.
Paresh Turlapati ……. తన సినిమాల్లో గ్యాలన్ల కొద్దీ రుధిరం పారిస్తాడని మన తెలుగు దర్శక ఘనాపాటి బోయపాటిని ఆడిపోసుకుంటాం కానీ మార్కో చూస్తే బోయపాటి చాలా బెటరని.. చంటి పిల్లాడనీ అర్థమౌతుంది… మార్కో మలయాళం సినిమా…
బహుశా అక్షౌహిణుల కొద్దీ సైన్యం మరణించిన కురుక్షేత్ర సమరంలో కూడా ఇంత నెత్తురు పారి ఉండదు, ఇంత హింస కనిపించి ఉండదు… పైగా ఇది మలయాళంలో సూపర్ హిట్ అయి కలెక్షన్ల పరంగా వంద కోట్లు దాటిందట…
Ads
అంతటితో ఊరుకోకుండా తెలుగులో కూడా డబ్ చేసి జనాల మీదకు వదిలారు ఆ మలయాళ విధ్వంసకులు… అసలు ఆ మలయాళం వాళ్ళు తీసినట్టు మనవాళ్ళకు సినిమాలు తీయడం చేతకాదు అని జడ్జిమెంట్లు ఇచ్చినవాళ్ళు ఒక్కసారి మార్కో చూడండి…
ఈ సినిమా చూసిన తర్వాత నాకు అసలు సెన్సార్ బోర్డ్ అనే వ్యవస్థ ఉందా? లేదా? అన్న అనుమానం వచ్చింది… సినిమా మొదట్లోనే జంతువులకు హాని చేసే దృశ్యాలు కానీ హింసాత్మక సన్నివేశాలు కానీ చిత్రీకరణ చేయలేదు అని ఓ డిస్క్లైమర్ పడేస్తే చాలు, సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు…
ఓ పక్క ఓటీటీల నిండా మితిమీరిన అశ్లీల సన్నివేశాలు యధేచ్చగా దింపేస్తున్నారు… ఇంకో పక్క సినిమాల్లో మితిమీరిన హింసాత్మక సన్నివేశాలు రీళ్లకు రీళ్ళు చూపించేస్తున్నారు…
నిన్నెవరు చూడమన్నారు మార్కో అనకండి… OTT లు తిరగేస్తూ పొరపాటున చూశా… అందుకే నాలా పొరపాటున ఇంకెవరైనా సినిమా చూస్తారేమోనని రివ్యూ రాస్తున్నా… సినిమా మొదట్లోనే దర్శకుడి కాన్సెప్ట్ అర్థమైపోయింది…
సున్నిత హృదయులు తరువాత పేరాలు చదవకండి ప్లీజ్… విలన్ గ్యాంగ్ కళ్ళు లేని ఓ కుర్రాడ్ని యాసిడ్ తొట్టిలో వేసి చంపేస్తారు… ఇదీ బిగినింగ్…
కథ గురించి సినిమా మొత్తం వెతికినా కనబడలేదు… ఈ సినిమాలో చూపించిన హింస ఈ మధ్య కాలంలో నేను ఏ సినిమాలోనూ చూడలేదు… ఆ మధ్య ఓ మలయాళం సినిమా స్ఫూర్తిగా హైదరాబాద్లో ఒక ఉన్మాది భార్యను చంపి ముక్కలు చేసి, కుక్కర్లో ఉడకబెట్టి, ఆనక పొడి చేసి, చెరువులో కలిపేసాడని టీవీ వార్తల్లో చూశాం కదా…
మార్కోలో దానికి పదింతల హింస చూపించాడు దర్శకుడు… ఈ సినిమాలో వాడటానికి రక్తం కోసమే ఓ చెరువు తవ్వించి ఉంటాడు దర్శకుడు… విలన్ల తలకాయలను మార్కెట్లో దిష్టి తీసే గుమ్మడి కాయల మాదిరి విసిరేస్తాడు హీరో…
రంపం పెట్టి చేతులు కోసేయడం మితిమీరిన హింసకు పరాకాష్ట… సినిమా అంతా వయోలెన్స్ ఒక ఎత్తు, క్లైమాక్స్ లో వయోలెన్స్ ఒక ఎత్తు… విలన్ పాత్ర ధారి చిన్న పిల్లవాడిని నేలకేసి కొట్టి గ్యాస్ సిలిండర్ బండతో అతడి ముఖం మీద ఆపకుండా బాదుతాడు… (ఒరేయ్, దర్శకుడు ఎవుడ్రా..?) అసలు విషయం రాయటం మరిచా.. క్లైమాక్స్ లో హీరో విలన్ గుండెలో కత్తి దించి అటూ ఇటూ తిప్పి గుండె కాయ బయటికి తీసి వాడి చేతిలోనే పెడతాడు!
ఆఖర్లో మాంసపు ముద్ద కనిపిస్తుంది… డెలివరీ అవుతున్న అమ్మాయి కడుపు మీద ఒక్క గుద్దు గుద్ది పిల్లవాడిని బయటికి లాగి పేగు కోసేసి చేతుల్తో ఆ పసిగుడ్డును వేలాడదీస్తూ వికటాట్టహాసం చేస్తూ వెళ్తాడు… (ఛావాలో శంభాజీని పెట్టే హింస అసలు లెక్కలోకే రాదు, ఈ సినిమాలో హింసతో పోలిస్తే…)
నాకైతే ఆ సన్నివేశం చూడగానే కడుపులో దేవింది… అసలు సెన్సార్ బోర్డ్ ఏమైపోతుంది ? ఉందా? లేదా? నిజంగా వాళ్లు ఈ సినిమా మొత్తం చూసే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారా?
ఈ మధ్య ఎవడో పృథ్వీ అనే నటుడు ఓ సినిమా ఫంక్షన్లో ఒక పార్టీకి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని ఆ పార్టీ అభిమానులు ఆ సినిమా బాయ్‌కాట్‌కు పిలుపు ఇచ్చారు… నిజానికి జనం బాయ్‌కాట్‌కి పిలుపు ఇవ్వాల్సింది ఇలాంటి మితిమీరిన హింసాత్మక సన్నివేశాలు ఉన్న సినిమాని…
ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే ముందు ముందు మరింత భయానక హింసాత్మక సన్నివేశాలు ఉన్న సినిమాలు చూడాల్సి ఉంటుంది ! అందుకే #బాయకాట్ మార్కో…. #boycottmarco
అన్నట్టు, నాని ఏదో హిట్-3 సినిమా తీస్తున్నాడట కదా… అందులోనూ హింస మార్కో లెవల్ ఉంటుందట,.. దేవుడా… కాస్త పద్ధతైన కేరక్టర్ అనుకున్నాం, హఠాత్తుగా నీకేం పుట్టింది నానీ..?!
Share this Article