ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఈ ఎన్నికల వేళ బాగా చర్చనీయాంశం అయ్యింది… వైసీపీ కోసం ఆ వ్యవస్థ పనిచేస్తుందనేది టీడీపీ కూటమి నమ్మకం… అందుకే ఎన్నికలు ముగిసేదాకా వాళ్లతో పెన్షన్లు కూడా ఆపివేయించింది ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి… ఇంకేం, సమయానికి పెన్షన్లు రాక ఎవరెవరో చనిపోయారనీ, దుర్మార్గుడైన చంద్రబాబు వల్లే ఈ మరణాలు అని వైసీపీ గగ్గోలు స్టార్ట్ చేయగా… అధికార వ్యవస్థతో పెన్షన్లు పంపిణీ చేయకుండా జగనే ఆ మరణాలకు బాధ్యుడని చంద్రబాబు ఆరోపణ… అలియాస్ ఎన్డీయే విమర్శ…
సరే, ఏపీ పాలిటిక్స్‌లో ఎవరేం ఆరోపణలు చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో ప్రపంచంలో ఇంకెవడికీ అర్థం కావు… కానీ కాస్త ఇలాంటిదే ఒడిశాలో కూడా..! అక్కడా ఆరోపణలు చేసింది ఎన్డీయే కూటమే… బీజేపీయే… తక్షణం సుజాతా కార్తికేయన్‌ను బదిలీ చేయాలని పోరుపెట్టింది, ఎన్నికల సంఘానికి ఆమె ‘బీజేడీ ఏజెంట్’ అని ఫిర్యాదు చేసింది… చేయడమే తరువాయి ఎన్నికల సంఘం ఆమెను బదిలీ చేసిపారేసింది… అసలు ఫిర్యాదు ఏమిటి..? ఆమె ఎవరు..? బీజేపీ డౌటేమిటి..?
సుజాతా కార్తికేయన్ ఎవరో కాదు… 2000 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి… నవీన్ పట్నాయక్ దగ్గర పనిచేసీ చేసీ చివరకు ఆయన వారసుడిగా చెప్పబడుతూ, పార్టీలో సెకండ్‌గా మారిపోయిన వీకే పాండ్యన్ తెలుసు కదా… అదుగో ఆ పాండ్యన్ భార్య ఈ సుజాత… ఆమె ఆరేళ్లుగా మిషన్ శక్తి శాఖను పర్యవేక్షిస్తోంది… ఆమె పరిధిలో 70 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులున్నారు… ఒడిశా ప్రభుత్వం ఇన్నేళ్లూ ఆ గ్రూపులు స్వయంసమృద్ధం కావడానికి నిధులిస్తోంది, శిక్షణ ఇప్పిస్తోంది, రుణాలిప్పిస్తోంది… బీజేడీకి బలం ఈ 6 లక్షల గ్రూపులు… వీళ్లంతా బీజేడీకి విధేయులు, బీజేడీ గెలుపు కారకులు అని బీజేపీ భావన…
Ads
నిజానికి నవీన్ పట్నాయక్ 2001 నుంచే ఈ గ్రూపులకు బాగా ప్రాధాన్యమిస్తున్నాడు… పాండ్యన్‌లాగే సుజాత కూడా నవీన్ విధేయ అధికారుల్లో ఒకరు… మహిళలకు స్కూటర్ల స్కీం తీసుకొచ్చింది ఆమే… దుబయ్, సింగపూర్ వంటి దేశాలకు పంపించి ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పిస్తోంది… ఆమె చెప్పినట్టుగా బీజేడీ గెలుపు కోసం ఈ గ్రూపులు పనిచేస్తాయనేది బీజేపీ నమ్మకం… అందుకని ట్రాన్స్‌ఫర్ చేయించింది…
ఒడిశాలోని కేంద్రపర జిల్లా, పట్టముండై బ్లాకులోని బలూరియా ఆమె స్వస్థలం… దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది… ఇంటర్నేషనల్ పాలిటిక్స్‌లో మాస్టర్స్ చేసింది… తమిళనాడుకు చెందిన తన ఐఏఎస్ బ్యాచ్‌మేట్ పాండ్యన్‌ను పెళ్లిచేసుకుంది… నిజానికి పంజాబ్ కేడర్‌కు చెందిన పాండ్యన్ ఆమెను పెళ్లిచేసుకున్నాకే ఒడిశా కేడర్‌కు మారాడు… గత నవంబరులో ఆమెకు ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి శాఖ బాధ్యతల్ని కూడా అప్పగించాడు నవీన్ పట్నాయక్…
నిజంగా ఒక అధికారిణి చెబితే, ఆర్గనైజ్ చేస్తే ఆరు లక్షల గ్రూపులకు చెందిన 70 లక్షల మంది పోలోమంటూ జై బీజేడీ అని స్టాండ్ తీసుకుంటారా..? వాళ్లకు ఎవరికి వోటేస్తే మేలు జరుగుతుందో సొంత అభిప్రాయాలు, అంచనాలు ఏమీ ఉండవా..? ఠాట్, మాకు అవన్నీ అక్కర్లేదు, ఆమె బదిలీ కావల్సిందే అని పట్టుబట్టి బదిలీ చేయించింది బీజేపీ… హేమిటో..!!
Share this Article