.
మయన్మార్, థాయ్‌లాండ్‌లలో 7.7 సీస్మిక్ తీవ్రతతో భూకంపం… విధ్వంసం, ప్రాణనష్టం వివరాలు వస్తున్నాయి… 7.7 అంటే పెద్ద భూకంపమే… ఐతే..?
గ్రహకూటములు కొన్ని విశేషంగా ఏర్పడుతుంటాయి… వాటి ప్రభావం వ్యక్తిగత జాతకాలపై ఉండదనీ, సోషల్ మీడియాలో ప్రచారాల్ని నమ్మొద్దని నిన్న చెప్పుకున్నాం కదా… కానీ ప్రభావం అసలే ఉండదా..? ఉంటుంది,.. అనుకోని విపత్తులు సంభవిస్తాయి…
Ads
మరి మయన్మార్, థాయ్‌లాండ్ భూకంపానికీ గ్రహకూటమికీ లింక్ ఉందా..? ఉన్నట్టే ఉంది… ఎందుకంటే..? రేపు సంభవించబోయే షడ్గ్రహ కూటమికి ఒక్కరోజు ముందే ఈ విపత్తు సంభవించింది…
ప్రముఖ జ్యోతిష్కుడు గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ, ధర్మపురి (www.onlinejyotish.com) లో రాసిన ఓ పరిశోధనాత్మక వ్యాసం ఇంట్రస్టింగు ఉంది… ఇదుగో అది…
సోషల్ మీడియా పుణ్యమా అని మనం ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నాం. జూన్ లో ఏర్పడబోతున్న పంచగ్రహ కూటమి గతంలో ఏర్పడిన వాటితో పోల్చుకుంటే చాలా చిన్నది. ఇక్కడ గత కొంత కాలం క్రితం ఏర్పడిన వివిధ గ్రహ కూటముల వివరాలు తేదీలు సమయాలతో సహా ఇచ్చాను. అంతే కాకుండా అవి జరిగినప్పుడు లేదా జరిగిన తర్వాత ఏర్పడిన ప్రకృతి విపత్తుల వివరాలు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఇచ్చిన తేదీలు మరియు సమయాలు భారత కాలమానం ప్రకారం ఇవ్వబడ్డాయి.
పంచగ్రహ కూటమి
జనవరి 10, 1994 తెల్లవారు ఝామున 03.58కి చంద్రుడు ధనూరాశిలోకి ప్రవేశించటంతో పంచగ్రహ కూటమి ప్రారంభమయ్యి అదేరోజు మధ్యాహ్నం 12.27కు బుధుడు మకర రాశిలోకి మారటంతో ఈ పంచగ్రహ కూటమి ముగిసింది. ఈ పంచగ్రహ కూటమి జరిగిన వారం రోజులకు అంటే జనవరి 17, 1994 రోజున అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో 6.7 మాగ్నిట్యూడ్ తో భారీ భూకంపం వచ్చింది.
పంచగ్రహ మరియు షడ్గ్రహ కూటమి
మే 3, 2000, అర్ధరాత్రి 12.01 కి మేష రాశిలోకి చంద్రుడి ప్రవేశంతో ఈ షడ్గ్రహ కూటమి ప్రారంభమయ్యి మే 5, 2000 రోజున అర్ధరాత్రి 01.51కు చంద్రుడు వృషభరాశిలోకి ప్రవేశించటంతో ఈ షడ్గ్రహ కూటమి ముగిసింది. చంద్రుడితో పాటు సూర్యుడు, బుధుడు, గురువు, శుక్రుడు, మరియు శని గ్రహాలు ఈ సమయంలో మేష రాశిలో సంచరించాయి.
అయితే చంద్రుడు మేష రాశినుంచి వృషభరాశిలోకి మారినప్పటికి, ఏప్రిల్ 27, 2000, తెల్లవారు ఝామున 5.51కి ప్రారంభమయిన సూర్యుడు, బుధుడు, గురువు, శుక్రుడు, మరియు శని గ్రహాలతో కూడిన పంచ గ్రహ కూటమి మే 11, 2000 సాయంత్రం 04.51 కి బుధుడు మేష రాశినుంచి వృషభరాశిలోకి మారటంతో ముగిసింది.
ఈ షడ్గ్రహ కూటమి జరుగుతున్న సమయంలో అంటే మే 4న ఇండోనేషియా, సుమత్రా దీవుల్లో 7.6 మాగ్నిట్యూడ్ తో భారీ భూకంపం వచ్చింది.
పంచగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి, సప్తగ్రహకూటమి
ఏప్రిల్ 26, 2002, తెల్లవారు ఝామున 05.50కి బుధుడు వృషభ రాశిలోకి మారటంతో. రాహువు, బుధుడు, కుజుడు, శుక్రుడు మరియు శనితో కూడిన ఈ పంచగ్రహ కూటమి ప్రారంభమయ్యి మే 12, 2002, రాత్రి 8.48 చంద్రుడు వృషభరాశిలోకి రావటంతో షడ్గ్రహ కూటమిగా మారింది.
ఆ తర్వాత మే 15, 2002 రోజున తెల్లవారు ఝామున 04.48కి సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించటంతో సప్తగ్రహ కూటమిగా మారింది. అదే రోజున తెల్లవారు ఝామున 05.44 కు చంద్రుడు మిథున రాశిలోకి మారటంతో తిరిగి షడ్గ్రహ కూటమిగా మారింది.
అదేరోజు సాయంత్రం 4.49కి శుక్రుడు మిథున రాశిలోకి మారటంతో తిరిగి పంచగ్రహ కూటమిగా మారింది. మే 19, 2002 రోజున ఉదయం 11.12కు కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించటంతో ఈ పంచగ్రహ కూటమి కూడా ముగిసింది.
ఈ పంచగ్రహ కూటమి ప్రారంభమవటానికి ఒక రోజు ముందు ఆఫ్ఘనిస్తాన్ లో 6.1 మాగ్నిట్యూడ్ తో భారీ భూకంపం వచ్చింది.
షడ్గ్రహ కూటమి
డిసెంబర్ 25, 2019 తేదీన సాయంత్రం 4.41 నుంచి, డిసెంబర్ 27. 2019 రాత్రి 11.45 మధ్యకాలంలో ఈ షడ్గ్రహ కూటమి సంభవించింది. ఈ సమయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎవరూ మర్చిపోరు. కోవిడ్ -19 ప్రారంభం ఈ సమయం నుంచే ప్రపంచానికి తెలియటం ఆరంభమయ్యింది.
2021 ఫిబ్రవరి 9వ తేదీన రాత్రి 8.30 నుంచి, ఫిబ్రవరి 12, 2021 అర్ధరాత్రి 2.10 మధ్యకాలంలో ఈ షడ్గ్రహ కూటమి సంభవించింది. ఈ సమయంలో అంటే ఫిబ్రవరి 10వ తేదీన పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న The Loyalty Islands లో 7.7 మాగ్నిట్యూడ్ తో భారీ భూకంపం వచ్చింది.
మార్చి 29, 2025, తేదీన రాత్రి 9.45 నుంచి, మార్చి 30, 2025 తేదీన సాయంత్రం 4.35 మధ్యకాలంలో ఈ షడ్గ్రహ కూటమి సంభవించబోతోంది. ఇది ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాల్సింది. (ఈ వ్యాసం 25-03-2025 రోజున అప్డేట్ చేయబడింది.) Update ఈ రోజు అంటే 28-03-2025 (షడ్గ్రహ కూటమికి ఒకరోజు ముందు) రోజున మయన్మార్ మరియు థాయిలాండ్ దేశాల్లో 7.7 మాగ్నిట్యూడ్ తో భారీ భూకంపం వచ్చింది.
ఈ ప్రకృతి విపత్తులకు గ్రహ కూటములకు గల సంబంధాన్ని జ్యోతిష పరంగా ఇంకా పరిశోధన చేయాల్సి ఉంది. ఇక్కడ నా దృష్టిలోకి వచ్చిన కొన్ని విషయాలు మాత్రమే చెప్పటం జరిగింది. అయితే ఈ గ్రహకూటములేవి కూడా వ్యక్తిగతంగా ఎటువంటి సమస్యలు ఇవ్వలేదనే విషయాన్ని అందరూ గుర్తించాలి…
Share this Article