.
ఆ నర్తకి నిండు గర్భిణి- ఎప్పుడు నొప్పులు మొదలవుతాయో తెలియదు- అడుగు తీసి అడుగేస్తే కడుపులో బిడ్డ బయటికి రావడానికి త్వరపడుతుంది… ఐనా నాట్యం చేస్తోంది ఆ ప్రధాన నర్తకి… కాసేపటికే ఆ నాట్య వేదిక వెనుకే ఆమెకు అక్కడే ప్రసవం… పచ్చి బాలింత – ప్రేక్షకుల గోల – రావాలి, ఆమె నాట్యం చూడాలంటూ కేకలు- ఆమె కడుపుకి గట్టిగా బట్టలు బిగించుకుని వచ్చింది, అభివాదం చేసింది, నాట్యమాడింది!
ఇది చెప్పుకున్నంత సులభం కాదు, ప్రేక్షక జనరంజకంగా, మెచ్చేలా వెండితెర మీద ప్రజెంట్ చేయడం! అసలు ఇలాంటి కథను ఎంచుకోవడమే ఓ సాహసం, తమ క్రియేటివిటీకి, తమ సినిమా ప్రజెంటేషన్ నైపుణ్యానికి పరీక్ష పెట్టుకోవడం… దానికి ఓ టీమ్ సిద్ధమైపోయింది… ఆ సినిమా పేరు ఈఠా… మొన్న టీజర్ రిలీజ్ చేశారు. టీజర్‌లో ఆ సంఘటనను ఉద్వేగభరితంగా భలే ప్రజెంట్ చేసినట్టుగా కనిపిస్తోంది.
Ads
“పాన్ మే పాన్ చఖ్నా హో తో మీఠా… ఔర్ తూఫాన్ కో నాచ్తే దేఖ్నా హో తో… ఈఠా!” ఇదీ రాబోయే ఆ ఈఠా సినిమాలోని ఓ డైలాగ్… అంటే అసలైన పాన్ రుచి చూడాలంటే మీఠా పాన్- తుపాన్ నాట్యం చూడాలంటే ఈఠా… ఒక్క డైలాగ్‌తోనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
నిజానికి ఇది మహారాష్ట్ర లావణి నాట్యానికి, తమాషా కళకు ప్రతీకగా నిలిచిన విఠాబాయి నారాయణగాంకర్ బయోపిక్… ఆమె జీవితంలో మనం పైన చెప్పుకున్న సంఘటన కూడా ఉంది… అందుకే ఆ టీజర్ ఆకర్షిస్తోంది… ఇంకొన్ని విశేషాలూ ఉన్నాయి…
‘స్త్రీ 2’ తర్వాత శ్రద్ధా.. ‘ఛావా’ తర్వాత అదే టీమ్..! ‘ఈఠా’ టీజర్‌పై అందుకే ఇంత చర్చ… ‘స్త్రీ 2’లో కమర్షియల్ స్టార్‌గా మెప్పించిన శ్రద్ధా, ఇప్పుడు జానపద నాట్య కళాకారిణి విఠాబాయి పాత్రలో పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది. గ్లామర్‌కు దూరంగా, పాత్రలో ఒదిగిపోయిన ఆమె మేకోవర్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది.
చారిత్రక నేపథ్యాన్ని సహజంగా చూపించి ‘ఛావా’తో విజయం సాధించిన లక్ష్మణ్ ఉటేకర్, నిర్మాత దినేష్ విజన్ మరోసారి ఈ బయోపిక్‌తో వస్తున్నారు. గ్రామీణ మహారాష్ట్ర, లావణి సంస్కృతి, స్టేజ్ కళాకారుల జీవితాన్ని టీజర్‌లో చూపించిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
మ్యూజికల్ బయోపిక్‌కు తగ్గట్టుగానే అజయ్– అతుల్ సంగీతం టీజర్‌లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లావణి సంప్రదాయాన్ని ఆధునిక నేపథ్య సంగీతంతో మేళవించినట్లు అనిపిస్తోంది. “అసలైన పాన్ రుచికి మీఠా… తుఫానే నాట్యం చేస్తే – ఈఠా!” టీజర్‌లో అత్యధికంగా వైరల్ అవుతున్న డైలాగ్ ఇదే. దీంతోనే సినిమా టోన్ ఏమిటో, కథానాయిక వ్యక్తిత్వం, జీవితం ఏమిటో చెప్పేశాడు దర్శకుడు.
రణదీప్ హుడా, మహమ్మద్ జీషాన్ అయ్యూబ్ వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రలు పోషించడం కూడా సినిమాకు అదనపు బలంగా కనిపిస్తోంది. జనం పిచ్చిపిచ్చిగా ప్రేమించిన ఓ నాట్యగత్తె జీవితంలోని ప్రతిభ, సంఘర్షణను దర్శకుడు ఎంత సినిమాటిక్ క్రియేటివిటీతో ప్రజెంట్ చేస్తాడో చూడాల్సిందే ఇక…
.
Share this Article