చాలారోజుల నుంచి వింటున్నదే… ఈనాడు అన్నదాత మ్యాగజైన్ సిబ్బందిని అక్కడి నుంచి మార్చినప్పుడే అర్థమైంది దాన్ని ఎత్తేస్తున్నారని… సింపుల్, ఈనాడు గ్రూపే కాదు, ఏ కార్పొరేట్ కంపెనీ అయినా సరే అంతే… ఇన్నాళ్లు పాడిగేదెలా పాలిచ్చింది అన్నదాత అనే మ్యాగజైన్… కానీ ఇప్పుడది వట్టిపోయింది… దాణా ఖర్చు ఎక్కువ, పాలు తక్కువ… ఇంకేముంది..? కబేళాకు తరలించేశారు… (పత్రికను కార్పొరేట్ కంపెనీ అనవచ్చా అని అమాయకంగా అడక్కండి… ఒకింత ఎక్కువే)…
ప్రింట్ మీడియాకు గడ్డురోజులు అని ఆ ఫీల్డు మొత్తానికి తెలుసు… తెలుగు పత్రికలు ఏమీ భిన్నం కాదు కదా… తెలుగు పత్రికల సర్క్యులేషన్ ఎంత ఘోరంగా పడిపోయిందో ‘ముచ్చట’ అంకెలతో సహా చెప్పింది… భారంగా మారిన ఈనాడు అనుబంధ మ్యాగజైన్లన్నీ మూసివేత ఖాతాలో పడేశారు… సితారతో మొదలై, విపుల, చతురు, తెలుగు వెలుగు… అన్నీ… ఇప్పుడు అన్నదాత… ఇక కేవలం ఈనాడు మిగిలింది… నిజంగా జనానికి ఉపయోగమున్నవీ, నిష్పాక్షికంగా చదవగలిగినవీ విపుల, చతుర, అన్నదాత… అవేమో మూసివేత… తెలంగాణలో కేసీయార్ అంటే జడుపు, ఏపీలో జగన్ మీద ఏడుపు మాత్రమే కనిపించే ఈనాడు మాత్రం కొనసాగుతోంది…
నిజానికి అన్నదాత మూసివేతకు చెప్పిన సాకులు మాత్రం చివుక్కుమనిపించాయి… అసలు వాళ్లు అలా చెప్పుకోవడం వాళ్లను వాళ్లు తక్కువ చేసుకోవడమే..! తెలుగు రైతాంగం అన్నదాత మ్యాగజైన్‌కు బాగా విలువ ఇస్తుంది… ఈరోజుకూ దాని కాపీలకు ఢోకా లేదు… అది రామోజీరావుకు ఇమేజ్… ఐనాసరే, నష్టం వస్తుందని మూసివేత ఖాతాలో వేసేశారు… ‘‘అన్నదాత అవసరం ఇప్పుడు లేదు, డిజిటల్ సమాచారం ఎప్పటికప్పుడు రైతులను చేరుతోంది, మా ఈటీవీ అన్నదాత కూడా సమాచారం ఇస్తోంది…’’ అనేవి మూసివేత వివరణలో మూడు వాక్యాలు…
Ads
- అన్నదాత అవసరం లేదనడం సరైన మాట కాదు… ఈరోజుకూ శాస్త్రీయ, విశ్వసనీయ వ్యవసాయ సమాచారం ఇచ్చే పత్రిక అన్నదాతే… దాని స్టాండర్డ్ అదీ… ఐనా మిమ్మల్ని మీరే కించపరుచుకోవడం దేనికి..?
- డిజిటల్ సమాచారం ఎప్పటికప్పుడు వస్తోంది… కానీ ఎంతమేరకు నమ్మబుల్..? బిట్లు బిట్లుగా వచ్చే ఆ సమాచారం ఎంత ఉన్నా సరే, ఒక రైతు అన్నదాతనే పదిలంగా భద్రపరుచుకుంటాడు…
- ఈటీవీ అన్నదాత కార్యక్రమం పైసామందం కూడా అన్నదాత మ్యాగజైన్‌కు ప్రత్యామ్నాయం కాదు… ఆ వాదనే అర్ధరహితం…
నిజమేమిటో చెప్పి ఉండాల్సింది… ప్రింట్ ఖర్చు పెరుగుతోంది, దానిపై రెవిన్యూ లేదు, కవర్ ప్రైస్ పెంచే అవకాశం లేదు… అందుకని మూసేస్తున్నాం అని నిజం చెప్పి ఉండాల్సింది… కానీ ఏమాటకామాట… సండే మ్యాగజైన్ కూడా అంతే… ఖర్చు ఎక్కువ, రెవిన్యూ తక్కువ… అడ్డికపావుశేరు చొప్పున స్పేస్ అమ్ముతున్నారు… చివరకు రీజియన్ వైజ్ యాడ్స్ కూడా వేస్తున్నారు… యాడ్స్ సేకరణలో గతంలో ఈనాడు వేరు, ఇప్పటి ఈనాడు వేరు… ఎంతకైనా దిగజారుతోంది…
సో, సండే మ్యాగజైన్ కూడా వట్టిపోయిన పాడిగేదె అనుకుని, దాన్ని కూడా కబేళాకు పంపించకండి సార్… అది లేకపోతే ఈనాడు లేదు… ఇప్పటికి 25-30 శాతం పోయింది, సండే మ్యాగజైన్ కూడా వద్దనుకుంటే మరో 20 శాతం వెంటనే డ్రాప్ తప్పదు… ఐనా రెండుమూడు మెయిన్ పేజీలు తగ్గించండి… ఎవడు చదువుతున్నాడు ఆ చప్పిడి పథ్యం తిండి వార్తలు…!!
Share this Article