అరె.., ఈ డీఆర్డీవో సతీష్‌రెడ్డికి ఏమైంది..? ఏం చేస్తున్నాడు తను..? ఏం మాట్లాడుతున్నాడు తను..? కరోనా మీద మన సర్కారు పాలసీలు, ధోరణులు సమజైత లేవా..? టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాం అంటున్నాడు… ఎవరు ముందుకొచ్చినా సపోర్ట్ చేస్తాం అంటున్నాడు… సీసీఎంబీ సాయం చేసింది, డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తి చేస్తోంది, దేశవ్యాప్తంగా సప్లయ్ చేస్తాం….. ఏమిటీ ప్రకటనలు..? అసలు కొనసాగించడమా..? పీకేయడమా..? అరె… సీసీఎంబీ సాయం చేస్తేనేం..? డీఆర్డీవో సొంత పరిశోధన అయితేనేం..? మనం ప్రైవేటు వాళ్లకు ధారాదత్తం చేయాలె… సరే, డాక్టర్ రెడ్డీస్‌కు చేసేస్తున్నాం… ఆ భారత్ బయోటెక్కోడికి వేక్సిన్లు తప్ప ఈ మందులు పట్టినట్టు లేదు, లేకపోతే వాళ్లకే ఇస్తే బాగుండేది… చెప్పినట్టు వింటారు, అడిగినంతా చేస్తారు… అసలు ఈ 2డీజీ మందు అంటే ఏమనుకుంటున్నాడు సతీష్‌రెడ్డి… ఇదేమైనా ఆనందయ్య మందా..? ఎవడికిష్టమొచ్చినట్టు వాడు మాట్లాడటానికి..? నిర్ణయాలు తీసేసుకోవడానికి..?
దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది..? మన ప్రభుత్వ సంస్థలు రూపొందించినా సరే, ప్రైవేటు వాళ్లకు ఇవ్వాలి… ముందు మంచినీళ్ల సీసా ధరకు ఇస్తామని చెప్పాలి… జాతి సేవ, తొక్కాతోలూ వంటి పిచ్చి పదాలన్నీ వాడాలి… టెక్నాలజీని వేరే సంస్థలకు ఇవ్వొద్దు… ప్రపంచవ్యాప్తంగా టీకాల మేధోహక్కులు రద్దు చేయాలని అంతర్జాతీయ వేదికల మీద కొట్లాడాలి, అంతేతప్ప మన సొంత టెక్నాలజీని మన సొంత ప్రజల కోసం మన సొంత దేశీయ కంపెనీలకు మాత్రం ఇవ్వొద్దు… అదీ అలా ఉండాలి మన నిజాయితీ… డాక్టర్ రెడ్డీస్ వాళ్లకు ముందే చెప్పాలి… తక్కువ ధరలకు 25 శాతం కేంద్రానికి ఇవ్వాలి, ఎక్కువ ధరలకు రాష్ట్రాలు అడిగితే ఇవ్వాలి… ధర వాళ్లిష్టం… ఎంత దోచుకోగలిగితే అంత..? ఇక ప్రైవేటు హాస్పిటళ్లకు 25 శాతం… ఆ ధరలకు అడ్డూఅదుపూ ఏమీ ఉండవ్… మనకు 5 శాతం జీఎస్టీ కడితే సరి… వీలయితే సర్వీస్ చార్జి తీసుకోమనండి… ఇదుగో ఇలా ఉండాలి పాలసీ అంటే… లెక్కాపొక్కా ఎవడూ అడిగేది లేదు, ఎంత ఉత్పత్తి, ఎవరికెంత ఇస్తున్నారనేదీ జాన్తానై… మరి ఈయనేమిటి..? కేవలం హాస్పిటళ్లకు మాత్రమే ఇస్తాం అంటాడేమిటి..? ఈయనకెందుకు ఇవన్నీ..? మనం ప్రైవేటు వాడికి ఇచ్చేశాం, అంతే… ఏదైనా మాట్లాడితే ప్రధాని మాట్లాడాలే తప్ప ఇంకెవరూ నోరిప్పడానికి వీల్లేదు… ఇవన్నీ దేశరక్షణ రహస్యాలకన్నా సీక్రెట్ పాలసీలు… యూనివర్శల్ ఫ్రీ పాలసీ అని చెప్పాలి వీలయితే… మళ్లీ ప్రైవేటు వైపు జనాన్ని తరమాలి… అవి దండుకోవాలి… ఇవేమీ అర్థం కానప్పుడు, సతీష్‌రెడ్డిని ఇక ఆపేయమనండి… ఇంకా నయం, ఈ పొట్లాల ధరలు కూడా ఆయనే ఖరారు చేయడం లేదు, మీడియాకు చెప్పడం లేదు… ఉత్పత్తి ధరకు, ప్రైవేటులో అమ్మే ధరకూ కనీసం 50- 100 రెట్ల తేడా ఉండాలి… కరెన్సీ మైనింగ్ ఇది… తవ్వుకోవడమే… ఇకపై ఈ 2డీజీ పొట్లాల మీద ఏమీ మాట్లాడవద్దని చెప్పండి…!!
Ads
Share this Article