Siva Racharla……. ముందస్తు ఎన్నికలు వస్తాయా?. ఏదైనా ఒక నిర్ణయానికి ప్రాతిపదిక ఉండాలి. ముందస్తు ఎన్నికలలాంటి అతిపెద్ద నిర్ణయం తీసుకోవటానికి అతి పెద్ద కారణం ఉండాలి. అటు కేంద్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళటానికి పెద్ద కారణాలు ఏమైనా ఉన్నాయా?
గత కొంతకాలంగా కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళుతుందన్న ప్రచారం జరుగుతుంది. దీనికి ప్రధానకారణం కర్ణాటకలో బీజేపీ ఓటమి. కర్ణాటకలో ముఖ్యమంత్రి బొమ్మై ,రాష్ట్ర బీజేపీ నేతల కన్నా మోడీ, అమిత్ షాలే ఎక్కువ ప్రచారం చేశారు. ప్రధాని మోడీ బెంగళూరు రోడ్ షో లో సీఎం కానీ , రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కానీ, సీనియర్ నేత , మాజీ సీఎం యడ్యూరప్ప కానీ పాల్గొనలేదు. దీని అర్ధం రాష్ట్ర నాయకులను కాదు, నన్ను చూసి ఓటు వేయండి అని ప్రధాని మోడీ కర్ణాటక ఓటర్లను కోరారు. ఫలితం తెలిసింది. బీజేపీకి కూడా ఊహించని స్థాయి పరాజయం ఎదురైంది.
కర్ణాటక ఫలితాలు వచ్చిన నెలలోపే మధ్యప్రదేశ్ ప్రీపోల్ సర్వేలు వచ్చాయి, అక్కడ కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో గెలుస్తుందని C Voter Daily Tracker అంచనా వేసింది. ఛత్తీస్ ఘడ్ లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని ఒక సర్వే నిన్న ప్రకటించింది. మరోవైపు రాజస్థాన్ కాంగ్రెస్లో సీఎం అశోక్ గెహ్లట్ మరియు సచిన్ పైలట్ వర్గాల మధ్య సంధి కుదిరింది, సీఎం కొత్త పథకాలతో ప్రజల్లోకి వెళుతున్నాడు. రాజస్థాన్ కాంగ్రెస్లో మూడు వర్గాలు ఉంటే బీజేపీలో ఐదు వర్గాలు నడుస్తున్నాయి. అక్కడ కూడా బీజేపీకి స్పష్టమైన విజయావకాశాలు కనిపించటం లేదు.
Ads
2019 లోక్ సభ ఎన్నికలకు ముందు 2018 నవంబర్/డిసెంబర్ లో జరిగిన రాజస్థాన్ , మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మూడు రాష్ట్రాలలో మొత్తం 65 స్థానాలు ఉండగా బీజేపీ ఏకంగా 61 స్థానాలు గెలిచింది. కర్ణాటకలో 28 స్థానాలకు 26, మహారాష్ట్రలో 48 స్థానాలకు 41 (బీజేపీ 23 + శివసేన 18) స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అంటే ఈ ఐదు రాష్టాల నుంచే బీజేపీ 128 స్థానాలను బీజేపీ గెలుచుకుంది.
మారిన స్లోగన్
2019 ఎన్నికలకు ముందు మోడీ కాకుంటే ప్రధాని ఎవరు? అని ఎదురు ప్రశ్న వేసేవారు . దానికి బలమైన సమాధానం ప్రతిపక్షాల నుంచి ఉండేది కాదు. ఏఐసీసీ అధ్యక్ష పదవే వద్దన్న రాహుల్ గాంధీ ప్రధానిగా సమర్థుడా అని బీజేపీయేతర పక్షాలు కూడా డైలమాలో ఉండేవి.
ఇప్పుడు 2024 ఎన్నికలకు మోడీ కాకుంటే అనే ప్రశ్న బీజేపీ వైపు నుంచి కూడా రావటం లేదు. వివిధ రాష్ట్రాలలో ఎన్నికల బాధ్యతలు రాహుల్ గాంధీ తీసుకోవటం వలన అయన నాయకత్వం మీద కాంగ్రెస్ వర్గాల్లో కూడా విశ్వాసం పెరిగింది. అసలు రాహుల్ మాత్రమే కాదు ఇంకా కనీసం ముగ్గురు నలుగురు ప్రధాని అర్హతలు ఉన్న నేతలు కాంగ్రెస్ మరియు విపక్ష పార్టీల్లో కనిపిస్తున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో మాదిరే అధికధరలు, నిరుద్యోగం రాబోయే ఎన్నికలకు ప్రధాన అజెండా అవ్వబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం Uniform Civil Code బిల్లు తీసుకొచ్చినా అది ఎన్నికల అజెండా అవ్వటానికి అవకాశం తక్కువే.
బీజేపీ ఓడిపోతుందా?
బీజేపీ సొంతంగా 273 మ్యాజిక్ ఫిగర్ ను దాటుతుందా ? NDA లో మిగిలిన చిన్న చిన్న భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? ఇప్పుడు రాజకీయ విశ్లేషణలు ఈ ప్రశ్నల చుట్టే జరుగుతున్నాయి. పోనీ కూటమిగా NDA 273 మార్క్ సాధిస్తుందా?
ఈ అనుమానం బీజేపీ నాయకత్వంలో కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. మహారాష్ట్రలో NCP ని చీల్చటం , అంతకు ముందు శివసేనను చీల్చటం తమ ఓట్ బ్యాంక్ ను మెరుగు పర్చుకోవటం కోసమే . మహారాష్ట్రలో అంతిమంగా బీజేపీ కాంగ్రెస్ ల మధ్య మాత్రమే పోటీ జరగాలన్నది బీజేపీ వ్యూహం. ఆ ఆలోచన వచ్చే రెండు ఎన్నికల తరువాత నిజం అవుతుందేమో కానీ 2024 ఎన్నికల్లో మాత్రం కాదు.
మరో వైపు , దాదాపు ఆరేళ్ళ తరువాత చంద్రబాబు నాయుడికి అపాయింట్మెంట్ ఇవ్వటం , అకాలీదళ్ ను తిరిగి NDA లోకి తీసుకు రావటానికి ప్రయత్నాలు చేయటం చూస్తే బీజేపీ 35 నుంచి 40 సీట్ల మద్దతు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది.
ఆరేడు నెలల కిందటి వరకు తెలంగాణలో రాబోయేది మా ప్రభుత్వమే అని బీజేపీ నేతలు బీరాలు పలికేవారు. ఇప్పుడు తెలంగాణలో కాడి వదిలేశారు. మునుగోడు ఉప ఎన్నిక, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి నాయకులను తమ వైపు ఆకర్షించలేక పోవటం , విశ్వేశ్వర రెడ్డి & జితేంద్ర రెడ్డి బహిరంగంగానే పార్టీ పని తీరును విమర్శించటం, ఈటెల మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో ఉంటారా లేదా అన్న అనుమానాలతో వారికి కీలకపదవి ఇవ్వటం, వీటన్నిటిని మించి ఈటెల వ్యతిరేకించిన బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి అంతగా క్రియాశీలకంగా లేని కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేయటం .. ఈ పరిణామాలు చూస్తే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ మీద బీజేపీకి ఆశలు లేనట్లే…
లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాకపోవటం మీద బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ‘బీజేపీ BRS ఒకటే’ అని ట్వీట్ చేశారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ BRS అంటే BJP relative’s party అని కామెంట్ చేసాడు. మొత్తంగా 2024 ఎన్నికల తరువాత అవసరం అయితే BRS తమ మద్దతును బీజేపీకి ఇచ్చేలా ఇప్పటి నుంచే బీజేపీ నిర్ణయాలు తీసుకుంటుందన్న ప్రచారం బాగా జరుగుతుంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు unconditional గా బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చారు. గత 2 నెలల్లో కేంద్రం నుంచి రెవిన్యూ లోటు, పోలవరం పెండింగ్ బిల్, FRMB పరిమితి దాటి రుణం, వెరసి దాదాపు 25 వేల కోట్ల నిధులు ఆంధ్రప్రదేశ్ కు దక్కాయి. వీటిని ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి కేంద్రప్రభుత్వానికి ఇచ్చిన unconditional మద్దతుకు రిటర్న్ గిఫ్ట్ గా చూస్తూనే 2024 తరువాతి బంధానికి బలమైన పునాదులు వేస్తున్నట్లుగా భావించాలి.
ఆంధ్రప్రదేశ్ కూడా ముందస్తుకు వెళుతుందా?
ఇక్కడ నేను రాసిన కారణాలు మరియు రాయని మరికొన్ని కారణాలతో కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళుతుందా ? దీనికి డిఫాల్ట్ సమాధానం ఉంది. శాసనసభ గడువు ముగియటానికి అంటే శాసనసభ తొలి సమావేశం జరిగినప్పటి నుంచి (దీన్నే appoint date అంటారు ) ఐదేళ్ల పాటు శాసనసభ కాలపరిమితి ఉంటుంది. అయితే ఆరు నెలల ముందే శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలు నిర్వహించవచ్చు.
ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం వచ్చే డిసెంబర్ లోనే జనవరిలోనే ముందస్తు ఎన్నికలకు వెళితే ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా లోక్ సభతో పాటు శాసనసభకు కూడా ఎన్నికలు నిర్వహించవచ్చు. అంటే కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం ఖాయం. కానీ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు వద్దని అనుకుంటే కేంద్రంతో ఉన్న సత్సంబంధాల వలన ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ శాననసభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించకపోవచ్చు కూడా. కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద ఒక కమిటీ వేసి ఎన్నికలకు ఒక సానుకూల పరిస్థితులు కల్పించవచ్చు.
ముందస్తు ఎన్నికలు ఎన్నిరోజుల ముందు ప్రకటించాలి..?
జూన్ మొదటి వారంలో రాజస్థాన్, మహారాష్ట్ర , ఛత్తీస్ ఘడ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారుల ట్రాన్సఫర్లను పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం ఉండి దీర్ఘకాలంగా ఒకే చోట ఉన్న అధికారులను సహజంగా బదిలీ చేస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం 25 నుంచి 28 రోజుల ముందు గజెట్ విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. నామినేషన్ , స్క్రూటినీ, విత్ డ్రాయల్, పోలింగ్ , కౌంటింగ్ తేదీలను ఈ నోటిఫికేషన్లో ప్రకటిస్తారు.
ఉద్యోగుల బదిలీ అనేది తప్పనిసరి అంశం కాదు, అదొక ఫార్మాలిటీ. కాబట్టి కేంద్రం కోరుకుంటే ఎన్నికల సంఘం ఒక నెలలోనే ముందస్తు ఎన్నికల మీద నిర్ణయం తీసుకోవచ్చు. రాబోయే నవంబర్, డిసెంబర్ నెలల్లో మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ , తెలంగాణల శాసన సభలకు ఎన్నికలు నిర్వహించాలి. మిజోరంలో డిసెంబర్ 17, ఛత్తీస్ ఘడ్ జనవరి 3, మధ్యప్రదేశ్ జనవరి 6, రాజస్థాన్ జనవరి 6 మరియు తెలంగాణలో జనవరి 14లోపు కొత్త శాసనసభలు ఏర్పడాలి.
ఈ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు పూర్తి అయిన నెల రెండు నెలల్లోపు ఆ రాష్ట్రాలలో లోక్ సభ ఎన్నికలు నిర్వహించటం శ్రమతో కూడిన పని. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్ళదల్చుకుంటే డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఎక్కువ. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, శాసనసభ కాలపరిమితిని పెంచే అధికారం ఎన్నికల కమీషన్ కు లేదు. ఎమెర్జెన్సీ లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పార్లమెంట్ సూచన మేరకు రాష్ట్రపతి ఆర్డినెన్స్ తో మాత్రమే శాసనసభ కాలపరిమితి పొడిగించవచ్చు.
గత సెంటిమెంట్
అలిపిరి సంఘటన తరువాత చంద్రబాబునాయుడు ముందస్తుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ దాడి సంఘటన తరువాత హైద్రాబాద్ ఇంట్లో రోజూ స్కూల్ పిల్లలు వచ్చి చంద్రబాబుకు పువ్వులు ఇచ్చే కార్యక్రమం నిర్వహించారు. సానుభూతి కలిసొస్తుందన్న ఆలోచనతో ముందస్తుకు వెళ్లారు.
వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడుల ఒత్తిడితో వాజ్ పాయి కూడా ఐదునెల ముందే India Shining పేరుతో ముందస్తుకు వెళ్ళారు . వీరిని చూసి కర్ణాటక కాంగ్రెస్ సీఎం యస్ఎం కృష్ణ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కేంద్రం, ఆంధ్రా, కర్ణాటకలో అధికార పార్టీలు ఓడిపోయాయి. కర్ణాటకలో హంగ్ వచ్చింది. జేడీఎస్ , కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ నేత ధరమ్ సింగ్ సీఎం అయ్యారు.
2004 ఫలితాల తరువాత భారత్ వెలుగుతుంది అంటూ వాజ్ పాయిని ముంచిన ఇద్దరు నాయుడ్లు అని చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు ఫోటోలతో India Today ఆర్టికల్ రాసింది. ముందస్తు ఎన్నికల అంచనాతో షేర్ మార్కెట్లు మాత్రం ర్యాలీ అవుతున్నాయి. బీజీపీ రాష్ట్ర అధ్యక్షుల మార్పు , హర్యానా, మణిపూర్ సీఎంల మార్పు మీద ఊహాగానాలు ముందస్తు ఎన్నికల మీద అంచనాలు పెంచుతున్నాయి. రాజకీయాల్లో సెంటిమెంట్ ఎక్కువ, సరిగ్గా 20 ఏళ్ళ కిందట జరిగిన ముందస్తులలో అందరూ ఓడిపోయారు, మరి ఇప్పుడు ముందస్తుకు వెళ్తారా? ట్రిగర్ కేంద్ర చేతిలో ఉంది .. బులెట్ వదలాలా లేదా? నిర్ణయం ఎప్పుడైనా తీసుకోవచ్చు లేదా వెనక్కి తీసుకోవచ్చు …
Share this Article