Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పుడు డీటీపీతో మాకేం పని అన్నారు… ఇప్పుడదే నడిపిస్తోంది!

February 3, 2025 by M S R

.

(శంకర్‌రావు శెంకేసి, 79898 76088) టెక్నాలజీ తోడ్పాటులేని రంగమే లేదిప్పుడు. ప్రపంచమంతా స్మార్ట్‌ఫోన్‌లో ఇమిడిపోతున్న కాలంలో అప్‌డేట్‌ అవుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడం అనివార్యం. లేదంటే ఔట్‌డేట్‌ కాక తప్పదు.

ఏదైనా టెక్నాలజీ కొత్తగా తెరపైకి వచ్చినప్పుడు దానికంత ఈజీగా అలవాటుపడటం జరగదు. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వచ్చినప్పుడు అవి కేవలం సంపన్నులకే పరిమితం అనుకున్నారు. ఇప్పుడు మార్కెట్‌లో కూరగాయలు అమ్మే వారు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ను అలవోకగా చేసి పారేస్తున్నారు. కాలంతో పాటు అవసరం తెచ్చే మార్పు అది.

Ads

ముప్పై ఏళ్ల క్రితం పత్రికారంగంలోకి టెక్నాలజీ ప్రవేశిస్తున్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. 1995లో గుజరాత్‌ మూలాలున్న వ్యాపారవేత్త రామ్‌శరణ్‌ సంఘీ కుటుంబం తెలుగునాట ‘వార్త’ పేరుతో కొత్త పత్రికకు అంకురార్పణ చేసింది.

‘తెలుగు అక్షరంతో తొలి అంతరిక్ష ప్రయోగం..’/ ‘తెలుగు ప్రజలకు సంఘీభావం’.. వంటి ఆకర్షణీయమైన నినాదాలతో ‘వార్త’ను తెరపైకి తీసుకువచ్చింది. అన్నిటికీ మించి నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంది. అప్పటికే సంచలన పత్రికగా పేరుపొందిన ‘ఉదయం’ అంపశయ్యపైకి చేరగా, ఈనాడుకు ప్రత్యామ్నాయం అంటూ ‘వార్త’ ముందుకువచ్చింది.

1995 ఫిబ్రవరి 20న హైదరాబాద్‌ కోఠిలోని గుజరాతీ గల్లీలో తొలి బ్యాచ్‌కు శిక్షణ మొదలైంది. శిక్షణలో థియరీ క్లాసుల‌ కంటే కంప్యూటర్లపైన తెలుగు డీటీపీ నేర్చుకోవడాన్ని మొదటి ప్రాధాన్యంగా పెట్టారు. వార్తలు రాయడం, ఎడిటింగ్‌ చేయడం, పేజీలను డిజైన్‌ చేయడం.. అన్నింటినీ కంప్యూటర్‌లోకి కుదించారు.

ఆ మేరకు కోర్సును డిజైన్‌ చేశారు. యాపిల్‌ కంప్యూటర్లను పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తెచ్చారు. అప్పటికే తెల్లకాగితాలపై వార్తలు రాయడం, తిరగరాయడం అలవాటైన వారికి డీటీపీ శిక్షణ పేద్ద ‘శిక్ష’గా కనిపించింది. కంప్యూటర్లతో మాకేం పని అంటూ అప్పుడందరూ పెదవి విరిచారు.

ఓసారి యాపిల్‌ కంప్యూటర్స్‌ సంస్థకు సంబంధించిన నిపుణుడొకరు ట్రెయినింగ్‌ క్లాస్‌కు వచ్చినప్పుడు ‘మేం జర్నలిస్టులం.. కంప్యూటర్‌ ఆపరేటర్లం కాదు, మాకెందుకు ఈ శిక్షణ..?’ అంటూ చెమికల రాజశేఖర్‌రెడ్డి అనే ట్రెయినీ జర్నలిస్టు ప్రశ్నిస్తే, ‘మమ్మ‌ల్ని కార్మికులుగా మార్చేస్తున్నారా..’ అని మ‌రో ట్రెయినీ సాత్య‌కి (గుంటూరు శేషేంద్ర‌శ‌ర్మ కుమారుడు) గుర్రుమ‌న్నారు.

రాబోయే పత్రికారంగమంతా డీటీపీ పైనే ఆధారపడి ముందుకుసాగుతుందని సదరు నిపుణుడు చెప్పిన మాటలను అప్పుడెవరూ నమ్మలేదు. జర్నలిస్టులను డీటీపీ ఆపరేటర్లుగా మార్చే ప్రయత్నమని కొందరు, కంప్యూటర్‌ ఆపరేటర్ల పనిని కూడా జర్నలిస్టులతో చేయించే శ్రమదోపిడీ కుట్ర అని మరికొందరు రకరకాలుగా నిర్వచనాలు ఇచ్చుకున్నారు. చివ‌ర‌కు ఉద్యోగ‌ధ‌ర్మంలో భాగంగా అంద‌రూ నేర్చుకోక త‌ప్ప‌లేదు.

ఈ శిక్ష‌ణ ప‌ట్ల మేనేజ్‌మెంట్ ఎంతో ప‌ట్టుద‌ల‌తో ఉండేది. ఓసారి క‌రెంటు లేద‌నే కార‌ణంతో ట్రెయినీలు ల్యాబ్ బ‌య‌ట వెయిట్ చేస్తుండ‌గా, అప్పుడే అక్క‌డికి ఎం.డి. గిరీశ్‌సంఘీ వ‌చ్చారు. విష‌యం ఏమిటో తెలుసుకున్నారు.

తానే స్వ‌యంగా జ‌న‌రేట‌ర్ గ‌దిలోకి వెళ్లి స్విచ్చాన్ చేసి వ‌చ్చి, మ‌న ప‌ని మ‌నం చేసుకుంటే త‌ప్పులేదు.. అంటూ అంద‌రూ వెంట‌నే ల్యాబ్‌లోకి వెళ్లాల‌ని కోరారు. అప్పుడు డీటీపీ శిక్ష‌ణ ఎంత ప‌క‌డ్బందీగా ఉండేదో చెప్ప‌డానికే ఈ ఉదాహ‌ర‌ణ‌.

ఇక్కడ సీన్‌ కట్‌ చేస్తే- ‘వార్త’ మొదలైన కొంతకాలానికే అన్ని పత్రికలూ డెస్క్‌లను, రిపోర్టింగ్‌ వ్యవస్థను ఆటోమైజేషన్‌ చేసేశాయి. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి స్టాఫ్‌రిపోర్టర్లు, సబ్‌ఎడిటర్లకు డీటీపీనీ నేర్పించాయి. క్షేత్రస్థాయిలోని కంట్రిబ్యూటర్లకు కూడా డీటీపీని తప్పనిసరి చేశాయి. ట్రెయినీ బ్యాచ్‌ల‌కు కోర్సును రూపొందించాయి.

దీంతో ప్రింట్ జర్నలిజం సమూలంగా మారిపోయింది. వేగం పెరిగింది. ఒకప్పుడు కాగితాలపై వార్తలు రాయడానికి, వాటిని క‌వ‌ర్ల‌లో, టీపీల‌లో డెస్క్‌ల‌కు పంప‌డానికి నానా తిప్పలు పడే రిపోర్టర్లకు కంప్యూటర్‌పై డీటీపీ కంపోజింగ్‌ ఎంతో సులువుగాను, అనుకూలంగానూ మారిపోయింది. వార్త రాసిన క్ష‌ణాల్లోనే పంపే వీలు క‌లిగింది.

ఇక పేజీల డిజైన్‌లో బ్రొమైడ్‌ పద్ధతి పోయి కంప్యూటర్‌ తెరపైనే పేజీలను అద్భుతంగా రూపొందించే అవకాశం డెస్క్‌ సిబ్బందికి అందుబాటులోకి వచ్చింది. వార్త‌ల్ని తిర‌గ‌రాయ‌డం అనే ప్ర‌క్రియ.. వేగవంతం కావ‌డమే కాదు, ఎఫెక్టివ్‌గానూ మారిపోయింది.

‘వార్త’కు తొలి రోజుల్లో అసోసియేట్‌ ఎడిటర్‌గా వున్న సతీశ్‌చందర్‌.. ఓసారి వరంగల్‌ ఎడిషన్‌కు వచ్చినప్పుడు డీటీపీ కంపోజింగ్‌కు అలవాటు పడని ఓ స్టాఫ్ రిపోర్ట‌ర్‌ను ఉద్దేశించి ‘కంపోజింగ్‌ నేర్చుకొన‌నిచో ఇంటికి వెళ్లవచ్చును..’ అని మెత్తగా మందలించడం ఇప్పటికీ గుర్తు.

విచిత్రమేమిటంటే డీటీపీ కొందరికి అలవోకగా అలవాటైతే, మరికొందరికి ఎంతకీ వచ్చేది కాదు. సతీశ్‌ చందర్‌ మందలింపునకు లోనైన సదరు సీనియర్‌ స్టాఫర్‌.. ముప్పై ఏళ్లయినా ఇప్పటికీ కంపోజింగ్‌ను నేర్చులేకపోయారు.

ఆయా ప‌త్రికాసంస్థ‌ల యాజ‌మాన్యాలు త‌మ‌ జ‌ర్న‌లిజం క‌ళాశాల‌ల్లో డీటీపీ కోసం ప్రత్యేక‌మైన ల్యాబ్‌ల‌ను, ఫ్యాక‌ల్టీల‌ను ఏర్పాటు చేసుకున్నాయి. ఇక జిల్లాల్లో కంట్రిబ్యూటర్లను, స్ట్రింగ‌ర్ల‌ను నియమంచే ప్రక్రియలో డీటీపీ నాలెడ్జి కూడా ఇప్పుడు ఒక అర్హతగా మారిపోయింది.

డీటీపీ కొరకరాని కొయ్యగా మారిన వారు.. సొంత డబ్బులు వెచ్చించి డీటీపీ ఆపరేటర్లను పెట్టుకొని వారి చేత వార్తలు కంపోజింగ్‌ చేయిస్తూ ఎడిషన్‌ సెంటర్లకు పంపిస్తున్నారు. పత్రికారంగంలో డీటీపీ ఎంత ముఖ్యమైన అంశంగా మారిపోయిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ.

డెస్క్‌ల్లో పేజీలను ఫోటోషాప్‌లో పెట్టడం అందరు సబ్‌ఎడిటర్లకు సాధ్యం కాదు. వార్త‌ల‌ను ఎడిట్ చేసుకొని, ఆ ఒత్తిడిలో పేజీలను క్రియేటివ్‌గా డిజైన్ చేయ‌డం అంత సులభం కాదు. అందుకే ఇప్పుడు పేజీ డిజైనర్లకు (లే అవుట్‌ ఆర్టిస్ట్‌) బాగా డిమాండ్‌ పెరిగింది.

వాట్సాప్‌ గ్రూపులలో హల్‌చల్‌ చేసే డిజిటల్‌/ పీడీఎఫ్‌ పత్రికల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన నేపథ్యంలో.. జర్నలిస్టులకు విలువ లేకుండా పోతుండ‌గా, పేజీల డిజైనర్లకు మాత్రం మంచి పేమెంట్స్‌ దక్కుతున్నాయి. అయితే డెస్క్‌ల్లో సబ్‌ఎడిటర్ల చేత పేజీలు పెట్టించడంపై ఇప్ప‌టికీ భిన్నాభిప్రాయలున్నాయి. ఇది మరోసారి చెప్పుకోవాల్సిన‌ అంశం.

మూడు దశాబ్దాల క్రితం ‘మేం జర్నలిస్టులం.. కంప్యూటర్‌ ఆపరేటర్లం కాదు, మాకెందుకు ఈ శిక్షణ..?’ అన్ని ప్రశ్నించిన చెమికల రాజశేఖర్‌రెడ్డి.. ఇప్పుడు తన జ‌ర్న‌లిస్టిక్ పనినంతా డీటీపీలో త‌నే స్వయంగా చేసుకుంటున్నారు. ఇది ఒక వైరుధ్యం అనేకన్నా, కాలం తెచ్చిన మార్పు అనడం సమంజసం. 30 ఏళ్ల క్రితం డీటీపీ పాఠాలు నేర్పిన కేవీఆర్… ఇప్పటికీ తన శిక్షణను నిరాఘాటంగా కొనసాగిస్తూనే ఉన్నారు.

అన్న‌ట్టు.. ఒక‌ప్పుడు జ‌ర్న‌లిస్టు అంటే సింబాలిక్‌గా క‌లాన్ని చూపించేవారు. మూడు ద‌శాబ్దాల డీటీపీ జమానాలో క‌లంతో పెద్ద‌గా ప‌నిలేకుండా పోయింది. న్యూస్ ప్రొడ‌క్ష‌న్‌ అంతా కంప్యూట‌ర్‌పైనే అవుతోంది. ఇప్పుడు జ‌ర్న‌లిస్టుకు సింబాలిక్‌గా క‌లం సూట్ కావ‌డం లేద‌నే అభిప్రాయ‌మూ ఉంది.

అంతేకాదు, ఇది ఫ‌లానా గొప్ప రిపోర్ట‌ర్ రాసిన స్క్రిప్టు అని వెతికి తీసి ప్ర‌ద‌ర్శించే చారిత్రక అవ‌కాశం కూడా లేకుండా పోయింది. ఔరా.. డీటీపీ ఎంత ప‌నిచేసింది…!?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions