నిరోధ్‌లు, పాపడాలు అమ్ముకుని బతకాలంటూ సలహాలిస్తున్నాడు ఓ కాంగ్రెస్ నాయకుడు అని చెబుతూ, కుక్కల కొడుకులు అనే పదం వాడాడు… నీటి సామర్థ్యం గురించి తెలియని లత్కోరులే ఈ పరిస్థితికి కారణం అన్నాడు…
చవట, దద్దమ్మల పాలన వల్లే ఈ దుస్థితి… బోనస్ గనుక ఇవ్వకపోతే మీ గొంతుల్ని కోసేస్తం, చంపేస్తం… ఇదీ శ్రీమాన్ కేసీయార్ సారు గారి భాష… పైగా నిన్న ఎక్కడో మాట్లాడుతూ లిల్లీపుట్ గాళ్ల ప్రభుత్వం, లిల్లీపుట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషేమిటి..? అని ఎదురు దబాయిస్తాడు…
పక్కా పారడాక్స్… తనే నోటికొచ్చిన బూతులు వాడేస్తున్నాడు… మళ్లీ తనే ఎదుటోళ్లను ఇదేం భాష అని విమర్శిస్తాడు… అంతకుముందు కూడా అంతే కదా… పీకనీకి పోతున్నరా..? మేడిగడ్డా, బొందలగడ్డా..? తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇంతే కదా… తను ముఖ్యమంత్రిగా ఏ భాషైనా వాడొచ్చునట, ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో అలవర్చుకున్నది ఇదేం భాషో…?
Ads
ఇక రామజన్మభూమి మీద కూడా అలాగే నోరుపారేసుకున్నాడు కదా… ఆయన తిట్ల పురాణం చెప్పాలంటే అది ఒడవదు తెగదు… కానీ ఒకవైపు తిడుతూనే మరోవైపు ఎదుటోళ్లను ఇదేం భాష అని దబాయించడం, తప్పుపట్టడం కేసీయార్‌కే సాధ్యం… మోడీని కూడా నానా మాటలన్నాడు… మరి ఒక సీఎం ఒక పీఎంను అలా అనొచ్చా అని అడిగే ధైర్యం బీజేపీ నాయకులకు లేకుండా పోయింది…
ఇన్నాళ్లకు ఎన్నికల కమిషన్‌కు తన ఉనికి గుర్తొచ్చింది… కేసీయార్‌కు ఏప్రిల్ 5న సిరిసిల్లలో కేసీయార్ భాష, వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నోటీస్ జారీ చేసింది… గతంలోనే హెచ్చరించినా సరే మళ్లీ మళ్లీ అదే భాష, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే ధోరణి మారడం లేదని, వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించింది…
తనకు అలవాటైన భాషలో ఆ వివరణ ఉండకపోవచ్చు గానీ… ఎన్నికల కమిషన్‌తో అక్షేపణల దాకా రావడం కేసీయార్ పరంగా తప్పు… తెలంగాణ సాధించిన నేతగా ఓ హైరేంజులో నిలబడాల్సిన వ్యక్తి ఇప్పుడిలా ఎదుటోళ్లు వేలుపెట్టి చూపించే స్థితిలో ఉండటం ఓ ట్రాజెడీ…
ఇలా వ్యక్తిగత కామెంట్లు చేయవద్దని, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ఇమేజీ దెబ్బతీసేలా మాట్లాడవద్దని జనవరి 2న, మార్చి ఒకటిన లేఖలు రాసినట్టు కూడా ఎన్నికల కమిషన్ గుర్తుచేస్తోంది… సరే, ఈ నోటీసులకు కేసీయార్ బెదిరే రకమేమీ కాదు, ఎన్నికలు దగ్గరపడేకొద్దీ, సర్వేలు ఇంకా తన పార్టీ ఎదుర్కోబోయే నష్టాల గురించి చెప్పేకొద్దీ, ఫ్రస్ట్రేషన్ పెరిగేకొద్దీ, తన వ్యాఖ్యలకు, తన భాషకు ఆయన ఇంకా పదును కూడా పెంచొచ్చు…
కానీ ప్రజలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అలా ఘోరంగా తిరస్కరించాక కూడా కేసీయార్ తన వ్యవహార ధోరణి మీద ఆత్మవిమర్శ చేసుకోవడం లేదనీ, మారడానికి ప్రయత్నించడం లేదనీ చెప్పడానికి ఇది ఓ చిన్న ఉదాహరణే… అబ్బే, కేసీయార్ అలా మారేరకం కాదండీ అంటారా..? అంతేలెండి… మారేట్టయితే తను కేసీయార్ ఎలా అవుతాడు..!!
Share this Article