Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తుపాకీ పడితే ‘రికార్డే’… భేష్, హైదరాబాదీ సంచలనం ఈషా సింగ్..!

May 28, 2026 by M S R

.

క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి గ్లామర్ క్రీడల హడావుడిలోనే మనవాళ్లు ఎక్కువగా మునిగితేలుతున్న వేళ, నిశ్శబ్దంగా లక్ష్యాన్ని గురిచూసి కొడుతూ దేశ ప్రతిష్టను ప్రపంచ పటంలో నిలబెడుతోంది ఒక హైదరాబాదీ అమ్మాయి. నిన్న జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ISSF వరల్డ్ కప్ (రైఫిల్/పిస్టల్) 2026 పోటీల్లో సరికొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది మన ఈషా సింగ్.

ఒకవైపు ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్.. మరోవైపు ప్రపంచ ఛాంపియన్లు.. అంతా హేమాహేమీలు ఉన్న వేదిక అది. కానీ, అక్కడ ఒత్తిడిని దరిచేరనివ్వకుండా, గురి తప్పకుండా దూసుకెళ్లింది 21 ఏళ్ల ఈషా సింగ్. జర్మనీలో జరుగుతున్న ISSF వరల్డ్ కప్ 2026లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఈషా సరికొత్త చరిత్ర సృష్టించింది.

Ads

ఫైనల్లో ఏకంగా 43/50 స్కోరు సాధించి అటు సీనియర్, ఇటు జూనియర్ కేటగిరీల్లో ఏకకాలంలో కొత్త ప్రపంచ రికార్డు (World Record) నెలకొల్పింది. ఈ అద్భుత ప్రదర్శనతో ఈ ఏడాది డిసెంబర్‌లో ఇటలీ (రోమ్)లో జరగబోయే వరల్డ్ కప్ ఫైనల్స్‌కు ఆమె నేరుగా అర్హత సాధించింది. ప్రస్తుత షూటింగ్ వరల్డ్ కప్ సీజన్‌లో భారత్‌కు లభించిన మొట్టమొదటి వ్యక్తిగత (Individual) స్వర్ణ పతకం ఇదే కావడం విశేషం.

మను భాకర్ కూడా వెనుతిరిగిన చోట…

తీవ్రమైన పోటీ నెలకొన్న ఈ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ 12వ స్థానంలో నిలిచి ఫైనల్ చేరలేకపోయింది. సీనియర్ షూటర్ రాహి సర్నోబత్ కూడా 14వ స్థానంతో వెనుదిరిగింది. పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ యాంగ్ జి-ఇన్ (దక్షిణ కొరియా) క్వాలిఫికేషన్‌లో టాప్‌లో నిలిచినా, ఫైనల్ ఒత్తిడిలో 5వ స్థానానికే పరిమితమైంది. కానీ, క్వాలిఫికేషన్‌లో 5వ స్థానంతో ఫైనల్ చేరిన ఈషా సింగ్.. ప్రధాన పోరులో మాత్రం అసాధారణమైన సంయమనం, నైపుణ్యం ప్రదర్శించి, జర్మనీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ డొరీన్ వెన్నెకాంప్‌ను వెనక్కి నెట్టి మరీ పసిడి పతకాన్ని ముద్దాడింది.

ఈషా సింగ్

హైదరాబాదీ నేపథ్యం.. ఇంట్లోనే ప్రాక్టీస్ రేంజ్!

ఈషా సింగ్ ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శం… హైదరాబాద్‌లో సచిన్ సింగ్, శ్రీలత ఈషా పేరెంట్స్… ఆమె తండ్రి మోటార్ ర్యాలీ డ్రైవర్… క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో చిన్నతనంలో ఈషా గో-కార్టింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, స్కేటింగ్ వంటి ఎన్నో ఆటలు ఆడింది… కానీ ఒకసారి గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని షూటింగ్ రేంజ్‌ను సందర్శించాక, ఆమెకు ఎయిర్ పిస్టల్ షూటింగ్ మీద అమితమైన ఆసక్తి కలిగింది…

ఆమె ఆసక్తిని గుర్తించిన తండ్రి సచిన్ సింగ్, కుమార్తె ప్రాక్టీస్ కోసం ఏకంగా ఇంట్లోనే పేపర్ ప్రాక్టీస్ రేంజ్‌ను ఏర్పాటు చేశాడు… ఆ తర్వాత ఒలింపిక్ మెడలిస్ట్ గగన్ నారంగ్‌కు చెందిన ‘గన్ ఫర్ గ్లోరీ’ అకాడమీ (పుణె)లో చేరి ఈషా తన నైపుణ్యానికి మరింత పదును పెట్టుకుంది…

13 ఏళ్లకే సంచలనం… అర్జున అవార్డు వరకు!

కేవలం 21 ఏళ్ల ప్రాయంలోనే ఈషా సింగ్ సాధించిన విజయాల జాబితా చాలా పెద్దది..

  • చిన్న వయసులోనే జాతీయ ఛాంపియన్ (2018)…: కేవలం 13 ఏళ్ల వయసులో, తిరువనంతపురంలో జరిగిన సీనియర్ నేషనల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో అప్పటికే స్టార్ షూటర్లయిన మను భాకర్, హీనా సిద్ధూలను ఓడించి అత్యంత పిన్న వయస్కురాలైన జాతీయ ఛాంపియన్‌గా రికార్డు సృష్టించింది…

  • ఆసియా గేమ్స్ అదరహో (2022)..: హ్యాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో ఒకేసారి 4 పతకాలు (25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్, వ్యక్తిగత విభాగంలో సిల్వర్‌తో సహా) గెలిచి దేశం దృష్టిని ఆకర్షించింది…

  • వరల్డ్ జూనియర్ ఛాంపియన్ (2022)..: కైరోలో జరిగిన ISSF వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 25 మీటర్ల జూనియర్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది…

  • ఒలింపియన్ హోదా…: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది…

  • అర్జున అవార్డు గ్రహీత…: క్రీడల్లో ఆమె చేసిన విశేష కృషికి గాను భారత ప్రభుత్వం ఆమెను ప్రతిష్టాత్మక ‘అర్జున అవార్డు’తో సత్కరించింది…

క్రికెట్ ఫోకస్ లైట్ల వెలుతురులో మిగతా క్రీడలు మరుగున పడిపోతున్న తరుణంలో… నిశ్శబ్దంగా దేశ సరిహద్దులు దాటి, ప్రపంచ రికార్డుల వేట సాగిస్తున్న ఈషా సింగ్ లాంటి అథ్లెట్ల కథనాలు నేటి తరానికి ఎంతో అవసరం. కేవలం పట్టుదల, తండ్రి ప్రోత్సాహం, గురి తప్పని సాధన ఉంటే ప్రపంచాన్నే జయించవచ్చని నిరూపించిన ఈ హైదరాబాదీ తేజం ‘ముచ్చట’గా మనందరికీ గర్వకారణం!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తుపాకీ పడితే ‘రికార్డే’… భేష్, హైదరాబాదీ సంచలనం ఈషా సింగ్..!
  • అసలు వంశీ సినిమాలో మోహన్‌బాబు ఎలా ఫిట్టయ్యాడనేదే ప్రశ్న..!
  • True Pilot … ఆకాశం నుంచి కూలిపోతున్నప్పుడు కూడా… అదే నిబ్బరం…
  • బహుముఖ ప్రజ్ఞ… తేజస్వినీ మనోజ్ఞ…! వావ్, మన తెలుగు తేజం..!!
  • ఆక్సిజన్ తరిగి… శ్వాస కష్టమై… వెనక్కి దిగలేక… మంచుకు బలి…
  • అద్భుతం మొదట గుర్తించబడదు..! తర్వాత ఎవరూ గుర్తించనక్కర్లేదు…!
  • ఇది సరసజ్ఞుల కోసం మాత్రమే… రసహీనులు దూరముండగలరు…
  • మీడియా సోర్సులు- లీకులు… రహస్యాలేమీ దాగవు, ఆగవు…
  • మీకు తెలుసా..? షిర్డి సాయి ముస్లిం కాదట- పక్కా బ్రాహ్మణుడట..!!
  • పట్టాల్ని కోసేయండి, ఆఫీసుల్ని కాలబెట్టండి…! ఇదేనా BRS రాజకీయం..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions