Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వర్చువల్ దర్శనాలు- డిజిటల్ పూజలు… ఆన్‌లైన్‌లోనే ఆశీస్సులు…

July 13, 2024 by M S R

వర్చువల్ దర్శనాలు- డిజిటల్ పూజలు……. స్థూలకాయుడైన వినాయకుడిని గణాధిపతి కావాలంటే ముల్లోకాల్లో ఉన్న నదుల్లో స్నానం చేసి రావాలన్నారట. తాను అశక్తుడనని ఆదిదేవుని ప్రార్థిస్తే… తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేస్తే చాలని వరమిచ్చారట. ఫలితంగా కుమారస్వామికి ప్రతి నదిలోనూ తనకన్నా ముందే స్నానం చేసి వెళ్తున్న వినాయకుడు కనిపించాడు. దాంతో తానే ఓటమి ఒప్పుకొని అన్నగారికే విఘ్నాధిపత్యం ఇవ్వమంటాడు. ప్రతి యేటా వినాయకచవితికి చదివే కథే.

అంతర్లీనంగా తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఉండాల్సిన భక్తి, అన్నదమ్ముల మధ్య పోటీ, అనుబంధం ఇవన్నీ ఇందులో తెలుస్తాయి. వినాయకుడు దేవుడు కాబట్టి సాధ్యమైంది. లేకపోతే అన్ని నదుల్లో స్నానాలు కాలు కదపకుండా చెయ్యడం, అది కుమారస్వామికి కనిపించడం మానవ మాత్రులకు సాధ్యమా! అనుకోవడమూ సహజమే. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అన్ని పుణ్యక్షేత్రాలనూ అరచేతిలో చూపిస్తున్నాయి కొన్ని యాప్స్.

భారత దేశంలో ఉన్నన్ని పుణ్య క్షేత్రాలు , దేవాలయాలు మరెక్కడా ఉండవు. మిగిలిన పరిస్థితులు ఎలా ఉన్నా పిల్లల నుంచి కాటికి కాళ్ళు చాచిన బామ్మల వరకు అన్నీ తిరగాలనుకుంటారు. కానీ జీవితకాలంలో మహా అయితే చుట్టుపక్కల ఉన్నవాటికి వెళ్ళొస్తారేమో అంతే. ఇప్పుడిప్పుడు ఆధ్యాత్మిక యాత్రలకు డిమాండ్ పెరిగింది.

Ads

అంతేనా ! భక్తి ఛానెల్స్ కు విశేష ఆదరణ లభిస్తోంది. ఇక తాయెత్తుల నుంచి దేవీ పూజల వరకు ఆన్లైన్ లో అన్నీ లభిస్తున్నాయి. భక్తి ప్రసంగాలకు అనేక అభిమానులు. కష్టాలు తీరేందుకు ఉపాయాలు కోరేవారు కొల్లలు. వీటన్నిటినీ మార్కెట్ చేసుకోవాలనుకునే వారు ఎప్పుడూ ఉంటారు. అలా గతంలోనే ఈ- పూజ,స్మార్ట్ పూజ వంటి సర్వీసులు పుట్టుకొచ్చాయి.

కోవిడ్ తర్వాత భక్తి మరింత పెరిగినట్లుంది. ఆస్ట్రో టాక్, దేవ్ ధామ్, ఉత్సవ్, వామా లాంటి యాప్స్ కి ఆదరణ అనూహ్యంగా పెరిగింది. భక్తి ముడిసరుకుగా బిజినెస్ చేసే యాప్స్ ఇవి . వీటి ద్వారా పూజలు, హోమాలు, శాంతులు… ఒకటేమిటి? సమస్త పాప పరిహారాలు- పూజలు జరిపించుకోవచ్చు. మన ఇంట్లో కూర్చుని నచ్చిన దేవుడి పూజ జరిపించచ్చు. ప్రసాదమూ అందుతుంది. ఇంత బాగా దర్శనం ఆ క్షేత్రానికెళ్లినా జరగదేమో అన్నట్టు ఉండటంతో జనాలు ఎగబడి పూజలు జరిపిస్తున్నారు.

ఒక్క వామా యాప్ టర్నోవర్ ఏడాదికి పదహారున్నర కోట్ల పైనే. నెలకు నాలుగు లక్షల పైనే ఈ సైట్ చూస్తారు. 32 వేల మంది పూజలు, ఇతరత్రా జరిపించుకుంటున్నారు.

అయోధ్య రామాలయం పూర్తయ్యాక ఆన్లైన్ పూజా వెబ్సైట్లకీ డిమాండ్ పెరిగిందని వాటి నిర్వాహకులు అంటున్నారు. కోవిడ్ కారణంగా ఇళ్లల్లో ఉండి సెల్ ఫోన్లతో అన్ని పనులూ చక్కబెట్టడమూ ఇందుకు కారణమని మరికొందరి అభిప్రాయం. వయసుకు, మతాలకు అతీతంగా భారతదేశంలో ఆధ్యాత్మికత వేళ్లూనుకుని ఉందని, అదే సాంకేతికత ద్వారా అందరికీ చేరువయ్యేలా చేసిందని కూడా నిర్వాహకులు అంటున్నారు.

ఏదో పెద్దవాళ్ళే ఈ యాప్స్ ఎక్కువ వాడుతున్నారనుకోకూడదు. యువకులు, ముఖ్యంగా మిలీనియం తరం వారు కూడా ఈ యాప్స్ వాడుతున్నారు. దేవ్ ధామ్ వంటి యాప్స్ ద్వారా తీర్థ యాత్రలు చేయడం ఎక్కువైంది. ఆస్ట్రో టాక్, యాప్స్ ఫర్ భారత్ వంటి వాటిలో పెట్టుబడులకు విదేశీ సంస్థలు ముందుకొచ్చాయంటే వీటి ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
బాగుంది. భక్తిలో భుక్తి వెతుక్కోవడం అన్నమాట. రేప్పొద్దున్న ఎవరైనా తీర్థయాత్రలు చేసొచ్చామంటే మాత్రం ఆన్లైనా, ఆఫ్ లైనా అని అడగాలేమో!………. – కె. శోభ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions