.
మొన్నామధ్య ఓ టిఫిన్ సెంటర్‌కు వెళ్లి నా దోసె కోసం వెయిట్ చేస్తున్నా… ఈలోపు ఇద్దరు యువ భార్యాభర్తల జంట వచ్చింది… (అనుకుంటా…)… ఫాఫం భర్త ‘నాకు ప్లెయిన్ దోస చెబుతున్నా, నీకేం కావాలి’ అనడిగాడు… నాకు వినిపిస్తోంది…
‘ఛి, ఛీ… ప్లెయిన్ దోశ కుక్కలు కూడా తినవు’ అని చీదరించుకుంది… ఫాఫం, ఆ భర్త దోసె అని ఆర్డర్ ఇవ్వడానికి భయపడిపోయి ఇక ఉప్మా, పన్నీర్, ఛీజ్ పెసరట్టు అని ఆర్డరేశాడు… ఆమె ఘీ పన్నీర్ బటర్ కారం దోసె ఆర్డరిచ్చింది…
Ads
గతుక్కుమన్నాను… నేను ఆల్రెడీ ఇచ్చింది ప్లెయిన్ దోస… అది తింటుంటే, ఆ పిల్ల నాకేసి ఎలా చూస్తుందో ఊహించుకోలేక… ఆర్డర్ మార్చలేక… నా టేస్టు మార్చుకోలేక… హతవిధీ… నిన్న దోస దినం అట, అదేలెండి, దినోత్సవం అట… dosa day… అని ఎవరో రాశాడులెండి…
నిజానికి సౌత్ ఇండియన్ రెసిపీల్లో లక్షల రీల్స్, షార్ట్స్, వీడియోలు దోసపైనే… దోసె, దోశ, దోసై, దోశె… ఎలాగైనా పిలవండి… జొమాటో, స్విగ్గీ, హోటళ్ల ఆన్‌లైన్ ఆర్డర్లలో అగ్రస్థానంలో ఉండే టిఫిన్ ఎప్పుడూ దోస, అదీ మసాలా దోస…
కాకపోతే ఈమధ్య మరీ పైత్యం ఎక్కువైంది చాలామందికి… దోస మీద రకరకాల పెండ, బెల్లం అన్నీ కలిపేసి, వేసేసి, రాసేసి, రుద్దేసి ఇస్తున్నారు… ఫాఫం, కస్టమర్లూ ఏదో వెరయిటీ కావాలీ అంటున్నారు… ఒకాయన దిల్‌సుఖ్‌నగర్‌లో దోస మీద ఘీ, కారం, పన్నీర్ తురుము, క్యారెట్, కాస్త టమాటా, బటర్, నాలుగు కేప్సికం ముక్కలు వేసి… అది ఉడికాక.., మీరు చదివింది నిజమే…
అది ఉడికాక అదంతా వేరే ప్లేట్‌లోకి తీసుకుని, అది తీసేసిన దోసను వేరే ప్లేటులో పెట్టి ఇస్తుంటాడు… ధర జస్ట్ వంద రూపాయలు… విపరీతమైన గిరాకీ దానికి… అవన్నీ వేశాక అసలు ఇక దోస ఒరిజినల్ టేస్టు ఏది..? దాన్ని దోస అని ఎలా అంటాం..? హేమిటో జిహ్వకో రుచి…
సరే, మటన్ పులుసు దోస, పాయ దోస, చేపల పులుసు దోస వంటి నాన్ వెజ్ కాంబినేషన్ కూడా ఉంటాయి… మావోడే ఒకడు ఎలాంటి దోస చేసిచ్చినా సరే అంచుకు సోగి కావల్సిందే… (ఆవకాయ)… ఆనియన్ దోస విత్ పికిల్ వాడి ఫేవరెట్ ఆర్డర్…
నిజానికి దోస గానీ, వడ గానీ, ఇడ్లి గానీ… వితవుట్ చట్నీ, వితవుట్ సాంబార్ (కొన్ని హోటళ్లలో అయిదు రకాల చట్నీలు ఇస్తుంటారు…), వితవుట్ కారం పొడి తింటే వాటి అసలు టేస్టు నాలుక మీద అలా ఉండిపోవాలి కొద్దిసేపు అంటారు కొందరు మిత్రులు… నా మిత్రుడే ఇడ్లిని రా అంటే ముడి ఇడ్లిని అలాగే తింటాడు… అపరిమిత ఆనందంతో ఆస్వాదిస్తూ… ఇక బటన్ ఇడ్లీ దొరికితే ఇక తన ఆనందానికి అవధుల్లేవు…
ఈమధ్య దోస బ్యాటర్ కూడా మారిపోయింది… జస్ట్, అలా మిక్సీ చేసేసి, గ్రైండ్ చేసేసి రాత్రంతా పులియబెట్టడం పాతదైపోయింది… వాస్తవానికి పులిస్తేనే ఆ దోసకు మంచి పోషక విలువ… ఇప్పుడు ఈనో లేదా తినే సోడా కలిపేసి, అరగంటలో పెనం మీద పోయడమే…
అంతేకాదు, అటుకులతో, రాగులతో, మిల్లెట్లతో… రకరకాల దోసలు… తప్పు కాదు… వైవిధ్యం మంచిదే… కానీ పిచ్చి ప్రయోగాలు చేయకుండా… దోసల్ని దోసల్లాగా తింటే అదీ దోసల దినానికి సరైన గౌరవం, సరైన విలువ… ఎహె, నీదో చాదస్తం అంటారా..? ధన్యవాదాలు..!!
Share this Article