ఓసారి బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఒక చిన్న పల్లెటూరికి షూటింగ్ కు వెళ్ళారు, షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు…
అక్కడున్న పూజారి పూజ చేసుకుంటూ ఉన్నాడు.., తమను చూడగానే ఆ పూజారి గుర్తుపట్టి నవ్వుతూ పలకరిస్తాడని అనుకున్నారిద్దరూ… కానీ ఆయన వీళ్ళని కాజువల్‌గా ఓ చూపు చూసి, తన పూజలో తాను నిమగ్నమయ్యాడు…
పోనీ పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడేమో అనుకుంటే అదీలేదు, వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది గానీ ఆయన మాత్రం వీళ్ళ దగ్గరికి రాలేదు, ఇద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకొని పూజారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయమని అడిగారు, ఎక్కడో అహం మాడిపోతున్న వాసన వస్తూనే ఉంది…
Ads
ఇప్పుడు సమయం అయిపోయింది, రేపు ఉదయం ఏడు గంటలకు రండి అని చెప్పి వెళ్ళిపోయాడు… మర్నాడు ఉదయం ఏడు గంటలకల్లా గుడి దగ్గర నిలబడి ఉన్నారు, పూజారి రావడం, అభిషేకం చేయడం, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం అన్నీ అయిపోయాయి…
స్వామి దక్షిణ తీసుకోండి అని చెరి వేయి రూపాయలు బయటకు తీశారు, ఆయన హుండీలో వేయమని సైగ చేశాడు. యూనిట్ వాళ్లు టిఫిన్ తెచ్చి ఇచ్చారు, ఇద్దరూ ఆ గుడి ఆవరణలోనే కూర్చుని తినడానికి వెళ్తూ పూజారిని ఆహ్వానించారు, నేను తినేశాను మీరు తినండి అని సున్నితంగా తిరస్కరించాడు, కాఫీ అయినా తాగండి అన్నారు, ఆ పూజారి మంచినీళ్ళు కూడా తాగను అనేశాడు,
మీరు మమ్మల్ని గుర్తించారా అని అడిగారు భరణి గారు కాస్త అహంతో… ఆ పూజారి పేర్లతో సహా చెప్పాడు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఆశ్చర్యంతో “స్వామి దక్షిణ ఇస్తే తీసుకోలేదు, హుండీలో వేయమన్నారు, టిఫిన్ ఇస్తే తీసుకోలేదు, కనీసం కాఫీ కూడా తాగలేదు, ఎందుకు, కారణం తెలుసుకోవచ్చా” అని అడిగారు
అప్పుడాయన “సార్ నాకు ఓ ఎకరం పొలం ఉంది, ఒక ఆవు ఉంది, నా శివుడు ఉన్నాడు, ఇంకేం కావాలి ఈ జీవితానికి… భక్తులు ఎవరైనా నాకొకటే…” అని వెళ్ళిపోయాడు… ఆ సందర్భాన్ని అప్పుడే భరణి గారు “మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడింది” అని వర్ణించారు…
ఎవరి దగ్గరా ఏదీ ఆశించకపోతే జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించింది ఇద్దరికీ, ఆ క్షణం ఆయన్ని మించిన శ్రీమంతుడు ప్రపంచంలో ఇంకెవరూ లేరు అన్నంత గొప్పగా కనిపించాడు ఆ పూజారి వాళ్ళిద్దరి కళ్ళకి, సంతృప్తిగా బ్రతికే ప్రతి మనిషీ మహారాజే గురూజీ…
ఆశించడం ఆపేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది, ఎవరి నుంచీ ఏదీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అప్పుడే లైఫ్ లో తృప్తి దొరుకుతుంది, ప్రశాంతత నీలో కొలువుంటుంది… ఈ సంఘటనను వెంటనే భరణి గారు ఓ పాటలా ఇలా రాశాడు…
“మాసెడ్డ మంచోడు దేవుడు
మాసెడ్డ మంచోడు దేవుడు…
నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు
మాసెడ్డ మంచోడు దేవుడు…
అస్సలడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు
మాసెడ్డ మంచోడు దేవుడు…”
Share this Article