Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘ఏక్ దిన్’… సాయిపల్లవి ఉద్వేగ ప్రదర్శన అపూర్వం ! ఓ వసంత కోకిల !!

August 7, 2026 by M S R

.

Prasen Bellamkonda …. వసంత కోకిల తర్వాత…. 
వసంత కోకిల శ్రీదేవి రైల్వే ప్లాట్ ఫాం మీద ‘ ఎవరో పిచ్చోడు ‘ అని కమల్ హాసన్ ను చీదరించుకుని వెళ్లిపోయిన తరవాత ఎక్కడో కలిసి గుర్తు పట్టి ‘ నేను నీతోనే కదా కొద్ది రోజులు గడిపింది ‘ అంటే ఎలా ఉంటుంది అనే సన్నివేశాన్ని క్లయిమాక్స్ గా రాసుకుని మొదలు పెట్టిన సినిమా ఏక్ దిన్.

కమల్ , శ్రీదేవి కలిసున్న కాలాన్ని ఇక్కడ ఒక రోజుగా మార్చారు. అయితే శ్రీదేవి మరిచిపోతుందని
కమల్ కు తెలియదు. ఏక్ దిన్ హీరోకు మాత్రం ఆ విషయం తెలుసు. వసంత కోకిల అనే మూండ్రాం పిరై ఇచ్చే సద్మా విషాదాంతం. ఏక్ దిన్ సుఖాంతం. అదీ కథ. ఈ కథ గొప్పతనం కథది కాదు. కథ లోపలి విషాద లోతులది.

Ads

మనం జీవితంలో ఎన్నో అందమైన క్షణాలను అనుభవిస్తాం. కానీ అవి జ్ఞాపకాలుగా మిగలకపోతే వాటి విలువ ఏమిటి? ‘ఏక్ దిన్’ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ చెప్పదు. అదే సినిమా అందం. పైపైన చూస్తే ఏక్ దిన్ రొమాంటిక్ డ్రామా. కానీ లోతులకు వెళ్తే ఇది జ్ఞాపకం, ఉనికి , నైతికత గురించి ఘర్షణ పడే ఘటనల కూర్పు.

ప్రేమను ఇద్దరు మనుషుల మధ్య జరిగే సంఘటనగా చూపిస్తాయి కొన్ని సినిమాలు. కొన్నిసినిమాలు ప్రేమను కాలంతో పోటీ పడే అనుభూతిగా ఆవిష్కరిస్తాయి. కానీ ‘ఏక్ దిన్’ మాత్రం ఒక ఆసక్తికరమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. జ్ఞాపకాల్లో నిలవని ప్రేమ కూడా ప్రేమేనా? అని. ఈ ప్రశ్న చుట్టూనే దర్శకుడు సునీల్ పాండే సినిమాను అల్లుకున్నాడు. ఇది థాయ్ చిత్రం One Day కి అధికారిక హిందీ రూపాంతరం.

జునైద్ ఖాన్ పోషించిన దినేష్ అలియాస్ డినో పాత్ర ఒక అంతర్ముఖి అనుకుంటాం కానీ అతను నిజానికి అదృశ్య వ్యక్తి. ఆఫీసులో ఉంటాడు. అందరికీ తెలుసు. కానీ ఎవరూ అతన్ని గమనించరు, పట్టించుకోరు. మన చుట్టూరా ఇలాంటి మనుషులు ఎంతోమంది.

వాళ్లు తప్పులు చేయరు. వాళ్లు గొప్పవాళ్లూ కాదు. కేవలం కనిపించరు. అంతే అలాంటి డినో తనతో పనిచేసే మీరాని మూగగా ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమను చెప్పే ధైర్యం ఉండదు. ఒక ఆఫీస్ ట్రిప్‌లో జరిగిన ప్రమాదం తర్వాత మీరాకు Transient Global Amnesia (TGA) అనే అరుదైన జ్ఞాపకలోపవ్యాధి వస్తుంది. ఇదో గమ్మత్తయిన జబ్బు. సినిమా జబ్బులన్నీ కథను మెలికలు తిప్పడానికి పనికొచ్చేవి మాత్రమే కనుక పెద్దగా లాజిక్ గురించి ఆలోచించకూడదు.

ఈ జబ్బు వచ్చిన వాళ్లు నిన్నటి వరకూ జరిగిందంతా మరిచిపోతారు. ఆ మరుపు ఒక రోజు మాత్రమే ఉంటుంది. మరుసటి రోజు ఆ ఒక్క రోజుకు ముందున్నదంతా మళ్లీ గుర్తుకు వస్తుంది. అయితే ఆ ఒక రోజు మాత్రం గుర్తుండదు. ‘ రేపటి నీ నిజం గతం మాత్రమే మీరా, ఇవాళ కాదు ‘ అంటాడు డినో మీరాతో అందమైన భాషలో.

ఈ వ్యాధి డినోకు ఊహించని అవకాశం. ఒక రోజంతా ఆమెతో కలిసి గడిపే అదృష్టం దక్కుతుంది. కానీ
మరుసటి రోజు ఆమెకు ఆ రోజు అసలు గుర్తుండదు. డినో తనకు దొరికిన అసాధారణ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. మీరాకు నిజం తెలియని సమయంలో తన ప్రేమను అనుభవిస్తాడు. అందుకే మీరా అతనితో గడిపిన ఒక రోజు అతనికి జీవితమంత విలువైనది. ఎందుకంటే మొదటిసారి ఎవరో తనను చూసారు. ఇష్టపడ్డారు కూడా. ప్రేమ కంటే ముందు అతనికి కావలసింది గుర్తింపు.

ek din movie

ప్రేమకు జ్ఞాపకం అవసరమా? అనే తాత్విక ప్రశ్నమీదే సినిమా మొత్తం నిలబడింది . ఒక వ్యక్తి నిన్ను మరుసటి రోజు గుర్తుపట్టకపోతే, నువ్వు అతన్ని ప్రేమించిన రోజు నిజంగానే జరిగిందా? అనేది కేవలం రొమాంటిక్ ప్రశ్న కాదు. చాలా జీవితాల్లో చాలా సంబంధాలు ఇలానే ఉంటాయి. తల్లి తన పిల్లల కోసం జీవితాన్ని త్యాగం చేస్తుంది. పెద్దయ్యాక పిల్లలు ఆ జ్ఞాపకాలను వదిలించుకుంటారు. ఒక రచయిత పాఠకుడి జీవితాన్ని మార్చేస్తాడు. కానీ పాఠకుడికి కొన్నేళ్ల తర్వాత రచయిత పేరు కూడా గుర్తుండదు. అంత మాత్రాన ఆ ప్రేమలు, ఆ ప్రభావాలు అబద్ధమైపోతాయా? ఇదే ఈ సినిమా వేసే ప్రశ్న.

సాధారణంగా మనం ప్రేమను జ్ఞాపకాలతో కొలుస్తాం. ఈ సినిమా మాత్రం అంతకు మించి చెపుతుంది. ప్రేమ అంటే గుర్తుంచుకోవడం కాదు. ఒక మనిషి జీవితంలో ఒక క్షణం వెలుగుగా మారడం. ఆ వెలుగు తర్వాత గుర్తుండకపోయినా, ఆ క్షణం జరిగిన నిజం మారదు. ఇది సినిమాలో అత్యంత అందమైన భావన.
దర్శకుడు ప్రేమను పెద్ద పెద్ద సంభాషణలతో కాకుండా చిన్న చిన్న కవళికలతో చెప్పాలనుకున్నాడు.

  • జపాన్ నేపథ్యం, ప్రశాంతమైన ఛాయాగ్రహణం, మృదువైన సంగీతం సినిమాకు అందాన్నిచ్చాయి. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరో. చాలా అభావంగా ఉన్నాడు. కొంచెం కష్టం. అమీర్ కొడుకు కదా, సినిమాలకేం కొదవ ఉండకపోవచ్చు. పాత్రలోని మౌనం, సంకోచం, ప్రేమలోని ఓటమిని నెమ్మదిగా, అతిశయోక్తి లేకుండా వ్యక్తం చేయడానికి చాలా కష్టపడ్డాడు. సాయి పల్లవి ఈ సినిమా ప్రాణం. ఆమె తెరను మాయలా ఆవహించింది. ఆనందం, అయోమయం, బాధ ఈ మూడు భావాల మధ్య ఆమె కళ్లే సంభాషిస్తాయి. భావాలను కాదు కళ్ళను మాట్లాడిస్తుంది.

ఆమె నవ్వులో కూడా ఒక శూన్యం ఉంటుంది. తెల్లారితే అన్నీ మరిచిపోయే మనిషి అయోమయం ఎలా ఉంటుందో ఆమె అద్భుతంగా చూపించింది. హిందీలో ఆమెకు తొలి చిత్రం అయినప్పటికీ నటిగా కొత్త కాదు కనుక ఎక్కడా కొత్తదనపు తడబాటు కనిపించదు. ఆమె పాత్ర ఒక ప్రతీక. మీరా కేవలం జ్ఞాపకశక్తి కోల్పోయిన అమ్మాయి కాదు. జీవితంలో మనం ప్రేమించే ఎంతోమంది ఇలాగే ఉంటారు. వాళ్లకు మనం చేసిన త్యాగాలు గుర్తుండవు. మన బాధ గుర్తుండదు. వాళ్ల కోసం మనం ఏడ్చిన రాత్రులు గుర్తుండవు. అయినా మనం వాళ్లను ప్రేమిస్తూనే ఉంటాం. ఈ అర్థంలో చూస్తే మీరా ఒక వ్యక్తి కాదు. మనం ప్రేమించే ప్రపంచం.

గుండె ఆగిపోయినప్పుడు కాక తనను గుర్తుపట్టే చివరి మనిషి కూడా మరిచిపోయినప్పుడు మనిషి నిజంగా మరణిస్తాడు. అయితే ఈ సినిమా కథ ఆ మరణం అంచుకు మాత్రమే వెళ్తుంది. ఆ అగాధంలోకి దూకే ధైర్యం చేయదు. అదే దీనిని ఒక మంచి చిత్రంగా నిలబెట్టింది.

మరుపు అనే విషాదాన్ని ప్రేమతో కలిపి చెప్పడానికి చేసిన నిజాయితీ ప్రయత్నం ‘ఏక్ దిన్’ . ప్రేమను గెలుపుగా కాకుండా, కొద్ది సమయంపాటు మాత్రమే మన చేతుల్లో నిలిచే కలలా చూపించడం ప్రత్యేకం. ముగింపులో ప్రేక్షకుడికి ఒక విచిత్రమైన అనుభూతి మిగులుతుంది.

జీవితంలో మనం ప్రేమించిన ప్రతి మనిషి మనల్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందా? లేక మనం ప్రేమించిన ఆ ఒక్క రోజు చాలు అనిపించే సందర్భాలూ ఉంటాయా? ఈ ప్రశ్నే ది ఎండ్ ను దాటి మనతో నడిచొస్తుంది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఏక్ దిన్ కూడా నడవలేదు. నాకేమో నచ్చేసింది. ఏంచేద్దాం. గట్లుంటది….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘ఏక్ దిన్’… సాయిపల్లవి ఉద్వేగ ప్రదర్శన అపూర్వం ! ఓ వసంత కోకిల !!
  • శ్రీశైలం పవర్ జనరేషన్‌పై బీఆర్ఎస్ క్యాంపు క్షుద్ర వాదన !!
  • Algorithmocracy – అల్గారిథం రాజ్యం ! రిథమ్ తప్పిన బానిస మనిషి !
  • అమ్మ ప్రేమ ! మనుషుల్లోలాగే ఉద్వేగాలు – దుఃఖం – వ్యక్తీకరణ !!
  • శకునాలు చెప్పిన తెహల్కా బల్లి కుడితి తొట్టెలో పడింది !!
  • ఇక గుడ్డివాళ్లే ఉండరు ! ఎలన్‌మస్క్ కంపెనీ అద్భుత ఆవిష్కరణ !!
  • నాకెంత? నీకెంత? – కేటీఆర్ చెప్పే లొట్టపీసు కేసులో చాలా పెద్ద కథ !!
  • ఐనవాళ్లు ఉన్నా… అనాథ ప్రేతాలే !! ముసలితనమే ఓ ‘ఒంటరిశాపం’…!!
  • విస్మయ ! సూపర్ స్టార్ కూతురు ! హీరోయిన్‌గా మూవీల్లోకి ఎంట్రీ !!
  • కొరియన్ కనకరాజూ… కథ మరీ కామెడీ అయిపోయిందోయ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions