1982లో తెలుగోళ్లకు రాజకీయ ప్రత్యామ్నాయం టీడీపీ అందించినట్టే వారికి సమగ్ర తెలుగు పత్రిక ఎలా ఉండాలో ‘ఈనాడు’ ఆచరణలో చేసి చూపించింది!
సిబ్బందికి చెప్పిన రోజే జీతాలిచ్చే పత్రిక ‘హిందూ’లా వందేళ్లు దాటి బతుకుతుంది…
………………………………………..
1974 చివర్లో… కృష్ణా జిల్లా ఉప్పలూరుకు చెందిన మా అమ్మ సంపూర్ణం (ఆమెది పక్కనున్న పునాదిపాడు) చిన్నాన్న (చిన్నాయనమ్మ పెద్ద కొడుకు) కామ్రేడ్ లోయ కనక బసవారావు గారు గుడివాడ నాగవరప్పాడు రోడ్డులోని మా ఇంటికి వచ్చాడు… వచ్చీ రాగానే అప్పటికి కొత్త పత్రిక ‘ఈనాడు’ ఆరేడు పాత కాపీలను ఆయన మా నాన్న ఎంఆర్ నాగేశ్వరరావుకు ఇచ్చాడు. ఈ బస్వారావు తాతయ్య జీవితాంతం సీపీఐ, తర్వాత సీపీఎంలో కొనసాగినా (కులం వేరైనా…) ఒకే ఊరు కమ్యూనిస్టులు కావడంతో… ఈనాడు తొలి ఎడిటర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ గారికి అత్యంత ఆత్మీయుడు.
Ads
ఈ పార్టీ, కుటుంబ అనుబంధం కారణంగా తాతయ్య ఈనాడు (అప్పటికి ఏకైక విశాఖపట్నం ఎడిషన్) పాత కాపీలను అన్ని ఒకేసారి మాకు తీసుకొచ్చి ఇవ్వగలిగాడు. అప్పుడు నేను స్థానిక ఏఎన్నార్ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నా. ఆరో తరగతి నుంచే (1967) నాకు నాటి ‘అనన్య ప్రచారం లేదా ప్రసారం గల’ ‘ఆంధ్రప్రభ’ డైలీ చదవడం అలవాటు. దాంతో ఆరోజు మా నాన్న చేతుల నుంచి తీసుకుని చూసిన ఈనాడు శీర్షికలు, అక్షరాల రూపురేఖలు (ఫాంట్లు) నాకెందుకో నచ్చలేదు.
ఇదేం పత్రిక? ఇలా ఉంది? విశాఖపట్నం పిచ్చాసుపత్రి నుంచి పారిపోయిన మనిషి మాటల్లా ఈనాడు హెడింగులు ఉన్నాయే! వంటి వ్యతిరేక భావనలు నాలో కలిగాయి. అదీగాక ఈనాడు పుట్టిన పది నెలల రెండు వారాలకు 1975 జూన్ 25న దేశంలో ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. కృష్ణా జిల్లాతో చదువు, ఉద్యోగం వంటి విషయాల ద్వారా సజీవ సంబంధాలున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి పరోక్ష మద్దతుతో, ప్రత్యక్ష ఆశీస్సులతో ఈనాడు వచ్చిందనే ప్రచారం కూడా… కృష్ణా జిల్లాలో మూలాలున్న మూడో పత్రికా యజమాని చెరుకూరి రామోజీరావు గారి తెలుగు పేపరుపై నాకు కొత్త పత్రికపై ఉండాల్సిన సానుకూల భావం ఏర్పడలేదు.
(మొదటి పత్రికాధిపతి ఎలకుర్రుకు చెందిన కాశానాథుని నాగేశ్వరరావు పంతులు, రెండో యజమాని కౌతవరం గ్రామానికి చెందిన కేఎల్‌ఎన్ ప్రసాద్ గారు) అయితే, 1977 ఫిబ్రవరిలో ఇందిరమ్మ అత్యవసర పరిస్థితి నిబంధనలు కొన్ని తొలగించి లోక్‌సభ ఎన్నికలు జరపనున్నట్టు ప్రకటన చేసినప్పటి నుంచీ ఈనాడు ‘కాంగ్రెస్ లేదా ఇందిర వ్యతిరేక తీవ్ర వైఖరి’ని మొన్నీ మధ్య కాలం వరకూ కొనసాగించింది. ఎప్పుడైతే కాంగ్రెస్ వ్యతిరేక లైన్ తీసుకుందో ఈనాడు నాకు అభిమాన పత్రికగా మారిపోయింది.
రాయ్‌పుర్‌లో నాతోపాటు ఎంఏ ఇంగ్లిష్ చదువుకున్న ఖమ్మం జిల్లా దెందుకూరు మనిషి పారుపల్లి మురళీధర్‌రావు 1982లో ఈనాడులో చేరినప్పుడు కూడా ఈ పత్రికలో చేరాలనే ఆలోచన నాకు రాలేదు. కాని, దురదృష్టవశాత్తూ 1983 డిసెంబర్‌లో ‘ఉదయం’ పత్రికలో సబ్ ఎడిటర్ ట్రెయినీగా ఎంపికవడంతో ఈనాడును ఇక మరింత శ్రద్ధగా పరిశీలించే అలవాటు కొనసాగింది. ‘ఉదయం’ పేరుతో వచ్చినా పదేళ్లకే పొద్దుగూకిపోయిన ఈ పత్రిక ఈనాడుకు ప్రత్యామ్నాయం కావాలనే అత్యాశతో 1984 చివరాఖరులో హైదరాబాద్, బెజవాడ నుంచి ఒకేసారి మొదలైంది.
విజయవాడ ఉదయం ఎడిషన్‌లో నేను వివిధ హోదాల్లో 1993 ఏప్రిల్ వరకూ (అది మూతపడడానికి రెండేళ్ల ముందే మానేశాను) కొనసాగిన నాకు బెజవాడ ఈనాడు సీనియర్ జర్నలిస్టు బీసీ నారాయణరావు గారు 1985లోనే నాకు ఆత్మీయుడయ్యారు. ఎస్‌ఎం గౌస్, పీబీ వీర్రెడ్డి, పీఎస్సార్ గారు మంచి మిత్రులయ్యారు. వారానికి ఒకట్రెండుసార్లు పటమట లంక వెళ్లి ఈనాడు మిత్రులతో భేటీలు వేయడం నాకు ఇష్టమైన వ్యాపకం అయింది అప్పట్లో.
పత్రికాఫీసుల మధ్య దూరం తక్కువ–రెండు పేపర్ల జర్నలిస్టుల మధ్య దోస్తీ ఎక్కువ!
……………………………………………
రెండు పత్రికాఫీసుల (ఈనాడు, ఉదయం) మధ్య కేవలం రెండు ఫర్లాంగుల దూరమే ఉండడం, రెండింటిలో పనిచేసే మేం పడమట, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించడంతోపాటు దాదాపు ఒకేరకమైన రాజకీయ అభిప్రాయాలు (అప్పటికి ఆధిపత్య పాలకపక్షం కాంగ్రెస్ అంటే తీవ్ర వ్యతిరేకత) ఉండడం కూడా మా సుదీర్ఘ స్నేహానికి దారితీసింది.
అంతేగాక, తెలుగు మధ్యతరగతి వర్గంలో అప్పటికి ఈనాడును గుడ్డిగా ద్వేషించడం ‘ఫ్యాషనబుల్’ కాదు కూడా. సాధారణ స్థాయిలోని ఇతర పత్రికల జర్నలిస్టులను ఈనాడులోకి తీసుకోకూడదనే పాలసీ 1970ల చివరి నుంచే మొదలైనప్పటికీ నన్ను ఎలాగైనా ఈనాడులో చేర్పించాలని ఒంగోలు దగ్గరి మద్దిపాడుకు చెందిన కమ్మ లోహియావాది అయిన బత్తిని చెంచు నారాయణ రావుగారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నేను కూడా ఈనాడులో చేరాలనే ప్రయత్నం చేయలేదు.
అది కుదిరే పనికాదనే భావనపాటు అక్కడ పనిచేయాలనే మోజు కూడా అప్పటికి నాలో కలగ లేదు. ఉదయం తర్వాత– పనిచేసిన నెల రోజులకు నిర్దిష్ట తేదీన జీతాలివ్వాలనే ఇంగితం, బాధ్యత లేని మరో ‘పోటీ పత్రిక’ ‘వార్త’లో 1995 ఫిబ్రవరి 20న చేరడం నా పాత్రికేయ జీవితంలో మరో దుర్ఘటన. చేరిన మొదటి ఐదు నెలల తర్వాత ఏనాడు జీతాలు ఫస్టు తర్వాత వారం, రెండు వారాలు, మూడు వారాలకు ఇచ్చేది ‘వార్త’ అగర్వాల్ యాజమాన్యం.
దీనికి తోడు ‘వార్త’ మొదటి ఇద్దరు ఎడిటర్లు ఏబీకే ప్రసాద్, కొండుభట్ల రామచంద్రమూర్తి అనే కమ్మ, బ్రాహ్మణ జర్నలిస్టుల తర్వాత గుంటూరు జిల్లాలో మూలాలున్న కాపు కుటుంబంలో వరంగల్ జిల్లాలో పుట్టిన టంకశాల అశోక్ గారు వార్త ఎడిటర్ అయ్యారు. స్వాతంత్య్ర సమరయోధుడు టంకశాల నరసింహారావు గారి కొడుకుగా ‘ప్రజా యుద్ధ పంథా’ కమ్యూనిస్టులతో అనుబంధం ఉన్న అశోక్ గారు అప్పటికే ఆంధ్రప్రభలో బలవంతపు వాలంటరీ రిటైర్మంట్‌తో ‘వార’్తలో వచ్చి చేరి ఉన్నారు.
మూర్తిగారు వేమూరి రాధాకృష్ణగారి ఆంధ్రజ్యోతిలో చేరడానికి రాజీనామా చేయగానే అశోక్ గారు ఎడిటరయ్యారు. ఈ పరిస్థితుల్లో 2003 ఆరంభంలో ఒకరోజు నైట్ డ్యూటీకి బయల్దేరడానికి ముందు (సాయంత్రం ఆరున్నరకు) నేను అన్నం తింటుండగా ఇంటికి అశోక్ గారు ఫోన్ చేశారు.
‘‘నాంచారయ్య గారూ, మీరు ఈరోజు నైట్ డ్యూటీకి రావద్దు, నిన్న ఖమ్మం జిల్లాకు చెందిన ఎరువుల కంపెనీ జువారీ డీలర్లు ఇద్దరు గోవా (కంపెనీ) విహార యాత్రలో భాగంగా బీచ్‌లో ఈదుతూ మునిగి చనిపోయారు. మన పేపర్లో ఆ వార్త రాలేదు. దీనికి ఎవరు బాధ్యలని ప్రస్తుతం బెంగుళూరు బజాజ్ ఆయుర్వేద ఆశ్రమ్‌లో చికిత్స పేరుతో సేదదీరుతున్న మన ఎండీ గారు (గిరీశ్ సంఘీ) నన్ను అడిగితే, నిన్న రాత్రి పీటీఐ క్రీడ్ చూసిన నాంచారయ్యదే బాధ్యత అని ఆయనకు చెప్పాను. తాను హైదరాబాద్ వచ్చేదాకా మిమ్మల్ని ఆఫీసుకు రావద్దని ఎండీ గారు నన్ను చెప్పమన్నారు,’’ అని సావు లాటి కబురు ‘జగమెరగని ఈ కాపు జర్నలిసు’్ట అశోక్ గారు చల్లగా చెప్పారు.
సంఘీ వచ్చేదాకా ఆఫీసుకు రావద్దని చెప్పిన గొప్ప కాపు ఎడిటర్ టంకశాల అశోక్!
……………………………………………
అంతటితో ఆగకుండా, ‘మీ ఉద్యోగానికి ధోకా లేదు. నేను చూసుకుంటా. ఆఫీసుకు మాత్రం రాకండి, ఇంటి పట్టునే ఉండండి,’ అని ఆయన గొంతు చెప్పింది. ‘నన్ను మీరు యజమాని పేరు చెప్పి నోటి మాటతో ఆఫీసుకు రావద్దని చెబుతున్నారు. నాకు కనీసం సస్పెన్షన్ ఆర్డర్ లేదా మెమో అయినా రేపు నేను ఆఫీసుకు వచ్చాక ఇప్పించండి,’’ అని నేను ఎడిటర్ గారిని అడిగాను. ఈ పేపర్లో అలాంటివి ఉండవని మీకు తెలయదా? అని అశోక్ గారు అనడం నాకు దిగ్భ్రాంతి కలిగించింది.
ఇలాంటి సందర్భాల్లో వెన్నపూస మాత్రమే తినే లేదా వెన్నుపూస లేని ఎడిటర్ బ్రాహ్మణుడైనా, కమ్మ అయినా, కాపు అయినా ఫలితం ఒకటేననే సామాజిక సత్యం నా కళ్ల ముందు ఆవిష్కృతమైంది. వారం తర్వాత గిరీశ్ సంఘీ హైదరాబాద్ వచ్చాక నా ఉద్యోగం అయితే ఊడలేదు. కాని నేనే వీలైనంత త్వరగా అశోక్ గారు వంటి సంపాదకుడి కింద, గిరీశ్ సంఘీ వంటి జీతాలివ్వడం ప్రజసేవ అనుకునే యజమాని సారథ్యంలో పనిచేయకూడదని నిశ్చయించుకున్నా.
కొద్ది నెలలకే అవకాశం రాగానే అదే ఏడాది సెప్టెంబర్ ఒకటి నుంచి హైదరాబాద్ శివారు పెద అంబర్‌పేట సమీపంలోని ప్రస్తుత రమాదేవి పబ్లిక్ స్కూలు భవనాల్లో తాత్కాలికంగా కొనసాగుతున్న ఈనాడు జర్నలిజం స్కూల్‌లో (ఈజేఎస్) చేరిపోయాను. అక్కడి స్కూలులోని స్కూలులో కరంట్ అఫైర్స్ పేరుతో సమకాలీన విషయాలు, ఆధునిక రాజకీయాలు–ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలు చెప్పే అవకాశం ఇచ్చారు ప్రస్తుత ఏపీ ఈనాడు ఎడిటర్, నాటి ఈజేఎస్ ప్రిన్సిపల్ మానుకొండ నాగేశ్వరరావు గారు.
అప్పటికి వేదికలపై ఉపన్యాసాలు ఇచ్చిన అనుభవం గాని, పాఠాలు చెప్పిన నేపథ్యం గాని లేని నేను ఆగస్టు చివరివారంలో 2003 ఈనాడు ప్రింట్ బ్యాచ్ విద్యార్థులకు ప్రయోగాత్మకంగా పాఠాలు చెప్పాను. ప్రిన్సిపల్ ఎమ్మెన్నార్ గారిని ఫీడ్‌బ్యాక్ ఎలా ఉందని అడిగితే, ‘‘దాని సంగతి మాకు వదిలేయండి, పాఠం చెప్పిన తీరు మీకు సంతృప్తికరంగా ఉంటే ‘పనినిబట్టి పారితోషికం’ ప్రాతిపదికన మీరు ఈజేఎస్‌లో కొనసాగవచ్చు. తర్వాత కొన్నాళ్లకు మిమ్మల్ని ఈనాడు రెగ్యులర్ రోల్స్‌లోకి తీసుకొచ్చే పని పూర్తిచేస్తా,’’ అని చెప్పడంతో ఈనాడు సంస్థలో నా ప్రయాణం మొదలై 2007 అక్టోబర్ 15 వరకూ అంటే నాలుగేళ్లు నడిచింది.
ఈ నాలుగు సంవత్సరాల్లో రామోజీ ఫిల్మ్ సిటీలోని మా గుడివాడ ప్రాంత కమ్మ ఉద్యోగులతో స్నేహం, యూపీ, రాజస్తాన్ వంటి హిందీ ఈటీవీ చానళ్ల జర్నలిస్టులతో సంపర్కం ఆ తర్వాత నా జర్నలిస్టు కరియర్‌కు ఉపయోగపడింది. ఈజేఎస్ ‘రెగ్యులర్లీ విజిటింగ్ ఫేకల్టీ’గా నాకు నెల నెలా ఇచ్చే పారితోషికం గొప్పగా లేకున్నా నా అవసరాలను మాత్రం అది తీర్చింది. ఈజేఎస్‌లో ఉండగా పరిచయమైన రాజస్తాన్ హిందీ జర్నలిస్టు ఒకరు, ‘‘ ఖేతీ ఉత్తమ్, వ్యవసాయ్ మధ్యమ్, నౌకరీ నికృష్ట్ (పంటల సాగు ఉత్తమం, వ్యాపారం మధ్యరకం, ఉజ్జోగం నికృష్టమైనది) ’’ అని ఓ రోజు ఆరెఫ్సీ క్యాంటీన్‌లో చెప్పిన హిందీ సామెత మా సొంతూరు గుడివాడ పోయే దారిలో వచ్చే ఆర్‌ఎఫ్‌సీ ముందు నుంచి వెళుతున్నప్పుడు తప్పని సరిగా నాకు గుర్తొస్తుంది.
అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన 2004 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈనాడు సోమాజిగూడ ఆఫీసులో ఎన్నికల సమరం అనే ప్రత్యేక అనుబంధం కోసం నేను రెండు నెలలకు పైగా పనిచేయడం మరచిపోలేని మంచి అనుభవం. నా పేరుతో మొదటిసారి రెండు ఎన్నికల విశ్లేషణలు ఈనాడు ఎన్నికల సమరంలో రావడం నేను ఎప్పటికీ తలుచుకునే విషయం.
ఈరోజు శనివారం మొదటిపేజీ ‘సంతక సంపాదకీయం’లో చెప్పిన ఐదు ప్రకటిత గుణాల్లో (విశ్వసనీయత, ప్రజా ప్రయోజనం, సత్యనిష్ఠ, కచ్చితత్వం, వృత్తి నైపుణ్యం) ఈనాడు మిగిలిన పేపర్ల కన్నా చాలా చాలా ముందున్న మాట వాస్తవమే కాదు అక్షర సత్యం. అయితే, ఈ పత్రికా సంస్థ ఉద్యోగుల నెల రోజుల కష్టానికి జీతాన్ని చెప్పిన తేదీకి ఇవ్వడం, రాజీనామా చేసిన ఉద్యోగికి సకాలంలో, రూపాయి కూడా కోసేయకుండా బకాయిలతో సరిగ్గా లెక్కగట్టి చెల్లించే విషయంలో ఇతర తెలుగు దినపత్రికలకు అందనంత దూరంలో ఉంది ఈనాడు. అందుకే 20వ శతాబ్దంలో ఈనాడుకు ముందు పుట్టిన ఆంధ్ర పత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్ర జనత వంటి పేపర్లు కనుమరుగయ్యాయి.
పోటీ పత్రికగా దూసుకొచ్చిన ఉదయం ఉద్యోగుల ఉసురు పోసుకుని చచ్చిపోయింది. మరో పోటీపత్రికగా చెప్పే ‘వార్త’ ఇప్పుడు వస్తున్నదీ లేనిదీ, బతికున్నదీ లేనిదీ సూటిగా చెప్పలేని విషయం. ఇకపోతే ఈనాడు కళ్లు తెరిచేనాటికి అత్యధిక సర్క్యులేషన్ ఉన్న తెలుగు డైలీగా తెలుగులో మొదటి పేజీ శిఖరాగ్రాన తెలుగులో ప్రకటించుకున్న ‘ఆంధ్రప్రభ’ రాజస్థానీ వైశ్యుడి (రామ్‌నాథ్ గోయంకా) యాజమాన్యం నుంచి తెలుగు కోమటి ముత్తా గోపాలకృష్ణ చేతుల్లోకి వచ్చి ‘వార్త’లాగానే ఇంకా బతికి ఉన్నట్టు తనదైన శైలి చూపించుకుంటోంది.
1980ల ఆరంభంలో సంక్షుభిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో 1982 వేసవి వేడి మొదలవక ముందు తెలుగుదేశం ఆవిర్భావం ఎంతటి చారిత్రక అవసరమో, ఐదు దశాబ్దాల క్రితం ఈరోజున ఈనాడు అనే కొత్త తెలుగు దినపత్రిక వానాకాలం తూర్పు తీరాన ఉదయించడం సకల తెలుగు పౌర సమాజానికి అంతే అవసరమై నిలిచిందని ఈ ఏబది సంవత్సరాల తెలుగు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిణామాలు నిరూపించాయి………. [ మెరుగుమాల నాంచారయ్య ]
Share this Article