ఇదీ అసలు సిసలు యూట్యూబ్ చానెల్ మార్క్ థంబ్ నెయిల్… ఈనాడు ఆఫీసు మకుటం నేలమట్టం అనగానే అందరి దృష్టీ జగన్ మీదకు వెళ్తుంది… రామోజీరావును అరెస్టు చేయలేక, ఇక పగను ఆపుకోలేక ఏకంగా ఈనాడు ఆఫీసు మీద పడ్డాడేమో అనుకుంటారందరూ… కానీ ఈ భవనం తాలూకు ఈనాడు ఆనవాళ్లు నేలమట్టం కావడానికీ జగన్‌కూ సంబంధం ఏమీ లేదని గమనింపగలరు…
నిజానికి స్థూలంగా చూస్తే ఇదొక ప్రైవేటు ప్రాపర్టీల వ్యవహారం… కానీ కాస్త ఎమోషనల్‌గా, ఇంకాస్త ఈనాడు చరిత్రపరంగా చూస్తే, దీనికి ఓ విలువ ఉంది… అదేమిటంటే…? ఇది విజయవాడ ఈనాడు ఆఫీసు.,.. డాల్ఫిన్ అప్పారావుగా పిలవబడే ఓ పెద్దమనిషి రామోజీరావు తోడల్లుడు… సదరు అప్పారావుకు ఒక సమీప బంధువు ఉన్నాడు… ఆ ఇద్దరికీ కలిసి మూడెకరాల భూమి ఉండేది… అది లీజుకు తీసుకుని అక్కడ అప్పుడెప్పుడో ఈనాడు ఆఫీసు పెట్టారు, కట్టారు…
ఎన్నో ఏళ్లుగా సదరు ప్రాపర్టీ మీద రామోజీరావుకు, వాళ్లకు వివాదాలున్నయ్… హైదరాబాద్ హెడ్డాఫీసుసహా ప్రతిచోటా ఈనాడు ఆఫీసుల కథలన్నీ ఇలాంటివే కదా… సదరు విజయవాడ ఆఫీసు రూల్ వయోలేషన్స్ మీద కూడా అప్పట్లో వార్తలు వచ్చేవి… సరే, తగాదాలు నడిచీ నడిచీ, చివరాఖరికి ఆ భూమిలో సగాన్ని రామోజీరావు అప్పారావు కజిన్‌కు స్వాధీనం చేసేశారు… ఆయన ఇప్పుడు దాన్ని ఎవరో డెవలపర్‌కు ఇస్తే, ఆయన పాత ఈనాడు ఆనవాళ్లన్నీ కూలగొట్టి, పాత వాసనలేమీ లేకుండా ఆ భవనాన్ని ఎన్ఆర్ఐ హాస్పిటల్‌కు ఇచ్చేస్తున్నాడట… అదీ సంగతి…
Ads
(ఇది ఈనాడు అప్పటి ఆఫీసు)
(ఇది ప్రస్తుతం మార్పులు చేస్తున్న భవనం)
(ఈనాడు ఆఫీసు తరలిపోయినట్టు సూచికలు)
సో వాట్… మొత్తం భవనంలోని ఈనాడు తాలూకు ఏ ఒక్క ఆనవాలూ లేకుండా ఖాళీ చేసేశారు… ఇప్పుడు ఆఫీసుపై కనిపించే ‘ఈనాడు’ మకుటాన్ని కూల్చేశారు… అయితేనేం…? భవనాలన్నాక కూల్చేస్తుంటారు, కొత్తవి కడుతూనే ఉంటారు, మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటారు, అదంతా ఓ బిల్డర్ వ్యవహారం, ఇందులో పెద్ద వార్తేముంది అంటారా..?
ఉంది, వార్తకు మించి తెలుగు జర్నలిస్టులకు చాలా ఎమోషన్స్ ముడిపడిన బిల్డింగ్ అది… అది తెలుగు జర్నలిజం నవ ప్రస్థాన ప్రతీక… మనం అతిరథ మహారథులుగా చెప్పుకునే అనేకమంది బడా జర్నలిస్టుల చెమట పరిమళం అద్దుకున్న గోడలవి… వాళ్ల ‘కలంపని’ ప్రారంభమైందే అక్కడ… వాసిరెడ్డి, మోటూరి వెంకటేశ్వరరావు, మాజీ న్యూస్‌టుడే ఎండీ రమేష్‌బాబు, పెద్దాడ నవీన్, కొమ్మినేని శ్రీనివాసరావు, కేవీఎస్ తదితరులు… (వివిధ మీడియా సంస్థల్లో మంచి హోదాల్లోకి చేరిన చాలామంది జర్నలిస్టులు పాత ఈనాడు ఉత్పత్తులే… ప్రస్తుత ఈనాడు ఎడిటర్ MNR కూడా బెజవాడ ఎడిషన్‌లో పనిచేసినట్టుంది…) అదీ దాంతో తెలుగు జర్నలిజానికి ఉన్న ఉద్వేగబంధం… అలాగని దాన్ని తెలుగు జర్నలిజం స్మారకభవనంగా ఉంచేయమంటారా ఏమిటీ అని దీర్ఘాలు తీయకండి…
ఇప్పుడు ఆ భవనంలో ఈనాడు లేదు, అదెప్పుడో వేరే ఆఫీసుకు తరలిపోయింది… ఈనాడు పుట్టింది విశాఖలోనైనా… ఎదిగిందీ, ఉజ్వలంగా వెలిగే దశ ప్రారంభమైందీ విజయవాడలోనే… తన బలం తాను తెలుసుకుని, జర్నలిజం బలం కూడా తెలుసుకుని పెద్ద సారు ‘బరితెగింపు’ ప్రారంభమైంది కూడా ఈ విజయవాడ ఆఫీసులోననే అంటారు… హైదరాబాద్ ఆఫీసు, తెలుగుదేశం పుట్టుక, ఎట్సెట్రా పరిణామాలతో ఆ తరువాత మరో చరిత్ర…
Share this Article