చాలా ఏళ్ల క్రితం… రాజేంద్రప్రసాద్ అప్పుడప్పుడే హీరో అవుతున్నాడు… భానుప్రియ మాంచి జోరు మీదుంది… దర్శకుడు వంశీకి ఒకటీరెండు మంచి హిట్లు పడ్డయ్… రామోజీరావు అప్పుడు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ కింద సినిమాలు నిర్మిస్తున్న రోజులు… వంశీకి ఓ సినిమా అప్పగించాడు… పేరు ‘ప్రేమించు పెళ్లాడు’…
షూటింగు, ఏర్పాట్లు వంటి వ్యవహారాల్ని బాపినీడు చూసుకునేవాడు… రాజేంద్రప్రసాద్ శ్రీదుర్గ లాడ్జిలో ఉన్నాడు… ఓ సాయంత్రం వంశీ ఉన్న వేరే రూమ్‌కొచ్చాడు… వంశీ రూమ్ షెల్ఫుల్లో రకరకాల పచ్చళ్ల సీసాలు కనిపించాయి… సోమా కూల్‌డ్రింక్ పౌచులు కూడా… అప్పట్లో ఈనాడు గ్రూపు సోమా కూల్ డ్రింక్ కూడా తయారు చేసేది తెలుసు కదా…
అవన్నీ చూసిన రాజేంద్రుడు ‘‘అయ్య బాబోయ్, ఇవన్నీ ఎవరిచ్చారు మీకు?’ అనడిగేశాడు…‘‘బాపినీడుగారు… నాకోసం హైదరాబాదు నుంచి తెప్పించి, ఈ రూమ్‌లో సర్దించారు’’ అన్నాడు వంశీ… ‘‘ఎంతైంది ఖర్చు?’’ అడిగేడు రాజేంద్రుడు…‘‘ఖర్చూ, బిల్లూ ఏంటి ప్రసాదూ! నేనేం కావాలంటా పని గట్టుకుని అడగలేదు గదా ఆళ్ళనీ?’’ అన్నాడు వంశీ…
Ads
అంతే… ఒక కాగితం తీసుకుని షెల్ఫ్ లో ఉన్న పచ్చళ్ల పేర్లన్నీ రాసేసుకు పట్టుకెళ్ళి బాపినీడుకిచ్చేసి ‘‘ఇవన్నీ అర్జంటుగా కావాలండీ నాకు. ఇవేగాదు మీ దగ్గరింకా ఉన్న పచ్చళ్లు మొత్తం కావాలి. ఒకోటీ ఒకో పెద్ద సీసా’’ అన్నాడు రాజేంద్ర ప్రసాద్… సిన్సియర్‌గా ఆ లిస్టు తీసేసుకున్నాడు బాపినీడు…
ప్రసాద్ డిమాండ్ చేసినట్టుగానే మూడో రోజుకల్లా పెద్ద పార్శిలూ, పొడుగాటి బిల్లూ అతని రూముకొచ్చినయ్… బిల్లు చూసి గొల్లుమన్నాడు రాజేంద్రప్రసాదు… పరుగెట్టుకుంటూ బాపినీడు రూములోకెళ్లి… ‘‘ఇదేంటీ నాకు బిల్లు పంపారు…? ఆ డైరెక్టరు ఫ్రీగా పంపినట్టు చెప్పాడు… అతనికీ నాకూ తేడా ఏంటీ?’’ అన్నాడు…
నవ్వేసిన బాపినీడు ‘‘ఆ డైరెక్టరు మమ్మల్ని అడగలేదు. మేమే గిఫ్ట్ పంపేం. మీరు అడిగారు కాబట్టి మీకు అమ్మాం. అదే తేడా’’ అనేటప్పటికి అదోలాగైపోయిన ఆ హీరోకి ఇంకేం మాటాడాలో తొయ్యలేదు. తెరిచిన ఆ నోరు మరి ముయ్యలేదు. నెమ్మదిగా లేచి ఏ చప్పుడూ రాకుండా ‘‘అలాగా?’’ అన్న టైపులో హిహిహి అని నవ్వడం తప్ప… ఈనాడు పద్ధతులు ఇతర నిర్మాతల తరహాలో ఉండవు మరి…
——————
ఆ షూటింగ్ టైమ్‌లోనే… ఓ పొద్దుటిపూట… ‘ఈ చైత్రవీణ’ పాట ఉంది కదా… ఆ పాట ఫస్ట్ బ్యాక్ గ్రౌండ్‌లో మిగిలిపోయిన ఓ స్లోమోషన్ షాట్ కోసం పట్టిసీమ రేవులో దిగారు… ‘‘ఈ షాటొక్కటీ ఇప్పుడెందుకు తీస్తున్నాం?’’ అడిగాడు కెమెరా రఘు…
‘‘గోదాట్లోంచి రాజమండ్రి పేపరు మిల్లుకెళ్ళే ఆ వెదుళ్ళకట్టు రోజూ రాదు మరి’’ అన్నాడు వంశీ… పూలగుత్తి పట్టుకుని, కట్టు అంచుకి చివర్లో కూర్చున్న హీరోయిన్ దగ్గరకు రావాలి రాజేంద్ర ప్రసాద్… అది స్లోమోషన్ షాట్… రన్నింగ్ అని అరిచాడు హైస్పీడ్ మిచెల్ కెమెరా అసిస్టెంట్ కమలకణ్నన్… వంశీ వెంటనే ‘యాక్షన్’’ అన్నాడు…
పరుగెత్తుకుంటూ వస్తున్న ప్రసాద్ కాళ్లు జారి, నీళ్లలో పడిపోయాడు… మునిగినవాడు మళ్లీ పైకి తేలలేదు… అక్కడున్న పడవల వాళ్లకి సీన్ అర్థమైపోయింది… అమాంతంగా దూకేసి, నీళ్లు మింగేసిన హీరోను బయటికి లాగి, ఒడ్డుకి మోసుకొచ్చారు… షాక్‌లో ఉన్న వంశీ వాళ్లనడిగాడు… ‘‘ఇక్కడ లోతు ఎక్కువ ఉంటుందా..?
‘‘బాగా ఎక్కువండీ’’ అన్నాడో ముసిలోడు.
‘‘ఏమాత్రముంటదో?’’
‘‘ఎంత కాదనుకున్నా వంద అడుగులకి తక్కువ ఉండదండి’’ అనడంతో మూర్చొచ్చినంత పనైంది అందరికీ… దిగ్గుమని లేచి కూర్చున్న రాజేందప్రసాదు ‘‘అయ్యబాబోయ్’’ అని ఠారుమనేశాడు…
Share this Article