.
Ramu Suravajjula
( 94401 02154 )….. సీతాఫలం తినడం నేర్పాలి…
ఊళ్ళలో చెట్ల వెంట, పుట్ల వెంట తిరిగి కందికాయలు, రేగ్గాయలు, నేరేడు పళ్ళు (గిన్నెపళ్ళు), సీమ చింతకాయలు (గుబ్బ కాయలు), జామకాయలు వగైరా లాగించడం మనలో చాలా మంది చేసే ఉన్నారు. ఏడో తరగతి దాకా ఈ రకంగా ఊరుమీదబడి నోరు ఆడిస్తూ బంగారం లాంటి చదువు అశ్రద్ధ చేసి కొద్దిగా నష్టపోయిన బ్యాచ్ మనది.
గొల్లపూడి, రెబ్బవరం మధ్య రోడ్డు పక్క ఉన్న గిన్నె పళ్ళ కోసం పోస్ట్ లంచ్ లో స్కూల్ ఎగ్గొట్టడం వల్ల అచ్చమాంబ మేడం గారి హిందీ క్లాసులు మిస్సయి నష్టపోయాం. అది మేకప్ చేయడానికి చాలా ముష్కిల్ అయ్యింది.
Ads
జామ చిగురు, చింతపండు, జిలకర వేసి రోట్లో దంచి తింటే ఆ మజానే వేరుగా ఉండేది. అప్పుడే రేగ్గాయలు కోసి కొద్దిగా కారం, ఉప్పు వేసి చిట్టి గారెల్లా చేసి తినేవారు మిత్రులు గానీ నాకు నచ్చేది కాదు. వేరుశనగ చెట్టు పీకి పక్కనే పారుతున్న కాలవలో రెండు మూడు సార్లు ముంచి పచ్చి పల్లీ గింజలు తింటుంటే, వాహ్. వాటిలో ఇంకా గింజ పట్టని కాయలు కొరికితే నోట్లోకి జారే రసానిది అదో రుచి!
కందికట్టె మంట పెట్టి అందులో పల్లీ కాయలు వేసి రైతులు అవి మాడకుండా కాల్చడం నాకు అబ్బురం అనిపించేది. అట్లాంటి కాయల వల్ల చేతికి, నోటికి, బట్టలకు మసి అంటుతున్నా, బెల్లంతో కలిపి తినేవాళ్ళం.
ఈత చెట్టు కనబడితే పాపం. ముళ్ళు, తేళ్లు, పాములు పట్టించుకోకుండా చెయ్యి జాగ్రత్తగా పొదలో దూర్చి గెల చాకచక్యంగా పీకి దాని చివర్లో ఉన్న తెల్లటి గుజ్జు తింటుంటే..నా సామిరంగా!
అపుడపుడూ దొరికిన పొలాల మధ్య చెట్ల మీద దొరికే సీతాఫలాల తీపి గుర్తు తెచ్చుకుంటే నోరు ఊరుతుంది. కళ్ళు తెరిచిన పళ్ళను రామచిలకలు కాజేసేవి. పక్వానికి వచ్చిన కాయను రామచిలుక కొట్టి వదిలేశాక మనం తినాలి. ఆ రుచి అద్భుతం. మామిడి పండు రసం చుక్క కిందపడకుండా జుర్రుకోవడం ఎట్లా ఆర్టో, సీతాఫలం పండు తినడం కూడా నైపుణ్యంతో కూడిన యవ్వారమే. ఈ ఆర్టులో నేను, మా మేడం తలపండిపోయాం.
సీతాఫలాలు ఎక్కడ కనబడినా వదిలేది లేదు. కొత్తగూడెం చుట్టుపక్కల తండాల నించి లంబాడా కుటుంబాలు ఎడ్ల బండ్ల మీద సీతాఫలాలు తెచ్చి అమ్మేవారు. మా వాళ్ళు ఎక్కువ మొత్తంలో కొని విడతకి నాలుగైదు సునాయసంగా స్వాహా చేసేవారు.
ఈ మధ్యన హైబ్రిడ్ సీతాఫలాలు పెద్ద సైజులో వస్తున్నాయి. అందులో కొన్ని మాంచి రుచిగా ఉంటున్నాయి కానీ కొన్ని బాగుండటం లేదు. పైగా వీటి ధర ఎక్కువగా ఉంది.
నేను మొన్న సంగారెడ్డి నుంచి వస్తుంటే రోడ్డు పక్కన గిరిజన మహిళ నాటు సీతాఫలాలు అమ్ముతూ కనిపించిది. చింతకాయల కోసం చైనా, సీతాఫలాల కోసం సిడ్నీ పొమ్మన్నా పొయ్యి తెచ్చే రకాలం కాబట్టి జోరు వర్షం లెక్కచేయకుండా కారు ఆపి కొన్నా.
కళ్ళు విచ్చుకుంటున్న కాయలు ఏరి ఇచ్చింది ఆ అమ్మ. పండు రంగు బట్టి నేను రుచి అంచనా వేసే నిపుణుడిని. ఇంటావిడ వావ్… అనాలని జాగ్రత్తగా ఎంచి వెంటనే తినడానికి పళ్ళు కొన్ని, మగ్గబెట్టి తినడానికి కాయలు కొన్ని తెచ్చా. వాటిని అత్యంత భద్రంగా మాగబెట్టాను.
మూడు రోజుల నించి తీరిగ్గా కూర్చుని రెండు, మూడు లాగిస్తూ ఉంటే…ఈ పైన చెప్పుకున్న చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. ఆ ముచ్చట్లు మీకు చెప్పాలనిపించింది.
సీతాఫలాల పట్ల జన్ జీ వాళ్ళు పెద్దగా ఇష్టం కనబరుస్తున్నట్లు నాకు అనిపించదు. మాగిన పండుని జాగ్రత్తగా పట్టుకుని, ప్రతి కన్ను జాగ్రత్తగా తీసి, గుజ్జు కిందపడకుండా తినడం కష్టం. దీనికి ఓపిక కావాలి. పండు పట్ల ప్రేమ ఉండాలి. పైగా మాటిమాటికీ అడ్డం పడే గింజలు కూడా ఇబ్బందికరం… మన వాళ్ళకి.
గట్టి గింజలు ఎక్కడ చటుక్కున మింగుతారోనన్న భయం ఆధునిక పేరెంట్స్ కు ఉన్నట్లు నేను గమనించాను. బిజీ స్కెడ్యూల్ ఉన్న పిల్లలకి ఈ పండు తినే తీరిక ఉండడం కష్టం. పిల్లలు ఇంట్లో ఉంటే… ఈ అద్భుతమైన సీజనల్ పండు తినాలని చెప్పి తినిపిస్తాం మేము. పిల్లలకు ఇబ్బంది కాకూడదని స్పూను వాడి సీతాఫలం గుజ్జు తీస్తుంటే అవమానం అనిపిస్తుంది… నాకైతే…
(చిన్నప్పుడు దోస్తులతో కలిసి వెళ్లి చెట్లకు పెద్ద కాయలు తెంపుకుని రావడం… అప్పటికప్పుడు ఎండుకట్టెలు కూడా ఏరుకొచ్చి, మంటవేసి, ‘సీతాలపు కాయల్ని’ కాల్చి, అక్కడే స్వాహా చేసి, నల్లబడిన చేతులను, మూతులను ఏ బావి దగ్గరో కడుక్కుని… శుద్ధిగా, బుద్ధిగా ఇళ్లకు రావడం… ఆహా, మెమొరీస్…)
Share this Article