనని మన దేశ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు నిండు సభలో ప్రకటించారు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article