.
‘మేరా నామ్ జోకర్’ తీసి నిండా మునిగిన రాజ్‌కపూర్‌ను కుబేరుణ్ణి చేసిన సినిమా బాబీ…. నిజానికి ‘బాబీ’ని కనీస ఖర్చుతో తీద్దామనుకున్నాడు రాజ్‌కపూర్… హీరో తన కొడుకే రిషికపూర్… హీరోయిన్ కొత్తమ్మాయి డింపుల్ కపాడియా…
లో బడ్జెట్ కదా, అందరినీ ఎలాగోలా తక్కువ ఖర్చుకు అంగీకారాలు కుదుర్చుకుంటున్నాడు… ఆ రోజుల్లో ప్రాణ్ సినిమాకు రెండు, మూడు లక్షలు తీసుకుంటున్నాడు…రాజ్‌కపూర్‌తో అప్పటికి నలభై ఏళ్లుగా ప్రాణస్నేహం…
Ads
రాజ్‌కపూర్ అడిగాడని… ‘ఒకే ఒక్క రూపాయి తీసుకొని చేస్తా… సినిమా ఆడితే ఇవ్వు… ఆడకపోతే మర్చిపో’ అన్నాడు ప్రాణ్… అన్నమాట ప్రకారం ఒక్క రూపాయికే చేశాడు… సినిమా రిలీజ్ అయ్యింది… ఇరవై పాతిక లక్షలు పెట్టి తీస్తే దేశంలో, బయట కలిపి 30 కోట్లు వచ్చాయి… నేటి లెక్కల ప్రకారం 1200 కోట్లు!
రాజ్‌కపూర్ సదుద్దేశంతోనే ఓ లక్ష రూపాయల చెక్ పంపాడు… ఇవ్వకపోయినా బాగుణ్ను… ఆ రూపాయి మాత్రమే ఇస్తే బాగుణ్ను… మార్కెట్ రేటుకన్నా తక్కువ ఇచ్చి అవమానించాడు అనుకుని ఇక ప్రాణ్ ఆ చెక్ వెనక్కు పంపాడు… మళ్లీ జీవితంలో రాజ్‌కపూర్‌ని కలవలేదు… జారిపోయాడు…
‘షోలే’… మొదటి పది రోజులూ ఫ్లాప్‌టాక్… రచయితలు సలీమ్–జావేద్ ఆందోళన చెందారు… ఫ్లాప్ కావడానికి స్క్రిప్ట్ కారణమనే చెడ్డపేరు ఎక్కడ వస్తుందోనని బెంబేలెత్తారు… మాటల్లో మాటగా దర్శకుడు రమేష్ సిప్పీతో ‘గబ్బర్‌సింగ్ వేషం వేసిన అంజాద్‌ఖాన్ వల్లే సినిమా పోయింది… అతడు ఆనలేదు’ అన్నారు…
అప్పటికే తన తొలి సినిమాకు ఇలాంటి టాక్ రావడం ఏమిటా అని చాలా వర్రీగా ఉన్న అంజాద్‌ఖాన్ బ్లేమ్ గేమ్‌లో తనను బలి చేయబోతున్నారని తెలిసి హతాశుడయ్యాడు… తీవ్రంగా కలత చెందాడు… కాని సినిమా కోలుకుంది… ఎలా? అలాంటి కలెక్షన్లు ఇప్పటికీ లేవు… అతి గొప్ప విలన్‌గా అంజాద్‌ఖాన్ ఎన్నో సినిమాలు చేశారు… కాని ఒకనాటి మిత్రులైన సలీమ్–జావేద్ రాసిన ఏ స్క్రిప్ట్‌లోనూ మళ్లీ యాక్ట్ చేయలేదు… చేజారిపోయాడు…
దాసరి నారాయణరావు తొలి రోజుల్లో నటుడు నాగభూషణాన్ని ఎంతో నమ్ముకున్నాడు… అభిమానించాడు… నాగభూషణం దాసరికి దర్శకుణ్ణి చేస్తానని చెప్పి చాలా పని చేయించుకున్నాడు… చివరి నిమిషంలో వేరొకరిని పెట్టుకున్నాడు… దాసరి ఆ తర్వాత పెద్ద దర్శకుడయ్యి 150 సినిమాలు చేశాడు… వందల పాత్రలు రాశాడు… కానీ దాసరి కలం నుంచి ఒక్క పాత్ర కూడా నాగభూషణం కోసం సృజించబడలేదు… దాసరి సినిమాల్లో నాగభూషణం ఎప్పుడూ లేడు…
రామానాయుడు అవకాశం ఇస్తే ఎంతో కష్టం మీద ‘ప్రేమఖైదీ’ సినిమాకు దర్శకత్వం వహించాడు ఇ.వి.వి. సత్యనారాయణ… అప్పటికి అతని మొదటి సినిమా ఫ్లాప్… ఈ సినిమా కూడా పోతే భవిష్యత్తు లేదు… ఫస్ట్ కాపీ చూసిన పరుచూరి బ్రదర్స్ ఏ మూడ్‌లో ఉన్నారో ‘మా స్క్రిప్ట్‌ను చెడగొట్టినట్టున్నాడే’ అనే అర్థంలో రామానాయుడు దగ్గర హడావిడి చేశారు…
వారు స్టార్‌రైటర్స్. వారి మాట మీద రామానాయుడుకు గురి. ఇ.వి.వి హడలిపోయాడు… స్క్రిప్ట్‌ను తన బుర్రతో ఆలోచించి మెరుగుపెట్టి తీస్తే ఇలా అంటారేమిటి అని సిగరెట్లు తెగ కాల్చాడు… సినిమాను మూలపడేస్తే ఇంతే సంగతులే అని కుంగిపోయాడు… కానీ సినిమా రిలీజయ్యి సూపర్ హిట్ అయ్యింది… ఆ తర్వాత 51 సినిమాలు తీశాడు ఇ.వి.వి… ఒక్కదానికీ గురు సమానులైన పరుచూరి సోదరుల స్క్రిప్ట్ వాడాలనుకోలేదు…
.
ఓ మిత్రుడు షేర్ చేసిన ఈ పోస్టు ఎవరు రాశారో గానీ అక్షరసత్యం… ఐనవాళ్లు జారిపోవడానికి చిన్న చిన్న ఇగోలు చాలు… ఎక్కడో తేడా వస్తుంది, అప్పటిదాకా అత్యంత ఆత్మీయంగా ఉన్నవాళ్ల మధ్య మాటలు కరువవుతాయి… ఆ దూరం అలాగే కొనసాగుతుంది… సినిమా ఇండస్ట్రీలో విజయాలు సొంతం చేసుకోవడానికి వందల మంది రెడీ… వైఫల్యంలో ఒకడి మీద ఒకడు తోసేసుకుంటాడు…
కృష్ణ, బాలు నడుమ ఏమైందో ఏమో తెలియదు… నిజానికి కృష్ణ స్నేహశీలి, తను కూడా బాలును గడప తొక్కనివ్వలేదంటే… బాలు అహమే ఆ బంధాన్ని దెబ్బతీసి ఉంటుంది… కానీ అదే బాటు (కారణాలు ఏవైనా సరే) కృష్ణ దగ్గరకు వెళ్లి, ఇలా జరిగి ఉండకూడదు అని చెబుతుండగానే…. వదిలెయ్, కలిసి పనిచేద్దాం అన్నాడు కృష్ణ… పైన చెప్పిన ఉదాహరణల్లో ఈ రాజీ కుదరలేదు… సో, ఐనవాళ్లతోనే బహుపరాక్..!!
Share this Article