ఎవడో మూర్ఖుడు ఏదో అంటాడు… సకల అవలక్షణాలకూ ప్రతీకలు సివిల్ సర్వెంట్లు అని…. నాన్సెన్స్, వాడికి బుద్ధి లేదు… ఏదో ఫాదర్స్ డే కదా, తండ్రివంటి కేసీయార్ కాళ్లు మొక్కాడు, ఏదైనా శుభకార్యం జరుగుతుంటే పెద్దల కాళ్లు మొక్కడం మర్యాద కదా… అందుకే ఓ జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కావచ్చు, ఓ కామారెడ్డి కలెక్టర్ శరత్ కావచ్చు… కేసీయార్ కాళ్లు మొక్కారు.. అంతే… అరె, అర్థం చేసుకోకపోతే ఎలా..? పెద్దలు అంటే… వయస్సులో మాత్రమే పెద్ద కావాలని ఏముంది..? హోదాలో, అధికారంలో కూడా పెద్దలు అని కొత్త బాష్యం చెప్పుకోవాలి… ఒక ఎంపీపీ, ఒక సర్పంచి, ఒక వార్డు మెంబర్ పెద్దలుగా అనిపించినా సరే, కాళ్ల మీద పడిపోవాలి… అరె, అసలు సివిల్ సర్వెంట్ అంటే ఏమిటి..? వాళ్లకు శిక్షణలో ఏం చెప్పారు..? ప్రజాప్రతినిధుల కాళ్ల దగ్గర పారాడటమే కదా…! ఛిఛీ, సిద్దిపేట, కామారెడ్డి కలెక్టర్లకు అర్థమైనంత కూడా ఇతర పెద్ద పెద్ద సివిల్ సర్వెంట్లకు అర్థం కావడం లేదు… ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏం పాడో… అసలు తప్పు కేంద్రం ఆధీనంలోని ఉన్న డీవోపీటీ… దిక్కుమాలిన విభాగం… ఇప్పటికైనా కేంద్ర సర్వీసు అధికారుల సర్వీస్ రూల్స్, మోరల్ బిహేవియర్ మీద సిద్దిపేట, కామారెడ్డి కలెక్టర్ల ఉదాహరణలతో అవన్నీ సంస్కరించుకోవాలి కదా…
పెద్దలు అంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఆ జిల్లాల మంత్రులు… ఆయా ప్రాంతాల జనజీవనాన్ని చెరబట్టిన, సారీ… ఉద్దరించిన ఎవరైనా పెద్దలే… సిద్దిపేట, కామారెడ్డిల కలెక్టర్లు విజ్ఞులు, చరిత్రలో నిలిచిపోయేంత జ్ఞానులు కాబట్టి అర్థం చేసుకున్నారు… మరి మిగతా సివిల్ సర్వెంట్ల బుద్ధి ఎక్కడ పోయింది..? నిజానికి వాళ్లు చేసిందే ఓరకంగా తప్పు… ఆ సూట్ ఏంటి..? ఆ డ్రెస్ ఏంటి..? గులాబీ చొక్కాలు కావాలంటే కుట్టించుకోలేరా…? కాళ్లు మొక్కుతూ ఉన్నప్పుడు శానిటైజర్ కాదు.., పన్నీరు చల్లలేదు, పూలతో అలంకరించలేదు… చుట్టూ బ్యాండ్ మేళం వాయింపుల్లేవు… ఛిఛీ, అంత దరిద్రంగానా..?! అందుకే తక్షణం ఆ ఇద్దరు కలెక్టర్ల మీద ఆ కేంద్ర డీపీవోటీ వాడు చర్యలు తీసుకోవాలి…
Ads
అసలు ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే అంటేనే, ఓ జిల్లా మంత్రి అంటేనే… పెద్దరికానికి చిరునామాలు… అరె, నామాలు కాదుర భయ్… సివిల్ సర్వెంట్లు వాళ్ల కాళ్లు మొక్కకుండా ఏ శంకుస్థాపనలు, ఏ ప్రారంభోత్సవాలు చేయకూడదని కొత్తగా ఓ రూల్ అర్జెంటుగా పెట్టేయాలి… అంతేకాదు, ముందుగా పెద్ద పెద్ద అధికార్లు ఆ పనిచేశాకే, ప్రొటోకాల్ ప్రకారం కింది స్థాయి అధికార్లు ఆ పనిచేయాలని రూల్ పెట్టాలి… గ్రూప్ వన్ అధికార్లకు కూడా ఈ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలి… ఎమ్మెల్యేకు ఎవరు మొక్కాలి, మంత్రికి ఎవరు మొక్కాలి, అసలు అధికార్ల ఆహార్యం ఎలా మార్చాలి, సగం వంగితే ఎన్ని మార్కులు..? మొత్తం సాగిలబడితే ఎన్ని మార్కులు, పాదాలపై పాకితే ఎన్ని మార్కులో స్పష్టంగా నిర్దేశించాలి… ఇంకా ఎన్నాళ్లు ఈ పనికిమాలిన పాత సర్వీస్ రూల్స్..? పద్ధతులు..? నాన్సెన్స్… ఈ మోడీకి సిగ్గులేదు, ఈ అమిత్ షాకు బుద్ధి లేదు… ఇంకా ఎప్పుడు సివిల్ సర్వెంట్ల సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేయడం..?! కనీసం చైతన్యం, ఆత్మగౌరవ ప్రతీక అయిన తెలంగాణ సమాజమే దీనికి శ్రీకారం చుట్టాలి… తక్షణం అసెంబ్లీ సమావేశపరిచి, ఈ కొత్త మర్యాదల్ని చట్టబద్ధం చేయాలి… లేకపోతే తెలంగాణ ఆత్మగౌరవం మరింత భ్రష్టుపడుతుంది… కేసీయార్ సర్కారు తక్షణం కదలాలి…!! నాలుగు గోడల మధ్య బందీ అయిపోయిన పాదాభివందనాల సంస్కృతిని, ఆత్మగౌరవాన్ని ఇకనైనా విముక్తం చేసి, సంస్కృతీబద్ధం చేయాలి…!! ప్రజాప్రతినిధుల కాళ్లు మొక్కితేనే, ప్రజల కాళ్లు మొక్కినట్టు, గౌరవించినట్టు అని కొత్త బాష్యాలు ప్రకటించాలి…!!
Share this Article