నిజానికి ఈటలకు ముందే తెలుసు… తనను టార్గెట్ చేసి ఎక్కడో ఇరికించి, బదనాం చేసి, టీఆర్ఎస్ హైకమాండ్ తన వెంటపడుతుందని ఊహించాడు… ఇన్నేళ్లుగా టీఆర్ఎస్ కీలక స్థానంలో ఉన్నాడు, తనకు తెలియకపోవడం ఏముంది..? కేసీయార్ గనుక ఒకసారి టార్గెట్ చేస్తే, ఎలాంటి ప్రచారాలు తనను కమ్మేస్తాయో తెలియనివాడేమీ కాదు… అందుకే ఈమధ్య తన నియోజకవర్గానికి వెళ్లినప్పుడు కూడా ‘ఇక మంత్రిగా రాలేనేమో మళ్లీ’ అని సన్నిహితులతో షేర్ చేసుకున్నాడట… ఏ కోణంలో తనను టార్గెట్ చేస్తారో కూడా అంచనా వేసుకునే ఉంటాడు… అందుకే ప్రిపేర్డ్‌గానే ఉన్నట్టున్నాడు… ప్రెస్ మీట్లో కూడా తొణక్కుండా బెణక్కుండా తను ఏం చెప్పాలనుకున్నాడో అదే చెప్పాడు, మెచ్యూర్డ్‌గా…!
తను సీనియర్ రాజకీయవేత్త, పైగా టీఆర్ఎస్ వ్యవహారధోరణి ఎలా ఉంటుందో తెలుసు కదా… తన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలో కూడా ముందే ఆలోచించుకునే ఉన్నట్టున్నాడు… అందుకే ఎక్కడా రాజీనామా ప్రసక్తి లేదు, పార్టీ మీద నిందల్లేవ్, అధినేత మీద విమర్శల్లేవ్… జస్ట్, ఇది ఓ మీడియా కుట్ర అన్నట్టుగా మాట్లాడాడు… తనకు తెలియదా, కేసీయార్ అనుకూల మీడియా మొత్తం హఠాత్తుగా మీదపడిందంటే దానికి కారణం ఏమిటో..? కాకపోతే ఇప్పుడు పార్టీ మీద, ప్రభుత్వం మీద ఎదురుదాడికి పోలేదు… తనను ఏ ప్రాతిపదికన బర్తరఫ్ చేస్తాడో చేయనివ్వండి, పార్టీ నుంచి ఎందుకు బహిష్కరిస్తారో చూద్దాం అన్నట్టుగా ఆ వైపు అస్సలు పోలేదు…
Ads
కాకపోతే స్కూటర్ మీద వచ్చినోళ్లు వేల కోట్లకు ఎదిగారు, అందరి జాతకాలూ తెలుసు వంటి వ్యాఖ్యల జోలికి పోకుండా ఉండాల్సింది… దీనివల్ల సబ్జెక్టు డైవర్ట్ అయ్యేందుకు చాన్స్ ఇచ్చాడు తనే… (TRS ప్రజాప్రతినిధుల బాగోతాలు జనానికి తెలియదా ఏం..? నియ్యత్ ఉన్నోల్లు ఎవరు..? కానీ ఇప్పుడు తనకు దెబ్బ తగిలితే తప్ప గుర్తుకు రాలేదా..?) అవి తప్ప మిగతా ప్రెస్ మీట్ అంతా మెచ్యూర్డ్‌గానే సాగింది… నిజానికి ఈటల భూబాగోతం అనేది పెద్దగా ప్రజల్లో చర్చకు రావడం లేదు… ‘‘ఎవరు తక్కువ..? కేవలం ఈటల మాత్రమే ఎందుకు..?’’ అనే చర్చే సాగుతోంది… ఈటలకూ, కేసీయార్‌కూ ఎక్కడ బెడిసింది అనేదే చర్చల్లోకి వస్తోంది… పింక్ చానెళ్లన్నీ ఈటలపై చర్చను ఇంకా కొనసాగిస్తున్నా… నమస్తే తెలంగాణ చివరకు మరీ నాసిరకం బాష్యాలకు, వార్త ప్రచురణలకూ దిగినా తను పార్టీ, ప్రభుత్వం జోలికి వెళ్లడం లేదు… దానికి ఇంకా టైముంది అనేదే ఈటల భావన…
తను మధ్యమధ్యలో నీళ్లు తాగాడు కాబట్టి తప్పు ఒప్పేసుకున్నట్టే…. మొహం వివర్ణమైంది కాబట్టి తప్పు ఒప్పేసుకున్నట్టే… కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేదు కాబట్టి తప్పు ఒప్పేసుకున్నట్టే… రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు అంటోంది నమస్తే తెలంగాణ…. అంటే కేసీయార్ అంటున్నట్టే లెక్క… ఓహో, ఈ కారణాలతో ఈటల రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినట్టా..?!! సరే, ఆయన పత్రిక, ఆయనిష్టం… కానీ ఈటల మాత్రమే దొంగ, అందుకే దొర తనపై వేటు వేస్తున్నాడు అనే భావన మాత్రం ప్రజల్లోకి పోలేదు… జనమంతా మా ఎమ్మెల్యే మాటేమిటి..? మా మంత్రి మాటేమిటి..? అనే చర్చల్లోనే ఉన్నారు… మీడియా హఠాత్ ప్రచారాలు కేవలం కేసీయార్ ప్లాన్ మేరకు స్టార్టయినవే అనేదే జనంలోకి వెళ్లింది…
ఒక పీఆర్వో విజయకుమార్‌ను ఉరితీసినంత ఈజీ కాదు ఒక మంత్రి తల తీసేయడం… అందుకనే ఏదో బేస్ ప్రిపేర్ చేస్తున్నారు, సరే, రాజకీయాల్లో ఇవన్నీ సహజమే… కానీ వాట్ నెక్స్ట్..? ఒక నరేంద్ర, ఒక విజయశాంతి, ఒక స్వామిగౌడ్, ఒక రఘునందన్, ఒక దాసోజు తదితరుల్లాగే ఒక ఈటల అనుకోవాలా..? కేసీయార్‌కు కోపమొస్తే…. తరువాత ఏమవుతుంది అని ఆలోచించడు… కసుక్కున తల నరికేస్తాడు… ఎవరితో ఎందుకు ఆయనకు పడలేదు అనేది ఎప్పుడూ ఓ మిస్టరీయే…!! ఇప్పుడు తను ఉన్న బలమైన పొజిషన్లో ఈటలను ఉరితీయడం ఆయనకు పెద్ద సమస్యేమీ కాదు, సమస్య అనుకున్నా సరే వెనుకాడడు… ఐనా సరే, ఇమ్మీడియెట్‌గా బర్తరఫ్ చేయకుండా… నాలుగు రోజులాగి మంత్రివర్గ మార్పులు తెరమీదకు తెచ్చి, ఇద్దరికో ముగ్గురికో ఎసరు పెట్టి, అందులోనే ఈటల పేరు చేర్చి, ఒ:కరినో ఇద్దరినో కేబినెట్లోకి తీసుకుంటాడేమో… ఈలోపు విజిలెన్స్, సీఎస్ నివేదికలు ప్రిపేర్ అవుతాయేమో… అంతే… అదే అనుకోవాలి… కానీ ఈటల తదుపరి కార్యాచరణ ఏమిటి..? ఎవరు తనతో కలిసొస్తారు..? కేసీయార్ మీద యుద్ధం ప్రకటిస్తాడా..? అంత పెద్ద బీజేపీకే తనను ఎలా కార్నర్ చేయాలో అర్థం కావడం లేదు… ఈటల ఒక్కడితో ఏమవుతుంది..? ఇదీ ప్రశ్న… చూడాలిక…!!
ఇదీ తాజా అప్ డేట్… వైద్యారోగ్య మంత్రిత్వ శాఖను ఈటల నుంచి పీకేశారు… సేమ్, మనం చెప్పుకున్నట్టే… ఈకలు, తోకలు కత్తిరించేసి, ఉంటే ఉండు, పోతేపో అనేయడం… పోర్ట్ ఫోలియో లేని మంత్రి అన్నమాట… సేమ్, డీఎస్లాగే… పార్టీలో ఉన్నట్టు కాదు, లేనట్టు కాదు… మంత్రివర్గంలో ఉన్నట్టు కాదు, లేనట్టు కాదు… అవమానించడం, పొగపెట్టడం అంటారు వీటినే… ఇప్పుడు ఆ శాఖను జడ్చర్ల లక్ష్మారెడ్డికి ఇస్తారేమో…!!
Share this Article