Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బంగారం కూడా తినేస్తున్నాం… మన ‘ఘన ఖనిజ ఆహార వైభోగం’ అట్లుంటది మరి…

May 2, 2023 by M S R

Eatable Gold: “లక్షాధికారి అయినా లవణమన్నమె కానీ…

మెరుగు బంగారంబు మ్రింగబోడు” అని ధర్మపురి నరసింహ స్వామి గుడి మెట్ల మీద కవి శేషప్ప కొన్ని శతాబ్దాల క్రితం అమాయకంగా అనుకున్నాడు.

లక్షాధికారులు మెరుగు బంగారం మింగబోయే రోజులొస్తాయని కవి శేషప్ప ఊహించి ఉండడు. ఆంధ్రప్రదేశ్ లోని  డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పూతరేకులకు పెట్టింది పేరు. అక్కడి పూతరేకుల తయారీ రాకెట్ సైన్స్ కంటే గొప్పదని అనాదిగా కథలు కథలుగా లోకం చెప్పుకుంటోంది. చక్కర, బెల్లం, ఖర్జూరం, డ్రయి ఫ్రూట్స్ పూతరేకుల తయారీ దశ దాటి ఆత్రేయపురం ఇప్పుడు బంగారు పూతరేకుల దాకా వెళ్లింది.

అక్షయతృతీయకు బంగారం కొనకపోతే రౌరవాది మహా నరకాల్లో పడి గింజుకుంటామన్న సరికొత్త ఆధిభౌతిక జ్ఞానమేదో మనకు నగల దుకాణాల వాళ్లు కలిగించగలిగారు కాబట్టి…ఆ రోజు అప్పయినా చేసి బంగారం కొనడం ఒక అలవాటుగా చేసుకున్నాం. సామూహిక అలవాట్లే కొంతకాలానికి ఆ సమాజం సంప్రదాయంగా మారి తప్పనిసరిగా పాటించి తీరాల్సిన కట్టుబాటు అవుతుంది. అలా అక్షయతృతీయ రోజు బంగారు కొనడం సరదా అయి…అలవాటు అయి… సంప్రదాయమై…చివరికి తప్పనిసరి అయిపొయింది!

Ads

ఈ అక్షయ తృతీయ రోజు పరమ పవిత్ర బంగారు కొనడాన్ని ఆత్రేయపురం కూడా ట్రూ స్పిరిట్లో తీసుకుంది. బంగారు కొంటేనే అంతులేని సంపదలొస్తే…ఏకంగా బంగారాన్ని తింటే మనమే నడిచే సంపదగా మారిపోతాం అన్నట్లు పూతరేకులకు బంగారాన్ని అద్దింది. ఎడిబుల్ గోల్డ్ అంటే జీర్ణమయ్యే బంగారమట. బంగారాన్ని పలుచని పొరలా చేసి పూతరేకు లోపల చుడతారట. ఒక్కో పూతరేకు ధర 800 రూపాయలు. జనం ఎగబడి కొన్నారు. తిన్నారు.

రాళ్లు తిని…రాళ్లు అరిగించుకునే జీర్ణశక్తి ఒక ఆదర్శమయిన ప్రమాణం. ఇనుప గుగ్గిళ్లనే నమిలి, మింగి, అరిగించుకోగల మన మహా జీర్ణశక్తి ముందు ఈ సున్నితమయిన ఎడిబుల్ గోల్డ్ ఒక లెక్కా?

దేశంలో ఉదరకోశ వ్యాధి నిపుణుల(గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల) స్కానర్లు సరిగ్గా పసిగడుతున్నట్లు లేవు. లేకపోతే- మన కడుపుల్లో ఎన్నెన్ని తరగని ఖనిజాల గనులు దొరికేవో?

ప్లాస్టిక్ కు ఎప్పుడయినా కొరత ఏర్పడితే మన పొట్టల బట్టలు విప్పితే చాలు. ఎంత కావాలంటే అంత దొరుకుతుంది.

సంస్కృతంలో “అయః” అంటే ఇనుము. “అయోమయం” అంటే అర్థం కానిది అని అర్థం. అంటే కొరుకుడు పడనిది. మింగుడు పడనిది. జీర్ణం కానిది- అని. దేశంలో ఇనుప ఖనిజానికి ఎప్పుడయినా కొరత ఏర్పడితే మన మెదళ్లను ఓపెన్ చేయాల్సిన పని కూడా లేదు. ఒకసారి నిలుచున్న చోటే తలను అటు ఇటు ఊపితే చాలు…కొన్ని కోట్ల మెట్రిక్ టన్నుల అయోమయం కొండలు కొండలుగా పేరుకుపోతుంది.

“కడుపుకు అన్నం తింటున్నావా?
గడ్డి తింటున్నావా?”
అన్నది ఇదివరకు తిట్టు.

ఇప్పుడు-
“కడుపుకు అన్నం తింటున్నావా?
బంగారు పూతరేకు తింటున్నావా?”
అన్నది తిట్టు కాదు. పొగడ్త. ప్రశంస. గొప్ప. వైభోగం.

“లోకో భిన్న రుచిః”

ఆత్రేయపురం సువర్ణఖచిత పూతరేకు విభిన్న రుచిః!

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

తినే బంగారం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…
  • సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు..!
  • అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions