Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టచింగ్ రిప్లయ్… సీఎం రేవంత్ ఆఫర్‌కు మనసు కదిలించే ప్రతిస్పందన…

December 17, 2023 by M S R

Domakonda Nalini….. గౌరవనీయులైన cm గారు! మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది.

ఈ నేపథ్యంలో గతం ఒక రీల్‌లా నా కళ్ళ ముందు కదులుతుంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండెడ్ ఆఫీసర్ గా ‘సోషల్ స్టిగ్మా ( మరక) ‘ను మోసాను. నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏండ్లు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, 2009 డిసెంబర్ 9 న నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది.

నాటి సీఎం రోశయ్య గారు మహిళా దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే , నేను రాజీనామాను విత్ డ్రా చేసుకొని డిపార్ట్మెంట్‌లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యురోక్రసిపైనే నమ్మకం పోయేలా చేశాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌లో పోస్టింగ్ ఇచ్చి, నాకు ఛార్జ్ మెమోలు ఇచ్చి ఎక్స్‌ప్లనేషన్స్ రాయమనడం , annual confidencial reports లో అడ్వర్స్ ( చెడు) రిమార్క్ రాయడం, బ్యాచ్‌లో నా ఒక్క దానికే ప్రమోషన్‌ను ఆపేయడం, ప్రోబేషన్ పీరియడ్ ఎక్స్‌టెండ్ చేయడం వంటివి చేశారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు. ఈ విషయాలన్నీ నన్ను ఆనాటి cm కిరణ్ కుమార్ రెడ్డి గారికి మొర పెట్టుకొనేలా చేశాయి.

Ads

ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అప్పాయింట్‌మెంట్ కూడా దొరకలేదు. బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్ళు నాకు సహాయం చేయక పోగా, నన్ను ఎగతాళి చేశారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి, సోనియా గాంధీజీకి లేఖలు రాసి నా పరిస్థితిని, రాష్ట్ర దుస్థితినీ వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్ళీ పాల్గొనడం అనివార్యం అనిపించింది. అందుకే 1.11.2011 న ఫార్మాట్‌లో డీజీపీాకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్ళాను. శ్రీ కృష్ణ కమిటీ ప్రభావంతో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు. ఆనాడే నాకు డిపార్ట్మెంట్ పట్ల ఏహ్య భావం కలిగింది. సుష్మా స్వరాజ్ గారు నల్గొండ సభకు ఆ రోజే రావడం, నన్ను అర్థం చేసుకొని అక్కున చేర్చుకోవడం నాకు కాస్త స్వాంతన చేకూర్చింది. నాలోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్‌ను ఆ రోజే హత్య చేశారు.

ఈనాడు 12 ఏండ్లు పూర్తి అయిన తర్వాత తెలంగాణా మూలాలు కలిగిన ఒక cm గా మీరు నా case ను Exhumation ( పూడ్చిన శవాన్ని వెలికితీయడం) చేస్తున్నారు. మరణ కారణం తెలుసుకోవాలి అనుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇన్నాళ్లకు నా పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే ఒక సందర్భం సృష్టించారు. మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్ళలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థం అయ్యింది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది నిరూపణ అయ్యింది.

ఉద్యమంలో నేను నిర్వహించిన కీలకమైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది. కాని నా బంధు మిత్ర పరివారం మాత్రం అందరూ నన్ను వెలివేశారు. solitary confinement అనే శిక్షను 10 ఏండ్లు అనుభవించా. పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయాను. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవచ్చవం లా బతికాను.

రెండేండ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. జీవితంలో పది జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను. చాలు. ఇంకా నేను ఎవరి కోసం ఇంకెటువంటి త్యాగమూ చేయలేను . జన్మ రాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను. వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం. దీని వల్ల నా ఆత్మ ఉన్నతితో పాటు, సమాజ ఉన్నతికి కూడా పాటుపడొచ్చు. కాబట్టి నా పంథా మార్చుకోలేను.

మీరు భావిస్తున్నట్లు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను. ఎందుకంటే నా అమూల్య సమయాన్ని బ్యురోక్రసికి వెచ్చించలేను. శ్రేయోమార్గం విడిచి మళ్ళీ ప్రేయోమార్గం వైపు రాలేను. అన్ని దానాల్లో గొప్పదైన విద్యా దానాన్ని చేస్తూ, పుణ్యం మూటకట్టుకోవాలనే కోరిక తప్ప నాకు ఇంకేమీ లేదు.

పరమేశ్వరుడు నన్ను క్రిమినాలజీ ( న్యాయ దర్శనం) నుండి ఫిలాసఫీ ( తత్త్వ శాస్త్రం) వైపు నడిపించాడు. గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు. నా వాణిలో మాధుర్యం నింపి నన్ను ఆచార్యను చేశాడు. నా ఈ ప్రస్థానం (డీఎస్పీ నుండి డిఎన్ఎగా మారడం) చాలా సంఘర్షణ మయం, వేదనా భరితం. నన్ను ఈ ఉద్యోగం నుండి ఎవరూ సస్పెండ్ చేయలేరు. నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు. కాబట్టి అంతిమంగా నేను cm గా మిమ్మల్ని కోరేది ఏమిటంటే నాపై కరుణ చూపి స్టేటస్ కో అనుమతించండి. నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్మెంట్‌లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి. మీలో మంచి స్పార్క్ ఉంది. మీ నుండి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తుంది. మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువైంది. కాబట్టి నాలో లోకేషన, విత్తేషనలు కూడా పోయాయి.

ఇక నాకు మీరు న్యాయం చేయాలి అంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్‌ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ , సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను.

( నేను మిమ్మల్ని కలవాలి. కాని ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలాలైన ‘వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నాను. హిందీ ప్రూఫ్ చూసే పనిలో బిజీగా ఉన్నాను. మహర్షి 200 వ జయంతి వరకు అది సిద్ధం కావాలి. సమయం ఎక్కువగా లేదు. అందుకే అది అయిపోగానే దాన్ని ప్రింటింగ్ కు ఇచ్చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఈలోగా మీడియా మిత్రులు నా ప్రతిస్పందన తెలుసుకోవాలి అని ఇంటర్వ్యూ అడుగుతున్నారు. అందుకే ఇలా నా ఫేస్బుక్ లో బహిరంగ లేఖ రాయాల్సి వస్తుంది.) ఇట్లు… ఒక సనాతనీ, డి.నళినీ ఆచార్య, యజ్ఞ బ్రహ్మా, వేద ప్రచారకురాలు…….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions