Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నడిపేదెవడు..? నడిపించేదెవడు..? సర్వం మేధోయంత్ర చోదనమే…

December 23, 2023 by M S R

నడిపేదెవడు? నడిపించేదెవడు? పైలట్ రహిత ప్రయాణం

తక్కువ సమయంలో యంత్రాలతో ఎక్కువ పని చేయించుకోవడం ఒకప్పుడు గొప్ప. పారిశ్రామిక విప్లవం తరువాత ప్రపంచమంతా ఫ్యాక్టరీల పొగ గొట్టాలే. సైరన్ మోతలే. యంత్రాల రోదలే. కాలం ఎప్పుడూ నిలిచి ఉండేది కాదు. ప్రవహించేది. మనుషులు యంత్రాలను నడపడం ఓల్డ్ ఫ్యాషన్. యంత్రాలను యంత్రాలే నడపడం లేటెస్ట్ ట్రెండ్. ఆమధ్య గుజరాత్ లో గుండె డాక్టర్ ఒక చోట, రోగి మరోచోట ఉండగా రోబోటిక్ పద్ధతిలో డాక్టరు ఉన్నచోటునుండే ఎక్కడో ఉన్న రోగి గుండెకు శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశాడు. ఆ గుండె గుండ్రాయిలా ఆరోగ్యంగా పనిచేస్తోంది.

ఆటోమొబైల్ పరిశ్రమల్లో ఎప్పటినుండో రోబోలు కార్లను తయారు చేసి కంటైనర్లలో లోడ్ చేసి చలో అంటున్నాయి. బెంజ్, ఆడి లాంటి కార్ల తయారీ పరిశ్రమల్లో మానవరహిత రోబో యంత్రాల పనులే ఎక్కువ. మహా అయితే మనుషుల ప్రమేయం ఇరవై అయిదు శాతం ఉంటే ఎక్కువ.

Ads

విమానాల్లో ఆటో పైలట్ మోడ్ ఎప్పటినుండో ఉంది. గగనయానంలో అంతర్జాతీయ ప్రయాణాలు పది, పదిహేను గంటలు పైబడి కూడా ఉంటాయి. మ్యాన్యువల్ గా పైలట్ ఎక్కువ భాగం చేత్తో నడిపినా- ఒకేవేగంతో ఒకే దారిలో వెళ్లగలిగే అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఆటో పైలట్ మోడ్ లో పెట్టి పైలట్ నిద్ర పోవచ్చు. పక్కన కో పైలట్ తో పిచ్చాపాటీ మాట్లాడుకోవచ్చు. ఆకాశంలో నక్షత్రాలను లెక్కపెట్టవచ్చు. ఆటో మోడ్ లో ఉంటుంది కాబట్టి-విమానం దాని మానాన అది వెళుతూ ఉంటుంది.

కొంచెం పెద్ద కార్లు, లేదా విలాసవంతమయిన కార్లలో కూడా క్రూయిజ్ కంట్రోల్ అని ఒక డ్రైవింగ్ అప్షన్ ఉంది. ఎనభై కిలో మీటర్ల వేగం దగ్గర క్రూయిజ్ కంట్రోల్ అప్షన్ నొక్కితే- ఇక ఎక్సలేటర్ తొక్కాల్సిన పనిలేకుండా ఎనభై కిలోమీటర్ల వేగంతో కారు అలా తనకు తానే వెళుతూ ఉంటుంది. మనం స్టీరింగ్ తిప్పుకుంటూ ఉంటే చాలు. బ్రేక్ వేస్తే మామూలుగానే ఆగిపోతుంది.

ఆమధ్య ఢిల్లీలో ఇంజిన్ డ్రైవర్ లేకుండా రైలు ప్రయాణించింది. అంటే డ్రైవర్ ను మరిచిపోయి ఇంజిన్ తనకు తానే వెళ్లిందని కంగారు పడాల్సినపనిలేదు. ఇది డ్రైవర్ రహిత ఇంజిన్ /రైలు. ఒక ప్రత్యేక సాఫ్ట్ వేర్ లో ముందే ప్రోగ్రామింగ్ అంతా రాసిపెడతారు. సెన్సార్, జి పి ఎస్ ఆధారిత అనేక సాంకేతిక వ్యవస్థలతో అనుసంధానం చేస్తారు. వీటి ఆధారంగా ఎక్కడ ఆగాలో అక్కడ ఆగుతుంది. నియమిత సమయం తరువాత దానంతటదే మళ్లీ బయలుదేరుతుంది. బయటి దేశాల్లో మెట్రో, మోనో రైళ్లను డ్రైవర్ రహితంగా నడపడం ఇప్పటికే ఉంది.

డ్రైవర్ రహిత కార్లను గూగుల్ ప్రయోగాత్మకంగా పరీక్షించింది. అమెరికా టెస్లా కారు భారత్ లోకి రాబోతున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీ ప్రకటించారు. కరెంటుతో నడిచే ఈ టెస్లా కారు బానెట్ ఓపెన్ చేస్తే వెనక లగేజ్ పెట్టుకునే డిక్కీలా ఖాళీగా ఉంటుంది.

అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో ఇకపై డ్రైవర్ రహిత ట్రక్కులకు అధికారికంగా అనుమతులు లభించాయి. అంటే లోడుతో లారీ ఎక్కడికెళ్లాలో దానికదిగా వెళ్లి, అన్ లోడ్ అయ్యాక ఎక్కడికెళ్ళమని జి పి ఎస్ అప్షన్స్ నొక్కితే అక్కడికి వెళుతూ ఉంటుంది.
నెమ్మదిగా కార్లు, బస్సులు, రైళ్లల్లో డ్రైవర్ లు మాయమయ్యే రోజులు వచ్చేశాయి.

రోజూ పొద్దునా సాయంత్రం పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే ఈ రోజుల్లో ఎలెక్ట్రిక్ వాహనాలు ఎప్పుడెప్పుడు వస్తాయా? అని జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. అమెరికాలో బ్యాటరీ కరెంటుతో నడిచే టెస్లా కార్లు ఎప్పుడో వచ్చాయి. ఒకసారి సెల్ ఫోన్ లా ఛార్జ్ చేసుకుంటే దాదాపు మూడు నుండి ఏడెనిమిది వందల కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. టెస్లా సైబర్ ట్రక్ పేరిట మరో కొత్త కారు అమెరికా మార్కెట్ ను ఊరిస్తోంది. ఇందులో సెల్ఫ్ డ్రైవింగ్ అంటే…కారే తనకు తానే నడుపుకునే అప్షన్ కూడా ఉండడంతో అమెరికా జనం ఎగబడి బుకింగులు చేసుకున్నారు. ధర మన కరెన్సీలో దాదాపు డెబ్బయ్ లక్షలు ఉండవచ్చు. త్వరలో టెస్లా కారులో తృతీయ శ్రేణి మోడల్ భారత్ లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి ప్రకటించారు. కాకపోతే ధర మాత్రం ఎక్కువే(అర కోటి దాకా) ఉండవచ్చు. మన లాంటి దేశాల్లో పది లక్షల ధర దాటిన కార్లు ఎక్కువగా అమ్ముడుపోవు. కాలగతిలో ఎలెక్ట్రిక్ కార్ల రేట్లు తగ్గకపొతే సామాన్యులు కొనలేరు.

తాజాగా అమెరికాలో పైలట్ రహిత కార్గో విమానాన్ని ఆవిష్కరించారు. ప్రయోగాత్మకంగా గాల్లో యాభై మైళ్ళ దూరం ప్రయాణింపచేశారు. తక్కువ దూరాల్లో కార్గో సేవలకు ఈ పైలట్ రహిత విమానాలు అనుకూలంగా ఉంటాయని దీన్ని తయారు చేసిన కంపెనీ చెబుతోంది.

ఈలెక్కన…రేప్పొద్దున ప్యాసింజర్ విమానాల్లో మాత్రం పైలట్ ఉంటాడా? తనను తానే నడుపుకునే వాహనాలు, విమానాలు వచ్చాక…డ్రయివర్లు, పైలట్లకు చోటు ఉండదు.

“నడిపేదెవడు? నడిపించేదెవడు?”
అన్న వేదాంత పాఠాన్ని నెమరువేసుకుంటూ…ముందుకు వెళ్లాల్సిందే! -పమిడికాల్వ మధుసూదన్  madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions