పొడిరొట్టెలు
~~~~~~~~~
గాలికి కొట్టుకపోయే, రొట్టెలు కాదు..
దాచుకుంటే పాచిపోయేది– బియ్యపు అన్నం.
రొట్టెలు మాపటికి- రేపటికి మరింత రుచిదేరుతయి.
పాచిపోవు, పీచుగావు, ఈగకూ దోమకూ వాటం లేదు.
జొన్న రొట్టె, సజ్జ రొట్టె, మక్క రొట్టె, వరి రొట్టె…
ఏ రొట్టె అయితేంది, గాలికి ఆరబెడితే అయిపాయె.
రొట్టెలు, పదిరోజులదాకా ఉట్టిమీది గాసంగ పనికొస్తయి.
పలపల ఎండిన రొట్టె రుచికూడా కమ్మకమ్మగ తయారైతది.
ఎల్లిపాయ మిరం, ఉడికిచ్చిన కారం, పచ్చి కారం,
చింతపండు తొక్కు, పల్లీల తొక్కు నువ్వుల తొక్కు,
ఒక్క తొక్కులేనా, కూరలు, పులుసులు, పెరుగులు…
ఎవ్వుంటే అవ్వి, ఎండిన రొట్టెలకు మెండుగ రుచినిస్తయి.
కట్టెల పొయి మీద రొట్టెలు జేసి, పొయిదాపున కాకజూపి
తట్టగంప నిండ నిలబెడితే, నాలుగు రోజులు తింటెదంగయి.
చుట్టాల మార్గం బొయినా, తీర్థం బొయినా, మన్నెం బొయినా
పాతబట్టల నాలుగైదు రొట్టెలు, కొబ్బరి చిప్పల ఇంత తొక్కు,
సొరకాయ చిక్కంల నీళ్లు. అది ఎంత రామచక్కదనపు సద్ది.
ఇప్పటి పిచ్చి కవర్లలొల్లి లేదు. క్యాన్సరు రోగాల బాధ లేదు.
గామధ్యనెప్పుడో గోండోళ్లంతా ఢిల్లిల ఓ పెద్ద సభ వెట్టుకున్నరు.
దేశంవున్న గోండులందరూ ఈ రొట్టె సద్దులతోటే బయలెల్లిండ్రు.
మన ఆదిలబాదుకెల్లే వందలు వేలు రొట్టెలు పయనం కట్టినయి.
వారం రోజులదాక వాళ్లకు బయటి తిండి జోలి లేదు జోక్యం లేదు.
అడవిల ఉండేటోళ్లు ఎంత తెలివిమంతులో మన మతికందుద్దా.
మనమే గొప్ప మాదే చదువువనుకునే ఖాళీ విస్తర్లం గదా మనం.
వాళ్ల తిండి ముందట, మన తిండి గాలికి కొట్టుకపోక ఇంకేంజేస్తది.
ఇది.. మన తిండి – మన అనాది సంస్కృతి మనాది.
~డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
———————————————————–
ఇవి కొర్రరొట్టెలు. పచ్చప్పటికంటే.. ఎండినంకనే రుచి హెచ్చినయి (స్టోరీ కవర్ ఫోటో)
Share this Article