ఈనాడు వరంగల్ యూనిట్‌లో ఓ సబ్ ఎడిటర్‌ను తీసేశారు… పేరు, ఆయన వయస్సు, ఆయన జీతం ఎట్సెట్రా ఇక్కడ అనవసరం… తను ఉషోదయ ఎంప్లాయీ కూడా కాదు, శ్రమదోపిడీ కోసం ఈనాడు ఏర్పాటు చేసిన డిజిటల్ బ్యాచ్ సబ్‌ఎడిటర్ ఆయన… విషయం ఏమిటీ అంటే..? ఓ అక్షర దోషానికి తను బాధ్యుడట… నిజమే, చాలా దారుణమైన తప్పు దొర్లింది… అయితే తనొక్కడే దానికి కారకుడా..? ఓ సబ్‌ఎడిటర్‌ను పీకేస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోతుందా..? ఆ సోయి కూడా ఉండాల్సింది… అదే లేకుండా పోయింది…
దొర్లిన తప్పు ఏమిటీ అంటే..? ఆ క్లిప్పింగ్ ఇక్కడ పోస్ట్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది, అందుకే అవాయిడ్ చేస్తున్నాను… చాలా చాలా చిన్న వార్త అది… వరంగల్ క్రైం వార్త… ఎల్లాపూర్ శివారులో ఏడుగురు వ్యక్తులు పేకాటాడుతుండగా పట్టుకుని, నగదు, నాలుగు వెహికిల్స్, ఆ పేక ముక్కల్ని కూడా స్వాధీనం చేసుకున్నారనే అత్యంత సాదాసీదా వార్త… అసలు ఆ వార్తే శుద్ధ దండుగ… సరే, పేజీలు నింపాలి కాబట్టి రిపోర్టర్ ఏదో రాశాడు, సబ్‌ఎడటర్ పేజీల్లో పెట్టాడు…
అయితే… పేకాటాడుతుండగా పదంలో పే బదులు పూ అని పడింది… తప్పు తప్పే… నిన్నంతా జర్నలిస్టుల సర్కిళ్లలో తెగ చక్కర్లు కొట్టింది ఆ క్లిప్పింగ్… అసలు పేకాటరాయుళ్ల అరెస్టు, వ్యభిచారుల అరెస్టు వంటి డొల్ల వార్తలతో సొసైటీకి వచ్చే ప్రయోజనం లేదు, స్పేస్ వేస్ట్… అవాయిడ్ చేయడం బెటర్… లక్ష కేసులు పెట్టి, పది లక్షల మందిని అరెస్టు చేసినా పేకాట ఆగదు, వ్యభిచారం ఆగదు… నిజానికి గతంలో ప్రింటింగ్‌కు టైప్ సెట్టింగ్ ఉండేది కదా… కంపోజింగ్ సమయంలో తప్పుడు అర్థాలు వచ్చే లెటర్స్ పొరపాటుగా కూర్చబడితే, ఆ తప్పుడు పదాలు పబ్లిష్ కాకూడదనే భావనతో కొన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్లు…
Ads
ఉదాహరణకు… కాపుకొచ్చింది అని రాస్తే పర్లేదు… కానీ కాపుకు వచ్చింది అని రాసినప్పుడు ప కు కొమ్ము బదులు కొమ్ముదీర్ఘం, అంటే పు బదులు పూ అని పబ్లిష్ అయితే తప్పుడు పదం జనంలోకి వెళ్తుంది… అందుకని అలాంటి పదాలు వచ్చినప్పుడు ఎందుకైనా మంచిదని కాపునకు అని కంపోజ్ చేయాలని స్ట్రిక్టుగా చెప్పేవాళ్లు… చివరకు ఆ భయం ఎక్కడిదాకా పోయిందంటే, జప్తుకు అనే పదం రాయాలంటే కూడా జప్తునకు అని రాస్తున్నారు…
ఇప్పుడు కంప్యూటర్లు, డిజిటల్ కంపోజింగ్.., పేజీనేషన్ దగ్గర నుంచి ప్రింటింగ్ దాకా బోలెడు సాంకేతిక మార్పులు వచ్చాయి… ఐనా తప్పులు వస్తూనే ఉన్నాయి… ఎందుకంటే, ఈ తప్పులు మానవసంబంధం కాబట్టి… వాటిని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలో ఆలోచించాలి… సబ్ఎడిటర్ల మీద విపరీతమైన పని ఒత్తిడి… గతంలోలాగా ప్రూఫ్ రీడర్లు లేరు… అసలు పేజీలు పాస్ చేసేముందు క్రాస్ చెక్ చేసే సిస్టమే లేదు… అసలు పత్రికల బాధ్యులు ప్రతిరోజూ పేపర్‌ను నిష్ఠగా, శ్రద్ధగా చదువుతున్నారా..? అది పెద్ద డౌట్… మరి దేశంలోని టాప్ టెన్ పత్రికల్లో ఒకటైన ఈనాడుకే దీని మీద సోయి లేదంటే, దాన్ని చూసి వాతలు పెట్టుకునే మిగతా పత్రికల గతేమిటి..?
టెంపరరీ సొల్యూషన్స్, ఉద్యోగాల్ని ఊడబీకడం కాదు జరగాల్సింది… అలాగని పేకాట, ఆడటం పదాల్ని కలిపి రాయడాన్ని నిషేధిస్తారేమో… కొత్తగా సాఫ్ట్‌వేర్ వస్తోంది… ఇలాంటి పదాలు వచ్చినప్పుడు, దిగువన ఎర్రగీత కనిపిస్తుంది… మైక్రోసాఫ్ట్ వర్డ్ కంపోజింగులో ఉన్నట్టే… అలాంటివి ఆలోచించాలి గానీ… ఒకడి జీతాన్ని ఉరితీయడం పరిష్కారమైతే కాదు…!! ఈ-పేపర్ మధ్యాహ్నానికి మార్చేశారు, కానీ ప్రింట్ కాపీల్ని ఏం చేస్తారు..?!
ఈనాడు పెద్దల కోసమే కాదు, తెలుగు జర్నలిస్టు లోకం చదవడం కోసం పైన వార్తల్ని యాడ్ చేశాను… ఏ డర్టీ పదం దొర్లిందని మనం చింతిస్తున్నామో సరిగ్గా అదే వార్తపైన ‘‘పేకాటాడుతున్న మహిళల అరెసు’’ అని మరో వార్త ఉంది… మ్యాటర్‌లో కూడా అదే పదం ఉంది… మరి దిగువ వార్తలో పే బదులు పూ వచ్చింది కదా, ఈ మహిళల వార్తలో గనుక ఆ తప్పు దొర్లి ఉంటే ఇంకా ఎంత కంపు కంపు అయి ఉండేది… పైగా ఇలాంటి వార్తల్లో ఎవరి పేర్లూ ఉండవు… కేవలం ఆ పోలీసుల మెహర్బానీ కోసమేనా..?
దీనిపైన వార్త చూడండి, అది చికిత్స పొందుతూ మృతి కాదు… నిజానికి అది యాక్సిడెంట్ కేసు… ఆపైన మరో వార్త చూడండి, మనస్తాపంతో మహిళ అని హెడింగ్… మహిళ ఆత్మహత్యా..? హత్యా..? పరారీయా..? ఏం జరిగింది..? ఆపైన వార్త చదవండి… గాయపరుకుచున్నాడు అట… సరే ఇలాంటి కంపోజింగ్ తప్పులు సహజమే అనుకుందాం… కానీ ఒక్కటి ఆలోచించాలి… పోలీసుల జనరల్ డైరీలో ఉన్న ప్రతిదీ, వాళ్లు చెప్పినట్టే రాస్తే అది క్రైం రిపోర్టింగా..?! వరంగల్ మిత్రులే కాదు, ప్రతిచోటా ఇలాగే ఉంది, ప్రతి పత్రికలోనూ ఇలాగే ఉంది… అదీ అసలు సమస్య…!!
హైదరాబాద్ సిటీ ఎడిషన్ ఫస్ట్ పేజీ వార్త ఇది… ఒక వార్త ఎలా రాయకూడదు అని చెప్పడానికి అదే ఈనాడు జర్నలిజం స్కూల్ సిలబస్‌లో పెట్టుకోవచ్చు… నెల క్రితం వార్తను మళ్లీ తాజా వార్తలాగా రాయడం ఈనాడుకే చెల్లింది… పోలీస్ కమిషనర్ షిటీమ్స్‌ను అభినందించారు అనే ప్రకటనకు ఈ వక్రత అవసరమా..? ఈనాడు పెద్దలు అసలు పత్రికను చదువుతున్నారా..?
Share this Article