ఆర్ఎస్ఎస్‌కూ బీజేపీకి నడుమ దూరం పెరుగుతున్న తీరు, మోడీని ఉద్దేశించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన మార్మిక వ్యాఖ్యల గురించి ‘ముచ్చట’ రాసిన స్టోరీ గుర్తుంది కదా… మోడీ షా ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్‌తో దూరం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారనీ, గత ఎన్నికల్లో నెగెటివ్ ఫలితాల దృష్ట్యా ఆర్ఎస్ఎస్ మెప్పు పొందే అడుగులు వేస్తారనీ చెప్పుకున్నాం… హార్డ్ కోర్ స్వయంసేవక్, సంఘ్ సేవ కోసమే సంసార బంధాలన్నీ విడిచి సన్యసించిన మోడీ ఆ సంస్థను ఇగ్నోర్ చేయడం అసాధ్యమనీ అనుకున్నాం కదా…
అదే జరిగింది… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనడం మీద 58 ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని మోడీ ప్రభుత్వం తాజాగా ఎత్తేసింది… ఈమేరకు డీఓపీటీ ఆఫీస్ మెమో ఒకటి విడుదలైంది… ఇలాంటి చర్యలతో ఆర్ఎస్ఎస్ మెత్తబడుతుందా, స్థూలంగానే మోడీ నేతృత్వంలో బీజేపీ రాజకీయ ప్రస్థానం తీరు మీద ఆర్ఎస్ఎస్ కోపంగా ఉందానేది వేచి చూడాల్సి ఉంది…
1966లోనే కాదు, 1970, 1980లలో కూడా విడుదలైన సర్క్యులర్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్‌లో ఉంటే కఠినచర్యలను నిర్దేశించాయి… ఉద్యోగులే కాదు, పెన్షనర్లు కూడా..! ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్ ఈ నిషేధాన్ని ఎత్తేయాలని కోరుతోంది… కాషాయ శిబిరంలోని కార్మిక విభాగం భారతీయ మజ్దూర్ సంఘ్ 2018 నుంచీ పదే పదే మోడీ ప్రభుత్వాన్ని కోరుతోంది… ఇలాంటి నిబంధనను హర్యానా ప్రభుత్వం తమ ఉద్యోగులకు సంబంధించి కొన్నేళ్ల క్రితం ఎత్తివేసినప్పుడూ కొంత రాజకీయ విమర్శలు, స్పందనలు వచ్చినట్టు గుర్తు…
Ads
(తాజా ఆఫీస్ మెమో)
గతంలో వాజపేయి ప్రభుత్వం గానీ, గత పదేళ్ల మోడీ ప్రభుత్వం గానీ ఈ నిషేధాన్ని ఎత్తివేయలేదు… ఇప్పుడు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం తిరిగి రాజకీయ సంవాదాలకు కారణమవుతోంది… జైరాం రమేష్ అప్పుడే ఎక్స్ ఖాతాకెక్కి ఇక ఉద్యోగులు ఖాకీ నిక్కర్లు (గతంలో ఆర్ఎస్ఎస్ డ్రెస్) వేసుకుని తిరుగుతారేమో అన్నాడు… ‘‘గాంధీ హత్య తరువాత 1948లో సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాడు… సత్ప్రవర్తనకు హామీ ఇచ్చిన తరువాతే ఆ నిషేధం ఎత్తేశారు… ఐనా సరే, ఎప్పుడూ నాగపూర్ ఆఫీసు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం లేదు’’ అనీ ఆక్షేపించాడు…
(1966 నాటి ఒరిజినల్ బ్యాన్ ఆఫీస్ మెమో)
1966 లోనే ఆర్ఎస్ఎస్ సంస్థకే గాకుండా జమాతే ఇస్లామీ సంస్థకు కూడా ఇవే రూల్స్ వర్తింపజేసింది… జైరాం రమేష్ తన ట్వీట్‌లో నాన్ బయోలాజికల్ మోడీ అని వెటకరిస్తూనే ఆర్ఎస్ఎస్‌కూ మోడీకి నడుమ పెరిగిన దూరాన్ని ప్రస్తావించి, వాజపేయి హయాంలో కూడా నిషేధాన్ని ఎత్తివేయలేదు గానీ మోడీ చేశాడు అని విమర్శించాడు…
ఇంకా ప్రభుత్వం వైపు నుంచి గానీ… ఇతర ప్రతిపక్ష నేతల నుంచి గానీ పెద్దగా స్పందన కనిపించలేదు… ఈరోజు మొదలుపెడతారేమో… మమత, స్టాలిన్‌ల నుంచి స్టార్టవుతాయేమో స్పందనలు, ఖండనలు ఎట్సెట్రా..!!
Share this Article