మా సోప్ శరీరం రంగు చూడదు!
మా ప్రకటన భాష చూడదు!!
——————–
డోవ్ అని ఒక ఒళ్లు రుద్దుకునే సోప్. ఆ సోప్ పాఠకులకు ఒక ప్రకటన సోప్ వేసింది. ఒక ఇంగ్లీషు పత్రికలో ఫస్ట్ పేజీలో సగం, రెండో పేజీ మొత్తం ఉన్న ఈ ప్రకటనలో కనిపిస్తున్న మనిషి ఊరు, పేరు కూడా వేశారు. “No digital distortion” అని అదే ప్రకటనలో ప్రత్యేకంగా చెప్పుకున్నారు. అంటే గ్రాఫిక్స్, మార్ఫింగ్, రంగులు మార్చడం లాంటివి చేయకుండా- తీసిన ఫోటో తీసినట్లు నిజాయితీకి నిలువుటద్దంలా ప్రకటనలో వాడినట్లు మనం గ్రహించాలని వారి ప్రయత్నం. మంచిదే. ఎంత అందమయితే సరిపోతుంది? అన్న శీర్షిక కింద అయిదారు పేరాల్లో ఉన్న ఆ ప్రకటన మొత్తం చదివితే- మన కళ్లల్లో ఆనందబాష్పాలు సుడులు తిరిగి, మడుగులు కడతాయి. మన హృదయం ద్రవిస్తుంది. ఆనందం అర్ణవమవుతుంది.
Ads
బెంగళూరు అమ్మాయి నూర్ కొంచెం నల్లగా, లేదా చామన చాయగా ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్లీడు రాగానే ఇంట్లో తల్లిదండ్రులు, బంధువులు, చుట్టుపక్కలవారు, మొత్తంగా బెంగళూరువాసులు దిగులు పడ్డారు. ఈ పిల్లకు పెళ్లెలా అవుతుందని. పెళ్లికి తగిన మొహమేనా? అని ప్రశ్నలు శూలాల్లా గుచ్చుకోవడం మొదలయ్యాయి. (ఒక శుభ ముహూర్తాన ఆ అమ్మాయి డోవ్ సోప్ వాడినట్లుంది- ఈ విషయం ప్రకటనలో లేదు. సూచనగా మనం గ్రహించాలి) అంతే- నలుపో, చామన చాయో? అందమంటే ఆత్మ విశ్వాసమే. అందమంటే ఆనందమే- అని నూర్ కు తెలిసిపోయింది. ఇంకొకరు తన రంగును బట్టి తన స్థాయిని నిర్ణయించాల్సిన అవసరం లేకుండా (డోవ్ ఆసరాతో ) ఆమె సగర్వంగా నిలబడింది.
మీరు కూడా రంగు తక్కువ ఉంటే- బాధపడకుండా డోవ్ వాడండి. పెళ్లి ఆటోమేటిగ్గా జరక్కపోతే చూడండి- అన్నట్లు ఉంది ప్రకటనలో విషయం. అయితే నేరుగా చెప్పకుండా మహిళలను గౌరవిస్తున్నట్లు ఆకాశానికెత్తుతూ- డోవ్ తప్ప అన్యధా శరణం నాస్తి- అని గ్రహించవలెను- అన్నట్లు శాలువలో పెట్టి కొట్టాడు. వాణిజ్య ప్రకటనల్లో శరీరం రంగు ప్రస్తావన అసలు ఉండకూడదని ఈమధ్య అంతర్జాతీయంగా విధి నిషేధాలు వచ్చాయి. దాంతో అతి తెలివిగా డోవ్ ఈ ప్రకటనను రూపొందించినట్లుంది. శరీరం రంగు గురించి మాట్లాడకూడదు అంటూనే- ప్రకటన మొత్తం శరీరం రంగు, పెళ్లికి తగిన మొహం అవునా? కాదా? అన్న విషయాలే ఉన్నాయి. చల్లకొచ్చి ముంత దాచడం సాధ్యం కాదు. సోప్ వేసి వేయలేదని వాదించడం సాధ్యం కాదు!…… By…. పమిడికాల్వ మధుసూదన్
Share this Article