.
Devi Prasad C …. తమిళ సినిమా “డోరతి” చూసినప్పటినుంచి రోజుకొక్కసారైనా అతను గుర్తుకొస్తున్నాడు.
మద్రాసులో సినీపరిశ్రమ ఉన్నప్పుడు కంపెనీ ఆర్టిస్టుగా గుంపులో గోవిందయ్య వేషాలు వేసేవాడు.
పొట్టిగా నల్లగా సన్నగావున్నా గట్టిగా వుండేవాడు.
అతని మగశరీరంలో ఉన్న స్త్రీత్వమే ఎక్కువ బైటికి కనిపించేది.
షూటింగ్స్ లో కొందరు అతడి హావభావాలమీద బాడీలాంగ్వేజ్ మీద జోకులు వేసినా కిలకిలా నవ్వేసేవాడు తప్ప కోపగించుకొనేవాడు కాదు.”నన్ను కన్న తల్లికి అందరూ బాగానే పుట్టారు. నాదొక్కటే అటూఇటూకాని జన్మ. నేననుకుని పుట్టానా ఇట్టా” అని నవ్వేసేవాడు.
అప్పుడప్పుడూ పెద్దవాళ్ళకు కాళ్ళునొక్కుతూ ఉండేవాడు.
Ads
మొదటిసారి “మాయాబజార్” సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌లు తక్కువైతే 11 ఏళ్ళ పిల్లాడిగా ఉన్న తనని తీసుకెళ్ళి డ్రెస్ వేసి సెట్లో కూర్చోబెట్టాడొక జూనియర్ ఆర్టిస్ట్‌ల ఏజెంట్ అని చెప్పేవాడు.
మొదట్లో కొన్నాళ్ళు అప్పట్లో కొత్తగా వచ్చిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌తో కలిసి రూములో వుండేవాడట. అతని బట్టలు తిండి నుండి అన్ని ఖర్చులూ ఇతనే భరించేవాడట. అతనంటే ఇతనికి అమితమైన ప్రేమని, అతను కొద్దిగా పైకొచ్చాక ఇతన్ని తన్ని తగలేశాడని చెప్పుకొనేవారు.
అతనొచ్చి అడిగితే వేషం లేకపోయినా ఏదో ఒక సన్నివేశంలో ఏదో ఒక చిన్న వేషం ఇరికించి మరీ ఇచ్చేవాళ్ళం.
నా తలపైన చెయ్యిపెట్టి “నువ్వు డైరెక్టర్ అవుతావు బాబూ….. దాసరి గారి దగ్గర వున్నప్పుడు కోడి బాబుకి కూడా ఇట్టాగే చెప్పాను” అనేవాడు.
హైదరాబాద్ వచ్చాక నేను డైరెక్టర్ అయ్యాక తరచూ ఇంటికి వచ్చి కలిసేవాడు.

రామానాయుడు స్టూడియో దిగువలో ఓ అద్దె గదిలో తనూ తన తల్లి ఉంటున్నట్టు చెప్పాడు.
వెజ్, నాన్‌వెజ్ పచ్చళ్ళు తయారు చేసి బాటిల్స్‌లో సినిమావాళ్ళ ఇళ్ళకు తెచ్చిచ్చి డబ్బులు తీసుకొనేవాడు.
“అప్పట్లో ఎన్.టి.ఆర్ గారింట్లో బసవతారకమ్మ గారి నుండి ఇప్పుడు భువనమ్మ గారి వరకు ఎవరు పచ్చళ్ళు పట్టినా నేనుండాల్సిందే బాబూ” అనేవాడు.
ఓసారి ఎవరో చెబితే తెలిసింది ఓ పెద్ద నటీమణి దగ్గర పనిచేసే మేకప్‌మెన్ అతనికి సొంత సోదరుడని, మరొక సొంత సోదరుడి కూతురు పెద్ద హీరోయిన్ అని. ఆశ్చర్యపోయాను.
ఓసారి అతను ఇంటికొచ్చినప్పుడు అడిగితే “నిజమేనండి, రక్త సంబంధం తెంచుకుంటే తెగిపోద్దా”అన్నాడు.
విజయవాడలో స్వీట్స్ వ్యాపారం చేసే సోదరుడి కూతురు బాగుంటుందని ఆమెనీ ఆమె తల్లినీ మద్రాసు రప్పించి చాలామంది సినిమా వాళ్ళకు పరిచయం చేశానని, ఆ అమ్మాయి పుంజుకొనేవరకూ వాళ్ళమ్మతో కూడా పచ్చళ్ళ వ్యాపారం చేపించాననీ” చెప్పాడు.
“ఆ అమ్మాయి మెగాస్టార్‌తో కూడా నటించేంత పెద్ద హీరోయిన్ అయ్యింది కదా. మరిప్పుడు నీతో బాగుంటారా” అని అడిగితే “ఎప్పుడన్నా అనుకోకుండా షూటింగ్స్‌లో కలిస్తే ఎవ్వరూ లేనప్పుడు ఆ పిల్ల మాత్రం ఏం బాబాయ్ బాగున్నావా’’ అంటుంది.
అంతకుముందెప్పుడో వాళ్ళింటికెళ్ళినప్పుడు వాళ్ళమ్మ “నువ్వు పలానా అని తెలిస్తే అమ్మాయికి పరువుంటదా…. నువ్వే ఆలోచించు” అన్నది. మరాళ్ళు చెప్పిందీ నిజమే కదండీ, అందుకే ఎవరిళ్ళకీ నేను పోను” అన్నాడు.
మరి ఆర్ధికంగా నిన్నేమైనా ఆదుకున్నారా అంటే” ఛీఛీ ఆళ్ళ డబ్బులు నాకెందుకండి. అయినా రక్తసంబంధం అని గానీ ఆళ్ళు గొప్పోళ్ళయ్యాక ఆళ్ళ డబ్బు తిందామని కాదు గదా అప్పుడు నేనాళ్ళకి సాయం జేసింది.
నేను సంపాదించుకోలేకపోతే గదా. ఆళ్ళెవరినీ డబ్బులడగటం నాకే కాదు మా అమ్మకీ ఇష్టం లేదు బాబు. నాకు మా అమ్మ మా అమ్మకి నేను అంతే. నాదెట్టాంటి జన్మ అయినా మా అమ్మకి నేనంటే చాలా ప్రేమ బాబూ. రోజుకొక్కసారైనా నువ్వు నా బంగారంరా అంటది. ఆ మాట ఇనటం నాకిష్టం.
నేను చూట్టానికి గట్టిగా కనపడతాను గానీ ఓపిక తగ్గింది బాబూ. నాదొకటే కోరిక మా అమ్మ చచ్చిపోయేవరకూ నేను బతికుండాలి. మా అమ్మ చచ్చిపోగానే నేను పుటుక్కున చచ్చిపోవాలి” అన్నాడు.
“ఆ మాటలెందుకులే గానీ.. అన్నం తినెళ్ళు” అన్నది మా ఆవిడ.
“అమ్మ వద్దమ్మా… పొద్దున వంట చేసుకొనే వచ్చాను. మా అమ్మ నాకోసం చూస్తుంటుంది. ఇంటికెళ్ళి మా అమ్మకో ముద్ద పెట్టి నేను తింటాను” అని వెళ్ళాడు.
కొన్నాళ్ళ తర్వాత…. చాలారోజుల నుండి అతను ఇంటికి రావటం లేదేంటి అని వాకబు చేస్తే “అతను వాళ్ళమ్మ ఇద్దరూ చనిపోయారు కదా తెలియదా మీకు” అన్నారొకరు.
మద్రాసు సినీ పరిశ్రమతో సంబంధమున్నవారందరికీ తెలిసే అవకాశమున్న అతని పేరు “చంద్ర”.
.
______ దేవీప్రసాద్.
Share this Article