షారూక్ ఖాన్… పాపులారిటీ వన్నె తగ్గని హీరో… తన కొడుకు వెధవ్వేషాలు, తన కుటుంబ సమస్యలు ఏమున్నా సరే, తను తెరపై ఈరోజుకూ టాప్ స్టార్… ఎట్ లీస్ట్, హిందీ తెరపై… పైగా ఫుల్ కమర్షియల్ సినిమాలు రెండు పఠాన్, జవాన్ బంపర్ హిట్స్… దాంతో రాబోయే డమ్కీ హ్యాట్రిక్ అవుతుందని అందరూ నమ్మారు… కారణం, షారూక్ ఇమేజీతోపాటు దర్శకుడు రాజకుమార్ హిరాణీ… త్రీ ఇడియట్స్, సంజు, మున్నాభాయ్, పీకే… ఏ సినిమా చూసినా తనది ఓ విశిష్ట ముద్ర… ఐదేళ్లుగా తన సినిమా రాలేదు… అదీ వెయిటింగ్…
కానీ ఏమైంది..? ఆ మ్యాజిక్ ఈసారి కనిపించలేదు… షారూకుడి మ్యాజిక్ లేదు, హిరాణీ మ్యాజిక్ లేదు…‘ఇది నా కోసం తీసుకున్న సినిమా’ అంటూ షారూకుడు ఏవో సోది ముచ్చట్లు చెప్పాడు గానీ… అంత సీనేమీ లేదు ఈ డన్కీ సినిమాలో…!
లండన్ వెళ్లి కలలు పండించుకోవాలనుకునే ఓ ఐదుగురు ఫ్రెండ్స్… వాళ్లకు అంత చదువు లేదు, అంత జ్ఞానమూ లేదు… సో, చాలామందిలాగే ఫేక్ కన్సల్టెంట్ల బారిన పడి మోసపోతారు… ఏదో పని మీద ఆ ఊరికి వచ్చి వీళ్లకు సాయపడాలని అనుకునే షారూక్… సక్రమ పద్ధతుల్లో ప్రయత్నిస్తే ఏదీ వర్కవుట్ కాదు… ఇక డన్కీ ట్రావెలే గతి… అంటే అక్రమంగా వేరే దేశంలోకి జొరబడటం… దాన్నే డన్కీ అంటుంటారు… ఇదండీ కథ…
Ads
చెప్పిందే ఏదో చెబుతాడు… కథలో డెప్త్ లేదు… పైగా ఆ అక్రమ జొరబాటుదార్ల కథలు మనకు అస్సలు కనెక్ట్ కావు… పంజాబ్ కథలు డిఫరెంట్… పోనీ, అదైనా కాస్త రక్తికట్టేలా చెప్పాడా అంటే అదీ లేదు… కాకపోతే కాస్త ఫన్ నమ్ముకున్నాడు కాబట్టి కొంతవరకూ సినిమా పర్లేదు అనిపిస్తుంది… ఇక్కడ సమస్య ఏమిటంటే, ఎవరూ థియేటర్‌కు జీరో మైండ్‌తో వెళ్లరు… అది హిరాణీ సినిమా, అది షారూక్ సినిమా అనుకుని ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తారు… వాళ్లకు తీవ్ర నిరాశ…
కాకపోతే కొంత రిలీఫ్… ఈమధ్య పెచ్చరిల్లిన వీఎఫ్‌ఎక్స్ సీన్లు లేవు… షారూక్ కూడా సూపర్ సుప్రీం మెగా బ్లాస్టింగ్ హీరోలా గాకుండా మామూలు హీరో… సో, ఓవరాల్‌గా సినిమా వోకే బాపతు… సూపర్ బాపతు కాదు… సినిమా ఔట్‌పుట్ చూసి, రిజల్ట్ అంచనా వేశారు నిర్మాతలు… (హీరో ఒక నిర్మాత, దర్శకుడు ఒక నిర్మాత ప్లస్ అంబానీల వయాకామ్18 సీఈవో ఒక నిర్మాత…) సలార్ రిలీజుకు ముందే కలెక్షన్లను కుమ్మేసుకోవాలని పీవీఆర్-ఐనాక్స్ మల్టిప్లెక్సుల సాయంతో థియేటర్లన్నీ కబ్జా చేయాలనుకున్నారు… సలార్‌కు చెయ్యిచ్చారు…
ఈ స్థితిలో ప్రభాస్ సినిమా గనుక ఏమాత్రం బాగున్నా కలెక్షన్లను దండుకోవడం గ్యారంటీ… అసలే ఆదిపురుష్, రాధేశ్యామ్‌తో తలబొప్పి కట్టి ఉన్నాడు… తనకు అర్జెంటుగా ఓ హిట్ కావాలి… కేజీఎఫ్ రెండు పార్టులతో ప్రశాంత్ నీల్ మాంచి ఊపు మీదున్నాడు… సో, ఏమాత్రం వర్కవుటైనా ఆ ప్రభావం డన్కీ మీద పడి ఆ ధమ్కీ బలంగానే ఉంటుంది… సలార్ కూడా తుస్సుమంటే..? ఏముంది..? ఆ యానిమలుడు రణబీర్ మరో 3, 400 కోట్లు అదనంగా కుమ్మేసుకుంటాడు…!!
Share this Article