.
పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలే కాదు… బర్మా సరిహద్దుల్లోని పలు ఉగ్రవాద గ్రూపులకు చైనా మద్దతు ఉంటుంది… ఆ సరిహద్దులూ సమస్యాత్మకాలే…
తాజాగా ఈరోజు ఉదయం మయన్మార్‌లో ఉన్న ఉల్ఫా-ఐ (యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం-ఇండిపెండెంట్) ప్రధాన కార్యాలయంతోపాటు మూణ్నాలుగు క్యాంపుల మీద దాడులు జరిగాయి… డ్రోన్లు విరుచుకుపడటంతో అనేకమంది మరణించారు, గాయపడ్డారు…
Ads
కీలకమైన కమాండర్లు మరణించడంతో ఇక ఆ గ్రూపు మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్టేనని భావిస్తున్నారు… భారతీయ సైన్యమే ఈ దాడులు చేసిందని ఆ గ్రూపు ఓ ప్రకటన విడుదల చేసింది… ఇంకా వైమానిక దాడులు సాగుతూనే ఉన్నాయని, ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతోంది…
అంతేకాదు, ఇండియా క్షిపణులను కూడా ప్రయోగించిందని ఆరోపించింది… ఆ ప్రకటనలో.., “దాడుల్లో యునైటెడ్ లిబరేషన్ ఫోర్సెస్ ఆఫ్ అస్సాం [ఇండిపెండెంట్] లోయర్ కౌన్సిల్ గౌరవనీయ అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ నయన్ అసోం మరణించాడు.., తన అంత్యక్రియల సందర్భంగా ఈసారి ఇండియా బలగాలు క్షిపణిని ప్రయోగించడం ద్వారా మానవత్వపు అన్ని పరిమితులను దాటాయి..,
ఈ అమానవీయ దాడిలో బ్రిగేడియర్ గణేష్ అసోం, కల్నల్ ప్రదీప్ అసోం కూడా మరణించారు… అనేక మంది అధికారులు/సభ్యులు, పౌరులు గాయపడ్డారు…’’ అని ఆ గ్రూపు పేర్కొంది… ఈ గ్రూపు ఇండియా నిషిద్ధ ఉగ్రవాద జాబితాలో ఉంది…
కొన్ని వార్తాసంస్థలు కూడా ఇండియా సర్జికల్ స్ట్రయిక్స్ అనే రాస్తున్నాయి… ఈ ఆపరేషన్‌లో వందకు పైగా యుఎవిలను ఉపయోగించినట్లు, ఉల్ఫా-I మాత్రమే గాకుండా ఈశాన్య భారతదేశంలోని ఇతర వేర్పాటువాద గ్రూపుల శిబిరాలను ఈ దాడి లక్ష్యంగా చేసుకున్నట్టు కథనాలు వస్తున్నాయి…
భారతదేశం- మయన్మార్ సరిహద్దులో ఓ ప్రాంతం ఉంది… అది నాగాల స్వయం పరిపాలన మండలం… అక్కడి ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి… మయన్మార్ సైన్యంతో సన్నిహిత సమన్వయంతోనే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం…
అయితే, భారత రక్షణ దళాలు ఇప్పటివరకు అలాంటి ఆపరేషన్ జరిపినట్టు అధికారికంగా ధృవీకరించలేదు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ విలేకరులతో మాట్లాడుతూ భారత సైన్యం అలాంటి నిర్ధారణ జారీ చేయలేదని అన్నాడు… ఇంకా వివరాలు అందాల్సి ఉందని చెప్పాడు… ఇది బర్మా, ఇండియా సంయుక్త ఆపరేషన్ అని చెబుతున్నారు…
Share this Article