ఇది ఇందిరాగాంధీకి కరపత్రిజీ మహారాజ్ అనే సాధువు శాపం పెట్టిన కథ… ఇందిరాగాంధీ ప్రధానిగా పగ్గాలు చేపట్టి అప్పటికి ఇంకా ఏడాది కూడా నిండలేదు… తొలిసారిగా దాదాపు లక్ష మంది సాధువులు ఢిల్లీ వీథుల్లో గుమిగూడారు… పోలీసులు హెల్ప్ లెస్‌గా చూస్తుండిపోయారు…
ఆరోజు 1966, నవంబర్ 7… ఆ సాధువుల డిమాండ్ ఏమిటంటే… గోవధ నిషేధ చట్టాన్ని తీసుకురావాలి… వారణాసికి చెందిన స్వామి కరపత్రి, హర్యానా నుంచి ఎన్నికైన జనసంఘ్ ఎంపీ స్వామి రామేశ్వరానంద ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు… ఆ కమిటీ పేరు ఆల్ పార్టీ గోరక్ష మహా అభియాన్ కమిటీ…
గుంపు… ఉత్తేజపరిచే నినాదాలు, ప్రసంగాలతో ప్రజల్లో ఉద్వేగం, ఉద్రేకం పెరిగింది… పార్లమెంటు వైపు ర్యాలీగా బయల్దేరారు… విధ్వంసం ఛాయలు కూడా ప్రారంభమయ్యాయి… పార్లమెంటు వరకూ చేరుకున్నారు… ఆ గేట్లు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న వాళ్లకూ పోలీసులకూ నడుమ ఘర్షణ… పరిస్థితి అదుపు తప్పుతోంది…
Ads
స్వతంత్రం వచ్చాక తొలిసారిగా ఢిల్లీని సైన్యం తన చేతుల్లోకి తీసుకుంది… వీథుల్లో బెటాలియన్లు దిగాయి… అసలు ఎవరు ఈ కరపత్రి… యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో 1907 పుట్టాడు… 17వ ఏట ఇల్లు వదిలాడు… జ్యోతిర్మఠం శంకరాచార్యుడు స్వామి బ్రహ్మానంద సరస్వతి ద్వారా సన్యాసం స్వీకరించాడు… తరువాత తను దండ గ్రహణ సంస్కారం పొంది స్వామి హరిహరానంద సరస్వతి పేరును పొందాడు… కానీ పాత్రలు, పళ్లేలకు బదులు చేతులనే ఆహార స్వీకరణకు వాడటం వల్ల తనను కరపత్రి అని పిలిచేవారు… ఇదీ ఆయన నేపథ్యం… వారణాసి కేంద్ర మత కార్యక్రమాలు…
తరువాత ఆయన మెల్లిగా తన కార్యక్రమాల్ని మతసంబంధమే గాకుండా సోషల్, పొలిటికల్ రంగాల వైపూ మళ్లించాడు… 1952లో అఖిల భారతీయ రాజరాజ్య పరిషద్ పేరిట ఓ పార్టీ కూడా పెట్టాడు… మూడు లోకసభ సీట్లు గెలుపొందడమే కాదు, 52 సీట్లు గెలిచి రాజస్థాన్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా మారింది… హిందూ కోడ్ బిల్‌ను వ్యతిరేకించడం ద్వారా మరింతగా లైమ్ లైట్‌లోకి వచ్చాడు ఆయన… ఆయన పార్టీ ఎజెండా గోరక్షణ, హిందుత్వ… ఇవే…
కాశిలోనే ఓ మతసంస్థ స్థాపించాడు… అది జైశ్రీరాం, హరహరమహాదేవ్ నినాదాలను ఎత్తుకుంది… ఈరోజుకూ హిందూ మత ఉత్సవాల్లో ఇవే ప్రధాన నినాదాలు… 1955లో ఈ నినాదాలకు గోమాతకీ జయహో అనే కొత్త నినాదాన్ని జతచేశాడు… గోరక్షణ ఉద్యమం కోసం గౌరక్షార్థ అహింసా ధర్మాయుధ సమితి స్థాపించాడు… దేశంలో పలుచోట్లకు వెళ్లి సత్యాగ్రహాలు, నిరసన ప్రదర్శనలు చేసేవాడు… కబేళాల ఎదుట చేరి… వెన్న తినండి, గోవులను కాపాడండి అనే నినాదాలతో హోరెత్తించేవారు…
ఈ ఉద్యమాన్ని ఉత్తరాది రాష్ట్రాలు, కర్నాటకలకు బాగా విస్తరించాడు… జనసంఘ్ కూడా సపోర్ట్ చేసేది… రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం గోవధ నిషేధ చట్టాన్ని చేయాలనేదే ఆయన ఉద్యమ లక్ష్యం… అసలు ఆవుల్నే కాదు, పాలిచ్చే ఏ జంతువునూ వధించకూడదనేది ఆయన సూత్రం… కాంగ్రెస్‌లో ఓ సెక్షన్ కూడా మద్దతు పలికేది… కానీ ఇందిరాగాంధీ నిష్కర్షగా ఆ చట్టం తీసుకొచ్చేది లేదని చెప్పేసింది… అంతేకాదు, ఈ గోరక్షణ ఉద్యమకారులకు తలవంచేది లేదనీ చెప్పింది…
ఇందిర తీసుకున్న వైఖరి రాజకీయాల్లో వేడిని రగిల్చింది… కాంగ్రెస్‌లోని ఓ సెక్షన్ దీనిపై ఇందిరను వ్యతిరేకిస్తున్నా సరే, అది పార్టీ అంతర్గత వ్యవహారం అని కొట్టిపడేసేవాళ్లు… హిందూ మతసంస్థలు మాత్రం తమ కార్యక్రమాలకు పదును పెట్టసాగాయి… ఢిల్లీలో ప్రదర్శనకు అనుమతి తీసుకున్నాకే అంతమంది సాధువులు జమయ్యారు… అప్పుడు గుల్జారీ లాల్ నందా హోం మంత్రి… అంతేకాదు, ఆయన ఆల్ ఇండియా సాధు సమాజ్ అధ్యక్షుడు కూడా… అందుకే ఈ ప్రదర్శనలను తాను కంట్రోల్ చేయగలనని ఇందిరకు హామీ ఇచ్చాడు…
ఎర్రకోట వద్ద ప్రదర్శన దాకా బాగానే ఉంది, కానీ పార్లమెంటు వైపు ర్యాలీగా బయల్దేరేసరికి వయోలెంట్‌గా మారింది… పార్లమెంటు కాంప్లెక్స్‌లోకి ప్రవేశించే ప్రయత్నాలు లాఠీఛార్జీలతో సక్సెస్ కాలేదు, దాంతో పోలీసులు కాల్పులకు దిగారు… నిరసనకారులు కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ ఇంటికి నిప్పు పెట్టారు… వాహనాలను ధ్వంసం చేశారు, కాలబెట్టారు…
కాల్పుల్లో చాలామంది మరణించారు… 50 మంది గాయపడ్డారని, 8 మంది మరణించారని ప్రభుత్వం పార్లమెంటులో తరువాత ప్రకటించింది… ఆ కాల్పులు కూడా పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోయేసరికి ఆర్మీ రంగంలోకి దిగింది… ఢిల్లీలో కర్ఫ్యూ పెట్టారు… కొన్నిరోజులపాటు కొనసాగింది అది… దీనికి నైతిక బాధ్యత వహిస్తూ గుల్జారీ లాల్ నందా తన పదవికి రాజీనామా కూడా ప్రకటించాల్సి వచ్చింది…
ఇక్కడ ఉద్యమం ఆగిపోలేదు… వారం రోజులకే ఆల్ పార్టీ గోరక్షణ మహాభియాన్ కమిటీ సత్యాగ్రహాన్ని, నిరాహార దీక్షలను ప్రకటించింది… పూరీకి చెందిన శంకరాచర్యుడు జగద్గురు నిరంజన్ దేవ 20 నవంబరున ఆమరణ దీక్షకు దిగాడు… వివిధ రాష్ట్రాలకు ఈ నిరసనలు వ్యాపిస్తున్నాయి,,.
1966 జనవరి 3… స్వామి కరపత్రి కూడా అరెస్టయ్యాడు… దాదాపు 1000 మందిని జైళ్లలోకి నెట్టారు… ఆమరణ దీక్షలో ఉన్న ఇద్దరు ఉద్యమకారులు మరణించారు… పూరి శంకరాచార్యుడి దీక్ష 72 రోజులకు చేరి ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది… ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది… ఒకవేళ శంకరాచార్యుడికి ఏమైనా జరిగితే ప్రజల ఆగ్రహంలో కొట్టుకుపోవాల్సి వస్తుందని ఇందిరను ఆమె సహచరులు హెచ్చరించారు…
ఆమెలో ఇంగితం పనిచేసి, ఆ చట్టం తీసుకురావడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించే ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది… తరువాత శంకరాచార్యుడు దీక్ష విరమించాడు… ఆ కమిటీలో శంకరాచార్యుడితోపాటు ఆర్ఎస్ఎస్ అప్పటి చీఫ్ మాధవ్ సదాశివ గోల్వల్కర్ కూడా సభ్యులు… కమిటీకి సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏకే సర్కార్ నేతృత్వం… 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ మీద ఈ ఉద్యమ ప్రభావం కొంత పడింది… జనసంఘ్ సీట్ల సంఖ్య పెరిగింది… సరిగ్గా ఆ కాలంలోనే కాంగ్రెస్ నిలువునా చీలిపోయి, ఇందిరాగాంధీ వేరే పార్టీ పెట్టుకుంది… ఆమె ఎన్నికల గుర్తు ఏమిటో తెలుసా..? యాదృచ్ఛికంగా… ఆవు దూడ…!
స్టోరీ సోర్స్ :: https://navbharattimes.indiatimes.com/navbharatgold/we-the-people/who-was-swami-karpatri-who-fought-with-indira-gandhi/story/99189759.cms
ఇక్కడ మనం రెండు అంశాలు చెప్పుకుంటున్నాం… 1) ప్రస్తుతం అయోధ్య ఆలయ ప్రాణప్రతిష్ఠ ఉత్సవం మీద అనుచిత, అసందర్భ వ్యాఖ్యలు చేస్తున్న శంకరాచార్యులకు అప్పటి శంకరాచార్యులకు నడుమ తేడా ఇదే… 2) కాల్పులు జరిగాక ఇదే కరపత్రి స్వామి, శంకరాచార్యుడు ‘నీ కుటుంబం కూడా ఇలాగే గోఅష్టమి వేళల్లోనే ఇలాగే కాల్పులకు, హింసకు గురై మరణిస్తారు అని ఇందిరను శపించారని ఓ ప్రచారం ఉంది… ఆ శాపం మేరకే ఆమె తన అంగరక్షకుల తుపాకీ కాల్పులకు గురై మరణించిందని ఆ ప్రచారం ముక్తాయింపు… ప్రస్తుత శంకరాచార్యులకు అప్పటి శంకరాచార్యుల ఉద్యమ కథలు తెలుసా..?!
Share this Article