Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డూప్లికేట్ ‘ఆధార్’లతో డబుల్ జీతాలు… దోషులపై క్రిమినల్ కేసులు !

August 8, 2026 by M S R

.
ఉద్యోగుల వేతన చెల్లింపులపై IFMIS పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తనిఖీలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ, నకిలీ ఆధార్ మ్యాపింగ్‌లతో ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ శాఖల నుంచి అక్రమంగా వేతనాలు, రెమ్యూనరేషన్‌ పొందుతున్న ఉద్యోగుల పేర్లు బయటపడ్డాయి.

ఈ అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై విచారణ జరిపి, రికవరీతో పాటు కఠినమైన క్రమశిక్షణ చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశిస్తూ గురువారం నాడు సర్క్యులర్ మెమో (No.4079587-A/1302/A2/HRM.VII/2026) జారీ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్-ఇన్-ఎయిడ్ సిబ్బంది, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగుల ఆధార్ వివరాలను IFMIS పోర్టల్ ద్వారా ఇటీవల చేపట్టిన తనిఖీలో ఒకే ఆధార్ నంబర్‌ను ఉపయోగించి వేర్వేరు ప్రభుత్వ శాఖలు లేదా సంస్థల నుంచి ఇద్దరు లేదా ఒకే వ్యక్తి వేతనాలు పొందుతున్నట్లు గుర్తించారు. ఇది ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరచడం, మోసం చేయడమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Ads

ప్రభుత్వం జారీ చేసిన కీలక మార్గదర్శకాలు!

సమగ్ర విచారణ…: మెమోతో పాటు ఆర్థిక శాఖ పంపిన ఆధారాలను ప్రాతిపదికగా తీసుకొని ఆయా శాఖాధిపతులు తక్షణమే సమగ్ర విచారణ జరిపి అక్రమాల నిగ్గు తేల్చాలి.

కఠినమైన క్రమశిక్షణ చర్యలు…: అక్రమంగా జీతాలు పొందినట్లు తేలితే తెలంగాణ సివిల్ సర్వీసెస్ (రూల్స్) 1991 ప్రకారం సదరు ఉద్యోగిపై మేజర్ పెనాల్టీలు విధించేలా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలి.

నయా పైసాతో సహా రికవరీ…: నిబంధనలకు విరుద్ధంగా పొందిన పూర్తి వేతనాన్ని వడ్డీతో సహా రికవరీ చేయాలి.

పోలీస్ కేసులు నమోదు…: మోసం, ఇతరుల పేరుతో చెలామణి కావడం (ఇంపర్సనేషన్), ఫోర్జరీ, అధికారిక రికార్డులను తారుమారు చేయడం, నకిలీ పత్రాలు సృష్టించడం, నేరపూరిత నమ్మకద్రోహం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం తదితర అంశాలను క్రిమినల్ నేరాలుగా పరిగణించి వెంటనే పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూషన్ నిర్వహించాలి.

సహకరించిన అధికారులపైనా వేటు…: ఏ అధికారుల నిర్లక్ష్యం లేదా లాలూచీ వల్ల ఈ అక్రమాలు జరిగాయో గుర్తించి, సదరు అధికారులపై కూడా కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

ఏడు రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్!
ఈ వ్యవహారాన్ని చాలా అత్యవసరమైనదిగా పరిగణించాలని, చేపట్టిన చర్యలు, రికవరీలు, నమోదైన క్రిమినల్ కేసుల పురోగతిపై ఏడు రోజుల్లోగా ఆర్థిక శాఖకు సమగ్ర నివేదిక (Action Taken Report) సమర్పించాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ఈ ఉత్తర్వులను తక్షణం అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

ట్రెజరీ శాఖ పని తీరు ఇకనైనా మారేనా!?
నిబంధనల ప్రకారం.. ట్రెజరీ అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల వేతన బిల్లులను ఆడిట్ చేసేటప్పుడు అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలిస్తారు. ఉదాహరణకు, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన సొంత వేతనంతో పాటు మరణించిన జీవిత భాగస్వామికి సంబంధించిన ‘ఫ్యామిలీ పెన్షన్’ పొందుతుంటే, ట్రెజరీ ఆడిట్‌లో ఆధార్ వివరాల ఆధారంగా వెంటనే దానికి డియర్‌నెస్ రిలీఫ్ నిలిపివేస్తారు.

చిన్న విషయాన్ని సైతం క్షణాల్లో పసిగట్టే ట్రెజరీ సాఫ్ట్‌వేర్ మరియు అధికారులు, ఒకే ఆధార్ నంబర్‌పై ఇద్దరు వ్యక్తులు లేదా ఒకే వ్యక్తి రెండు విభిన్న శాఖల నుండి నెలనెలా పూర్తి జీతాలు విత్‌డ్రా చేస్తుంటే ఎందుకు గుర్తించలేకపోయారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ అక్రమం ట్రెజరీ అధికారుల పర్యవేక్షణా రాహిత్యాన్ని స్పష్టంగా ఎత్తిచూపుతోంది.

డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు సమర్పించే బిల్లులను కళ్లు మూసుకుని ఆమోదించారా? లేక మరేమైనా మతలబు ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమే కాదని, వ్యవస్థాగత వైఫల్యమని స్పష్టమవుతోంది.

ఖజానాకు పడుతున్న ఈ పెద్ద కన్నాన్ని పూడ్చడానికి రాష్ట్ర ట్రెజరీ అధికారులు ఇప్పటికైనా తక్షణ చర్యలు చేపట్టాలి. ప్రతి ఉద్యోగి పేమెంట్ వివరాలను ఆధార్-పాన్-సిఎఫ్ఎమ్ఎస్ (CFMS/IFMIS) ఆధారంగా క్రాస్ వెరిఫికేషన్ చేయాలి. తమ శాఖ సిబ్బందిపై విచారణ జరిపి విధుల్లో నిర్లక్ష్యం, తప్పు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

భవిష్యత్తులో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా కఠినమైన ఆటోమేటెడ్ ఆడిట్ సిస్టమ్‌ను అమలు చేయాలి. ప్రభుత్వ సొమ్ము ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలే తప్ప, వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు దోచుకోవడానికి కాదనే విషయాన్ని అధికారులు గుర్తించాలి.
-మానేటి ప్రతాపరెడ్డి.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డూప్లికేట్ ‘ఆధార్’లతో డబుల్ జీతాలు… దోషులపై క్రిమినల్ కేసులు !
  • వామికా గబ్బి ! డీసీ సినిమాకు ప్రధాన బలం ఈమె నటనే !
  • నిజంగానే ‘కొరియన్ కనకరాజు’ ఎన్టీఆర్‌ను అవమానించాడా !?
  • UPI పై చార్జీల బాదుడు ! అమెరికా ఒత్తిడే కారణమా !?
  • ‘ఏక్ దిన్’… సాయిపల్లవి ఉద్వేగ ప్రదర్శన అపూర్వం ! ఓ వసంత కోకిల !!
  • శ్రీశైలం పవర్ జనరేషన్‌పై బీఆర్ఎస్ క్యాంపు క్షుద్ర వాదన !!
  • Algorithmocracy – అల్గారిథం రాజ్యం ! రిథమ్ తప్పిన బానిస మనిషి !
  • అమ్మ ప్రేమ ! మనుషుల్లోలాగే ఉద్వేగాలు – దుఃఖం – వ్యక్తీకరణ !!
  • శకునాలు చెప్పిన తెహల్కా బల్లి కుడితి తొట్టెలో పడింది !!
  • ఇక గుడ్డివాళ్లే ఉండరు ! ఎలన్‌మస్క్ కంపెనీ అద్భుత ఆవిష్కరణ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions