Kandukuri Ramesh Babu…….. విను తెలంగాణ- ‘కాలేరు’ కథ పెద్దది… కానీ….. ఓపెన్ కాస్ట్ క్వారీలను “బొందల గడ్డలు” అని పేర్కొనడం కెసిఆర్ గారి నుంచే పుట్టింది.
2010లో ఉద్యమం ఉప్పెనగ మారుతున్న సమయంలో సింగరేణి కార్మికులకు భరోసానిస్తూ “కుర్చీ వేసుకుని ఓపెన్ కాస్ట్ గనులను మూసేయిస్తాను” అన్న కెసిఆర్ గారు ఆ పని చేయకపోగా లాభాల్లో ఉన్న భూపాలపల్లి వంటి భూగర్భ గనులను కూడా”బొందల గడ్డలు” చేశారని విలవిలలాడుతూ కార్మికులు చెప్పడం బాధకు గురి చేసింది.
పదేళ్ల క్రితం 60 వేలకు పైగా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 39 వేలకు తగ్గిపోయింది. వారసత్వ సంపద లేదా కారుణ్య నియామకాల కింద జరుగుతున్న నియామకాల్లో అత్యధికం లంచాలతోనే జరుగుతున్నాయని చెప్పి మరోసారి వారు ఆశ్చర్యపరిచారు.
Ads
క్లరికల్ ఉద్యోగాలు, ఇంజనీరింగ్ ఉద్యోగాలు మొదలైనవి కొనుక్కోగలిగిన వారికి అందుబాటులోకి వచ్చాయని తెలిసి విస్మయం కలిగింది. కారుణ్య నియమాకాలకు కూడా ఆరు లక్షలకు పైగా ఖర్చుపెట్టిన వాళ్ళు తమ బాధలు చెప్పుకున్నారు.
గుర్తింపు పొందిన అధికార కార్మిక సంఘం, దాని కింద ఉన్న నేతలు రాజీ పడ్డ వైనాల గురించి ఒక కార్మిక నాయకుడు చెబుతూ ‘ఒకనాటి ఉద్యమ చైతన్యం గల సింగరేణియేనా మేము చూస్తున్న నేటి సింగరేణి’ అంటూ ‘కార్మికులకు ఎవరో పిరికి మందు పోసినట్లు అయింద’ని ఆవేదన చెందారు. భవిష్యత్తు నిరాశ నిస్పృహలకు గురి చేస్తూ ఉందని వివరించారు.
కార్మికుల సంఖ్య తగ్గడంతో స్కూల్స్ ఖాళీ అయ్యాయి. ఆఖరికి ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా మూత పడ్డాయి. క్వార్టర్లను కిరాయికి ఇవ్వ మన్న డిమాండ్ ఇక్కడ సహజంగా మారింది. ఒక దశలో ప్రభుత్వ మాటలను నమ్మి కారుణ్య ఉద్యోగాలు వస్తాయని నమ్మి కుదిరిన పెళ్లిళ్లు పెటాకులయ్యాయి. ప్రెగ్నెంట్ ఆయన తర్వాత కూడా కొందరికి విడాకులు అయ్యాయి.
అనేక రకాలుగా సంక్షోభం. వీటన్నిటి గురించి మరింత లోతుగా రాయవలసి ఉంది. మొత్తంగా భంగపాటు, ఆవేదన, ఆగ్రహము, నిరసనతో ఉన్న కార్మిక వర్గం స్వరాష్ట్రంలో ఇలా జరుగుతుందని ఊహించలేదని చెప్పడం విచారానికి గురిచేసింది. వారి ఆవేదన నిరసనగా మారి నాలుగు ఉమ్మడి జిల్లాలో ఉన్న 11 నియోజకవర్గాలను తీవ్రంగా ప్రభావితం చేయనుందని తెలుస్తోంది.
పరిస్థితి బాగాలేదు. కెసిఆర్ గారికి మాత్రమే కాదు, సింగరేణి భవిష్యత్తు గురించి ఈ మాట. అన్నట్టు, సింగరేణి కాలరీలను వాడుకలో “కాలేరు అంటారు. కాలేరు కథ పెద్దది. ఈ పదేళ్లలో జరిగిన అన్యాయం కడు బాధాకరం. చెప్పుకుంటే నిజంగానే సిగ్గు పోతది…
Share this Article