ఇక దేహం సహకరించడం లేదు… వయస్సు పైనబడుతోంది… అలసట కమ్మేస్తోంది… మనస్సు, శరీరం ఇక సెలవు తీసుకుందాం అంటున్నాయి… టైమ్ సమీపిస్తోంది… అదుగో మరణం నన్ను రమ్మంటోంది…. ఇవే భావాలు తరుముకొచ్చాయేమో… 88 ఏళ్ల రామోజీరావు కొన్నాళ్ల ముందు తన గురించి, తను లేకపోతే తన సంస్థల గురించి, మరణం గురించి చెప్పుకున్నాడు…
‘నా జీవనగమనంలో మబ్బులు ముసురుకుంటున్నాయి, వానగా కురవడానికో, తుపానులా ముంచెత్తడానికో కాదు, నా మలి సంధ్యాకాశానికి కొత్త రంగులు అద్దడానికి’ అన్న కవి రవీంద్రుడి మాటల్ని గుర్తుచేసుకుంటూ ఒక ‘బాధ్యత వీలునామా’ రాసిపెట్టాడు ఆయన… అంటే, తన సంస్థలు తన తదనంతరమూ ఎలా నడపబడాలో చెప్పాడు… ఎవరో చెప్పలేదు, ఈ విషయాన్ని ఈనాడే చెబుతోంది కాబట్టి నమ్ముదాం…
మరో లేఖ గురించీ ఈనాడే తన సంపాదకీయ పేజీలో రాసుకొచ్చింది… ఆయన సంతకంతో కూడిన ఆ లేఖ పాఠాన్ని కూడా చెప్పింది… కొన్నాళ్ల క్రితం రామోజీరావు రాసి పెట్టుకున్నదే అనీ గుర్తుచేసింది… అందులో ఓ పార్ట్ ఇలా…
Ads
‘మందులకే కాదు, సమస్త ప్రాణులకూ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది… నేను లేకున్నా రామోజీ సంస్థలన్నీ తెలుగుజాతి తలలో నాల్కలా కొనసాగాలన్నది నా ఆశ, ఆకాంక్ష… ఇక సెలవు’ అని ముగుస్తుంది అది… దీన్ని కూడా ఈనాడే బయటపెట్టింది కాబట్టి ఇదీ సాధికార వెల్లడే అనుకుందాం…
ఇంతేకాదు, మనం ఇంతకుముందు పలుసార్లు చెప్పుకున్నట్టు తను ఒక తరాన్ని ముందు చూస్తాడు ఆలోచనల్లో… 10, 20 ఏళ్ల భవిష్యద్దర్శనం చేసి నిర్ణయాలు తీసుకుంటాడు కదా… తన స్మారకాన్ని కూడా ముందే కట్టించుకున్నాడు… బాగుంది… కాకపోతే స్మశానవాటికల్లో చితిని కాల్చే కట్టడంలా… మధ్యలో ఫ్లోరింగ్ లేకుండా ఖాళీగా ఉంచేసి, పొగ పైకి స్వేచ్ఛగా వెళ్లిపోయేలా కట్టినట్టు కనిపిస్తుంది…
బహుశా దహనమే చేస్తారేమో… అక్కడే అధికారికంగా అంత్యక్రియలు జరుపుతారని ఈనాడే వెల్లడించింది… తను మరణిస్తే తనను ఎక్కడ కొలువు తీర్చాలని కూడా రామోజీరావు ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాడు… కొందరికి నచ్చినా నచ్చకపోయినా అది తన స్టయిల్… అంతే…
ఇక ముందు రామోజీ ఫిలిమ్ సిటీని సందర్శించే వాళ్లకు ఈ స్మారకాన్ని కూడా దర్శనీయ స్థలాల్లో ఒకటిగా చూపబోతున్నారన్నమాట… గతంలో తాను మరణిస్తే ఈనాడులో ఫస్ట్ పేజీలో చాన్స్ ఇస్తారా లేదా అని సరదాగా ఎడిటోరియల్ మీటింగుల్లో అనేవాడట… వార్త ఏమిటి సార్..?
తమ అధినేత మరణానికి ఏకంగా 10 ప్రత్యేక పేజీల్లో ప్రత్యేక కథనాలు వెలువరించి ఘనంగా వీడ్కోలు పలికింది ఈనాడు… సరైన నివాళి ఈనాడు పత్రిక సిబ్బంది తరఫున… తన టీవీ చానెళ్లు కూడా ప్రత్యక్ష ప్రసారాలతో తమ విధిని నిర్వర్తించాయి… గుడ్… ఇతర పత్రికల్లో సహజంగానే ఊహించినట్టుగానే ఆంధ్రజ్యోతి బ్యానర్ స్టోరీతో పాటు ఓ ప్రత్యేక పేజీ పబ్లిష్ చేసి, తమ సోదరపత్రికగా నివాళి ఘనంగానే అర్పించింది…
ఇన్నాళ్లు రామోజీరావు సంస్థల్లో అంతర్లీనంగా ఓ భయం ఉండేది… ఎక్కడి నుంచో మనల్ని చైర్మన్ గమనిస్తున్నాడు, తప్పు జరిగితే ఊరుకోడు, మెచ్చుకోవాలన్నా వెనుకాడడు అనే భావన క్రమశిక్షణలో ఉంచేది… ఐనా సరే, ఉషాకిరణ్ మూవీస్ వంటి సంస్థల్లో అక్రమాలు, ఆయనకే వెన్నుపోట్లు అనేది వేరే కథ… మరిప్పుడు ఆయనే లేకపోయాక ఆ సంస్థల ప్రస్థానం..? బహుశా మార్గదర్శి శైలాజా కిరణ్ కీలకంగా వ్యవహరించబోతున్నారేమో… రామోజీరావు మనవళ్లు, మనవరాళ్ల తరం వచ్చేసినా సరే, వాళ్లకు అనుభవం వచ్చి, వాళ్లు పూర్తి బాధ్యతలు తీసుకునేంతవరకు… మార్గదర్శి పగ్గాలు పట్టుకున్న ఆ మహిళే మొత్తం ఈనాడు గ్రూపుకి మార్గదర్శి కానున్నదేమో..!!
Share this Article