ఆ పిల్లగాడెవరో, తన పేరేమిటో కూడా తెలియదు… కానీ ఈమధ్య వీడియోల్లో తెగ హడావుడి చేస్తున్నాడు… తను తెలుగు సినిమాల్లో అన్ని కేరక్టర్లకూ డబ్బింగ్ చెబుతాడట… సరే, ఆడ, మగ కేరక్టర్లకు కూడా ఒకే ఆర్టిస్టు డబ్బింగ్ చెప్పడాన్ని మన తెలుగు నిర్మాతలు అనుమతిస్తున్నందుకు… ఆ ఢైరెక్టర్లకు, ఆ నిర్మాతలకు, అంగీకరిస్తున్న ఆ హీరోహీరోయిన్లకు కుడోస్… అవునూ, ఇన్నాళ్లూ నోరు మూసుకుని, ఇప్పుడు నోరు విప్పుతున్నాడేం ఈ ఆర్టిస్టు..? తనకు ఈటీవీ ఇంత ప్రయారిటీ ఇస్తున్నదేమిటి..? శేఖర్ కమ్ముల, సాయిపల్లవి మీద ఏమైనా కోపం ఉందా మల్లెమాల ప్రొడక్షన్స్‌కు..?
ఐతే ఒక డౌట్… తను పదే పదే తన వీడియోల్లో చెప్పేది ఫిదా సినిమాలో సాయిపల్లవికి తను డబ్బింగ్ చెప్పాను అంటున్నాడు… ఇలా చెప్పాను అని చూపిస్తున్నాడు… అవే డైలాగులు… కాకపోతే ఆ సినిమాలో వినిపించే ఒరిజినల్ వాయిస్‌కు ఆమడ దూరం ఉంది… సరే, నిజమే అనుకుందాం… ఫాఫం, శేఖర్ కమ్ముల దిక్కుమాలిన టేస్టుకు జాలిపడదాం…
ఆడ కేరక్టర్‌కు కూడా ఓ ప్రొఫెషనల్ లేడీ ఆర్టిస్టుతో గాకుండా ఓ మగ మిమిక్రీ ఆర్టిస్టుతో సాయిపల్లవి పాత్రకు డబ్బింగ్ చెప్పించినందుకు తను సిగ్గుపడాలి… మనకెందుకు బాధ..? కాదా..? నిజం కాదా..? మరెవరూ మాట్లాడరేం..? ఎహె, ఎవరో ఏదో చెబితే మేమెందుకు స్పందించాలి అనుకుంటున్నారా శేఖర్ కమ్ముల, సాయిపల్లవి ఎట్సెట్రా…
Ads
ఆమధ్య పలు ఇంటర్వ్యూల్లో సుద్దపూస కబుర్లు చెప్పింది కదా సాయిపల్లవి… ‘ప్రతి సినిమాలోనూ నేనే భాష నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పుకుంటాను’ అని… అంటే అంతా హంబగ్ అన్నట్టేనా..? అబద్ధాలేనా..? షో పుటప్పేనా..? ఈమాత్రం దానికి చివరకు డీజే టిల్లూ సిద్ధూ కూడా అదేదో ఇంటర్వూలో అడుగుతాడు… నీకెలా ఈ తెలంగాణ యాస పట్టుబడిందీ అని… ఆమె ఏవేవో షోపుటప్పులతో ఏవో జవాబులు ఇచ్చింది…
తీరా చూస్తే ఈ మగ ఆర్టిస్టా ఫాఫం, ఆమెకు డబ్బింగ్ చెప్పింది..? అఫ్‌కోర్స్, ఈ తాజా యూట్యూబ్ వీడియోల్లో ఈ పిల్లగాడు ఆ పాత డబ్బింగ్ డైలాగులు చెబుతుంటే నమ్మబుల్ అనిపించడం లేదు… కానీ తనను ఏకంగా ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ఎపిసోడ్‌కు తీసుకొచ్చి మరీ కొన్ని డైలాగులు చెప్పించారు… నప్పలేదు,.. కానీ ఆ డౌట్ అలాగే ఉండిపోయింది… అది నిజమేనా అని…
శేఖర్ కమ్ముల ఇలాంటి వాళ్లను అస్సలు దేకడు… సాయిపల్లవి ఇలాంటి వాళ్లకు అస్సలు జవాబు ఇవ్వదు… మరి నిజమేమిటి..? ఆమధ్య ఆర్కే ఓపెన హార్ట్ ప్రోగ్రాంలో కూడా చెప్పినట్టుంది ఆమె… ప్రతి సినిమాలో తనే డబ్బింగ్ చెప్పుకుంటానని… ఓహ్, అంతా ఉత్తదేనా..? నీ భాష, నీ యాస, నీ ప్రయాస అంతా ఫేకేనా సాయిపల్లవీ… మా గుండెలు గాయపరిచావు సుమా… నీ ఇజ్జత్ బర్బాద్ చేస్తున్న ఈ మిమిక్రీ ఆర్టిస్టును క్షమిస్తావా..? తను చెప్పింది నిజమేనని అంగీకరిస్తావా..?
అబ్బే, సదరు మిమిక్రీ వాయిస్ ఆర్టిస్టు డైలాగులకు ట్రాక్ చెప్పాడు… అంతే… బుల్లెట్ భాస్కర్ మహేశ్ బాబుకు కూడా ట్రాక్ చెబుతాడట… పాటల్లాగే మాటలకూ ట్రాకులా అని హాశ్చర్యపోకండి… ఇండస్ట్రీలో ఇలాంటివెన్నో, ఎటొచ్చీ అసలు డబ్బింగే తాను చెప్పినట్టు కలరింగు దేనికి..? ఈటీవీ సైతం అదే కరెక్టన్నట్టుగా ప్రదర్శించడం ఏమిటి..?
Share this Article