2014 ఎన్నికలు ముగిసిన సందర్భం.. ఫలితాలు కూడా వచ్చాయి.. ఉదయాన్నే నేను ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతుంటే ఫోన్ మోగింది.. చూస్తే అది కోనేరు ప్రసాద్ గారి పర్సనల్ నంబర్ నుంచి.. విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా కేశినేని నాని విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన కోనేరు ప్రసాద్ ఓడిపోయారు.. ఇదేంటి ఈయన నుంచి ఫోన్ వచ్చింది అనుకున్నాను..
అశోక్.. నేను కోనేరు ప్రసాద్ ని మాట్లాడుతున్నాను..
హా.. సర్.. సారీ చాలా కష్టపడ్డారు.. కానీ ఓడిపోయారు సర్ అన్నాను.. (ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి)
Ads
రాజకీయాలన్నాక గెలుపోటములు సహజం.. గెలిస్తే బెజవాడకి ఏదో చేద్దామనుకున్నాను.. అవకాశం లేకుండా పోయింది.. మన బెజవాడోళ్లకి నేను నచ్చలేదు.. అయినా పర్వాలేదులే.. గెల్చిన కేశినేని నాని చాలా మంచోడు.. కల్మషం లేని వ్యక్తి.. బాగా పని చేస్తాడు
నాకు ఆశ్చర్యం వేసింది.. తనమీద గెల్చిన రాజకీయ ప్రత్యర్థి గురించి ఆయన అలా మాట్లాడటం నిజంగా ఆశ్చర్యమేసింది
సరేగానీ .. నేను కేశినేని నాని ఇంటికి వెళ్తున్నాను.. మీరు కూడా వస్తారా.. అన్నారు
ఆయన ఇంటికి ఎందుకు సార్ అన్నాను
జస్ట్ ఆయన్ని అభినందించి హైదరాబాద్ వెళ్లిపోతాను
ఆయన మీమీద గెలిచారు సార్.. మీకేమీ ఫీలింగ్ లేదా?
ఫీలింగ్ ఎందుకు? ఆయన్ని జనాలు గెలిపించారు.. గెలిచాడు.. నన్ను జనాలు వద్దనుకున్నారు..ఓడిపోయాను అంతే..
కానీ ఓడిపోయిన వ్యక్తి గెల్చిన వ్యక్తి ఇంటికి వెళ్లడం ఆశ్చర్యమే..
రాజకీయాలు మారాలి అశోక్ గారు.. పార్టీలు వేరు కావొచ్చు.. కానీ మనం మనుషులం కదా.. అన్నారు
ఇదే కోనేరు ప్రసాద్ వ్యక్తిత్వం.. అన్నట్టుగానే కాసేపటికి ఎనికేపాడులో కేశినేని నాని ఇంటికి వెళ్లి ఆయన్ని అభినందించి అక్కడే బ్రేక్ ఫాస్ట్ చేసి వచ్చారు కోనేరు ప్రసాద్..
మరో సందర్భంలో అదే ఎన్నికల్లో నేను పని చేసే ఛానెల్లో యాంకర్ ఝాన్సీతో చర్చా కార్యక్రమం పెట్టాం.. మురళి ఫార్చ్యూన్ హోటల్లో ఆ డిబేట్ కి అన్ని పార్టీల నుంచి నాయకులని పిలిచాము.. వైసీపీ తరఫున కోనేరు ప్రసాద్, టీడీపీ తరఫున దేవినేనిఉమా హాజరయ్యారు.. డిబేట్ కు ముందు దేవినేని ఉమా కూర్చున్న సీట్ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు కోనేరు ప్రసాద్.. దేవినేని ఉమా కొంత బిడియ పడుతుంటే.. మనం మనం మనుషులమయ్యా.. పార్టీలుంటాయి.. పోతాయి.. మనుషుల మధ్య బంధాలు ఎక్కడికి పోతాయి.. నువ్వునేను ఇద్దరం బెజవాడోల్లం.. మనిద్దరం వేర్వేరు పార్టీల్లో ఉన్నంత మాత్రాన శత్రువులమా ఏంటి అని నవ్వుతూ మాట్లాడారు..
ఈ రెండు సందర్భాల్లో కోనెరుప్రసాద్ లో ఒక మంచి మనిషి కనిపించారు.. ఏమాత్రం అహంకారం లేకుండా.. డౌన్ టు ఎర్త్ అన్నట్టుగా ఉండేవారు.. నిజానికి నాకు ఆయన పరిచయం లేదు.. అప్పటివరకూ ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సీబీఐ అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్లిన వ్యక్తి అని మాత్రమే తెలుసు..
2014 ఎన్నికల్లో అప్పటివరకూ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించలేదు.. ఒకరోజు సడెన్ గా బందరు రోడ్డులో డివి మెనర్ హోటల్ సమీపాన ఒక హోర్డింగ్ వెలిసింది.. అందులో కోనేరు ప్రసాద్ ఫొటోతో పాటు ఆయన కోనేరు చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఈ హోర్డింగ్ ఉంది.. అప్పుడే నేను బ్రేకింగ్ పెట్టాను.. బెజవాడవైసీపీ ఎంపీ అభ్యర్థిగా కోనేరు ప్రసాద్ అని .. ఆ బ్రేకింగ్ చూసి అందరూ ఆశ్చర్య పోయారు.. ఆయన ఏంటి? బెజవాడ నుంచి పోటీ చేయడం ఏంటి అని?
బ్రేకింగ్ చూడగానే కేశినేని ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది.. ఇది నిజమేనా అని!!
రెండు రోజుల తర్వాత అది ఖరారయింది.. అదే రోజు బెజవాడ వచ్చిన కోనేరు ప్రసాద్.. డివి మెనర్ ప్లాజా హోటల్లో ప్రెస్ మీట్ పెట్టారు.. ఆయన చుట్టూ భారీ హంగామా.. మందీ మార్బలం.. నానా హడావిడి..
మీరు ఎమ్మార్ ప్రాపర్టీస్ లో సీబీఐ అరెస్ట్ చేసింది కదా?
ఒక అవినీతి కేసులో అరెస్ట్ అయి ఇలా ఎంపీగా ఎలా పోటీ చేస్తారు?
ఇంకా దోచుకోవడానికి మళ్ళీ ఎన్నికల్లో దిగుతున్నారా?జైల్లో చిప్పకూడు తిని వచ్చి పార్లమెంట్ లో ఎలా అడుగుబెడతారు? ఇవన్ని
ప్రెస్ మీట్ లో నేను అడిగిన ప్రశ్నలు ఇవి.. అపుడు అయన పక్కన గౌతమ్ రెడ్డి, జలీల్ ఖాన్,సామినేని ఉదయభాను ఉన్నారు
ఇంత హార్డ్ గా నేను అడుగుతుంటే వాళ్లంతా నావైపు కొంచెం సీరియస్ గా చూస్తున్నారు
కాని కోనేరు ప్రసాద్ మాత్రం ఏమాత్రం విసుక్కోలేదు? ఎక్కడా ఆయన ముఖంలో హావభావాలు మారలేదు.. నవ్వుతూనే అన్నింటికీ సమాధానాలు చెప్పారు..
ప్రెస్మీట్ అయ్యాక భోజనాలు చేస్తుంటే ఆయన నా దగ్గరకు వచ్చారు.. ఏమి అశోక్ నన్ను పోటీ చేయకుండానే హైదరాబాద్ పంపించేస్తావా.? అని నవ్వుతూనే చమత్కరించారు..
ఈయన పెద్ద రెబల్ రిపోర్టర్ అండీ అని గౌతంరెడ్డి అన్నారు
అయితే నీతో కాస్త జాగ్రత్తగా ఉండాలన్నమాట.. రోజూ తిట్టకుండా అప్పుడప్పుడు కాస్త నాగురించి మంచి న్యూస్ కూడా ఇవ్వమ్మా.. అన్నారు నవ్వుతూ
బెంజ్ సర్కిల్లో భారీ ఎత్తున పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసారు.. ఆఫీస్ చాలా రిచ్ గా ఉండేది.. ఎప్పుడూ హడావిడిగా ఉండేది..
ఒకరోజు నేను ఆయన ఆఫీస్ కి ఇంటర్వ్యూకి వెళ్ళగానే అపాయిట్మెంట్ తీసుకోవాలని బయటే ఆపేశారు.. ఎవరో మహిళా బాబ్డ్ హెయిర్ తో ఉండేది.. బహుశా ఆయన చెల్లెలు అనుకుంటాను..
సీసీ కెమెరాలోచూసిన ఆయన స్వయంగా బయటకు వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్లారు.. నన్ను కలవడానికి అపాయిట్మెంట్లు ఏంటి? నేనేమన్నా దేశ ప్రధానినా? ఇలాంటి బోడి రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టకండి.. జనాలు అయినా మీడియా వాళ్లైనా పార్టీ వాళ్లైనా ఎవరైనా సరే నా దగ్గరకు రావొచ్చు అన్నారు… ఇదే ఆయన వ్యక్తిత్వం.. ఆయన చాలా సదాసేవగా ఉండేవారు.. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ పేరుతో కృష్ణాజిల్లాలో చాలా చోట్ల ఆయన అనేక కార్యక్రమాలు చేసారు..
కోనేరు ప్రసాద్ అలియాస్..దుబాయ్ ప్రసాద్ ఉరఫ్ ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రసాద్.. ఇంకా చెప్పాలంటే ట్రైమెక్స్ ప్రసాద్.. ఆయన జీవితం ముగిసిపోయింది.. గుండెపోటుతో ఆయన జీవితాన్ని ముగించారు..
ఆయన జీవితం చాలా విషయాల్లో చాలామందికి ఆదర్శం.. ఒకప్పుడు సక్సెస్ కి మారుపేరు. కానీ ఒక సక్సెస్ బాట పట్టాక దాన్ని నిలుపుకోలేక మేనేజ్ చేయలేక చతికిలపడి.. పొలిటికల్ గేమ్ లో ఓటమిపాలైన వ్యక్తి ఆయన.. ఎంత సంపాదించారో అంత పోగొట్టుకున్నారు..వేలమందికి ఉపాధి కల్పించిన ఆయన ఒక దశలో కేసులతో..మరోవైపు ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడ్డారు..
కృష్ణా జిల్లాకు చెందన కోనేరు ప్రసాద్ తన జీవితాన్ని అతి సాధారణంగా ప్రారంభించాడు. చాలా యేళ్ల క్రితం అతను ఓ మైనింగ్ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. కొద్ది కాలంలోనే భారతేదశంలోనే కాకుండా పశ్చిమాసియాలో, ముఖ్యంగా దుబాయ్‌లో ప్రధానమైన వ్యక్తిగా మారిపోయారు.
కోనేరు ప్రసాద్ అయ్యప్ప భక్తుడు. గత 28 ఏళ్లుగా మాల వేసుకుంటున్న అతనికి గురుస్వామి హోదా కూడా లభించింది. ప్రస్తుతం సిబిఐ అరెస్టు చేసిన సమయంలో కూడా అతను అయ్యప్ప దీక్షలో ఉన్నాడు. అతనికి గోల్ఫ్ అంటే అమితమైన ప్రేమ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోల్ఫ్ క్లబ్బుల్లో అతను గోల్ఫ్ ఆడుతుంటాడు,
కోనేరు ప్రసాద్ ట్రైమెక్స్ గ్రూప్ సంస్థను కూడా స్థాపించారు.. శ్రీకాకుళం జిల్లా సముద్ర తీర ప్రాంతంలో ఇసుక తీసి దాని నుంచి ఖనిజాలని వేరు చేసి ఎక్స్ పోర్ట్ చేసేవారు.. అయితే ఈ కంపెనీ పర్యావరణానికి హాని చేసేలా ఇష్టారాజ్యంగా తవ్వుకుంటుంటున్నారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.. తర్వాత ఆ కంపెనీ మూతపడినట్టుంది.. నిజానికి ఈ కంపెనీ తరఫున సీఎస్సార్ నిధుల కింద అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.. ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు నిధులు ఇచ్చారు.. ఇప్పటికీ శ్రీకాకుళం టౌన్ లో ట్రైమెక్స్ పేరుతో నాటిన చెట్లు దాని చుట్టూ బోర్డులు కనిపిస్తాయి..
బెజవాడ ఎంపీగా ఓడిపోయాక ఆయన చెన్నై వెళ్లిపోయారు.. ఆ తర్వాత చాలాసార్లు నాకు ఫోన్ చేసి మాట్లాడేవారు.. చాలా ఆత్మీయంగా పలకరించేవారు.. అశోక్ … జీవితంలో సక్సెస్ అవడం చాలా తేలికయ్యా.. కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం.. బాగా కష్టపడితే సక్సెస్, డబ్బూ రెండూ వస్తాయి.. కానీ మేనేజ్ చేసుకునే తెలివితేటలు లేకపోతే ఆ సక్సెస్ దూరమైపోతుంది.. ఈ మనుషులున్నారే.. మనం ఎంత మంచి చేసినా ఇంకా చేయమని అడుగుతారు.. మనల్ని పొగుడుతారు..మనకి భజన చేస్తారు.. మనకి పూజలు చేస్తారు.. కాని మనం కష్టాల్లో ఉంటే మాత్రం మన వెంట రారు.. మనల్ని పొగిడిన నోటితోనే తిడతారు.. మనకి భజన చేసిన వాళ్లే మనపై దుమ్మెత్తి పోస్తారు.. మనుషుల తీరే ఇంత.. అయినా నేను నాలైఫ్ అంతా మనుషుల్ని నమ్మాను.. ఆ మనుషుల వల్లేఎదిగాను.. అదే మనుషుల వల్ల దెబ్బతిన్నాను.. అయినా నేను మనుషుల్ని వదల్లేదు.. ఎందుకంటే నేను కూడా మనిషినే కదయ్యా.. అనేవారు.. అశోక్ వేములపల్లి)
Share this Article