విన్నారా?
బార్ల వల్ల కరోనా వ్యాపిస్తోందని హై కోర్టు చెబుతోంది!
——————–
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా మద్యం అమ్ముడవుతోంది. దక్షిణాదిలో కేరళ, తమిళనాడు మద్యం అమ్మకాల్లో టాప్. మొత్తం దేశంలో అమ్ముడుబోయే మద్యంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 45 శాతం. బహుశా మరో రెండేళ్లల్లో 50 శాతం కావచ్చు. ఉత్తరాదిలో పంజాబ్ టాప్. అలాగని తెలుగు రాష్ట్రాల వినియోగం తక్కువ చేయాల్సిన పనిలేదు. ఎవరి చుక్కలు వారివి. ఎవరి కిక్కు వారిది.
——————
వైన్ షాపులు, బార్ల వల్ల కరోనా బాగా పెరుగుతోందని తెలంగాణా హై కోర్టు వ్యాఖ్యానించింది. బాధపడింది. హెచ్చరించింది. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కోర్టు అంటే రాతి గోడలు కాదు కదా? కోర్టు అంటే తీర్పులు చెప్పే న్యాయమూర్తులు కూర్చుని విచారించే చోటు. దేశమంటే మట్టి కాదు- మనుషులు. కోర్టులంటే గోడలు కాదు- మనుషులు.
——————-
Ads
నిజమే. మత్తులో లేనప్పుడే మనిషి మాస్కు మరచిపోతున్నాడు. భౌతిక దూరం గుర్తుండడం లేదు. అలాంటిది మత్తులో ఉన్నప్పుడు, మత్తుకోసం వెళ్ళినప్పుడు కరోనా జాగ్రత్తలు అసలు గుర్తుండవు.
——————-
చట్టం, న్యాయం, ధర్మం, సామాజిక బాధ్యత, ఆరోగ్యం కోసం జాగ్రత్తలు, అలవాట్లు, బలహీనతలు వేరు వేరు అంశాలు. ఒకదానితో ఒకదానికి సంబంధం ఉండవచ్చు కానీ- ఒకదానితో ఒకటి తాత్వికంగా విభేదించుకుంటూ ఉంటాయి.
చట్టం:-
ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. లేదా చట్టబద్దంగా పాలన చేస్తాయి. ప్రభుత్వ చట్టం ప్రకారం మద్యం అమ్మకాలు జరుగుతాయి. చట్టమే మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తుంది. చట్టమే మద్యం తాగడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంతకంటే మద్యం విషయంలో చట్టం ప్రస్తావన అనవసరం.
న్యాయం:-
చట్టప్రకారం మద్యం అమ్మకాలు, ధరలు, ప్రమాణాలు, తాగడాలు , వేళలు ఉన్నాయా లేవా అన్నది మాత్రమే న్యాయపరిధిలోకి వస్తుంది. న్యాయం ఎప్పుడయినా ఓపికగా వినాలే కానీ- వెళ్లి చూడడం దాని పరిధి కాదు. ఇంతకంటే న్యాయాన్యాయాల సమీక్షకు చట్టం ఒప్పుకోదు.
ధర్మం:-
ధరించేది ధర్మం. అంటే ఆచరణలో పాటించేదే ధర్మం తప్ప, నోటి మాటతో చెప్పేది ధర్మం కాదు- అన్నది వ్యాకరణ ధర్మం ప్రకారం ఆ మాటకు అర్థం. ఎవరి ధర్మం వారికి గొప్పది. ఈరోజుల్లో శుభాశుభాలకు తాగడం నవీన ధర్మం. వీకెండ్ తాగకపోతే అధర్మం. విషాదాన్ని మరచిపోవడానికి తాగడం ధర్మం. వివాహానికి ముందు బ్యాచిలర్ పార్టీ మందు ఒక ధర్మం. కాళ్ల పారాణి ఆరకముందే, సంగీత్ కుప్పి గంతుల ఒళ్లు నొప్పులు తగ్గక ముందే విడిపోతే బ్రేకప్ పార్టీల్లో మందు విందు చిందు ఒక ధర్మం. సాయంత్రమయితే బాటిల్స్ అప్ చీర్స్ దానికదిగా ఒక ధర్మం.
ఇక మిగతా సామాజిక బాధ్యత, అలవాట్లు, దురలవాట్లు, ఆరోగ్యకరమయిన జాగ్రత్తలు లాంటి అంశాలు డిబేటబుల్ సబ్జెక్టులు. ఎవరి కోణం వారిది. ఒకరి తప్పు ఇంకొకరికి ఒప్పు కావచ్చు. ఒకరి ఒప్పు ఇంకొకొరికి తప్పు కావచ్చు. మద్యం షాపుల దగ్గరే కరోనా వస్తోంది అంటే- సినిమా థియేటర్ల దగ్గర రాదా? కరోనా వ్యాపించకుండా బాధ్యతగా విద్యాలయాలను చట్టం మూసేసింది. అదే చట్టం బార్లు, థియేటర్లను తెరిచి ఉంచింది. అంటే శాస్త్రీయంగా బార్లలో, థియేటర్లలో కరోనా వ్యాపించదు అని గ్రహించడం మన కనీస ధర్మం. అది గ్రహించలేకపోతే మన ఖర్మం….. By…. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article