ఎన్నికల కోడ్ అనేది తెలంగాణ ఎన్నికల్లో ఓ ఫార్స్‌లా తయారైంది… ఐటీ శాఖ డీజీ సంజయ్ బహదూర్ ప్రెస్‌మీట్ పెట్టి చెప్పాడు… 59.93 కోట్ల నగదును పోలీసులు పట్టుకుంటే అందులో లెక్కల్లేని నగదు కేవలం 1.7 కోట్లు అట… ఇప్పటికే యజమానులకు 10.99 కోట్లు అప్పగించారట… మరోవైపు ఇంత నగదు పట్టుకున్నాం, ఇన్ని బంగారు నగలు పట్టేశాం అని గొప్పలు చెప్పుకుంటోంది అధికార యంత్రాంగం…
మరి 156 కిలోల బంగారం, 454 కిలోల వెండి మాటేమిటి అంటారా..? యజమానులు నానా బాధలు పడి, ఏడ్చి, మొత్తుకుని, ఎవరెవరినో పట్టుకుంటే ఎన్నాళ్లకో అవి విడుదలయ్యేవి… పైగా పది లక్షల పైన సీజ్ చేసిన నగదు మీద ఇంకా దర్యాప్తులు, పరిశీలనలు మొదలెట్టలేదట… నిజమే, ఎన్నికలు అనేవి ప్రజల పాలిట ఓ విపత్తు… ఆంధ్రజ్యోతిలో ఓ మంచి వార్త… ఫస్ట్ పేజీ… అసలు పెళ్లిళ్లు చేసేదెట్లా అని…
Ads
నిజమే కదా… పెళ్లిళ్లంటేనే గరిష్టంగా నగదు లావాదేవీలే ఉంటాయి… అక్టోబరు, నవంబరు నెలల్లో వేలాది పెళ్లిళ్లున్నయ్… ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పెళ్లిళ్లూ ఉన్నయ్… ఇప్పుడేమో ఎన్నికల లాక్ డౌన్… కదిలితే చాలు, నగదు సీజ్… ఒకాయన జోక్ చేశాడు… కారులో పెళ్లికి వెళ్లే నలుగురు ఆడవాళ్ల దేహాల మీద బంగారు నగల్నీ సీజ్ చేస్తారేమో, కిలో బంగారం సీజ్ అని పత్రికలు రాసేస్తాయి అని..! నిజంగానే పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది… అక్కడెక్కడో ఓ మహిళ పసుపు, కుంకుమ, గాజులు ఇస్తుంటే అడ్డుకున్నారట… పెళ్లి భోజనాలు, గిఫ్టులను కూడా పోలీసులు అడ్డుకునే ప్రమాదం ఉంది బహుపరాక్…
ఎడాపెడా బంగారాన్ని సీజ్ చేస్తుండటంతో రాష్ట్రంలో జువెల్లర్స్ వ్యాపారులు లబోదిబో మొత్తుకుంటున్నారు… ఆధారాలు చూపినా వేస్ట్ అట… మనం చదివాం కదా… ఒక వాహనంలో ఇద్దరు ఉంటే, వాళ్ల దగ్గర 50 వేలు ఉంటే, వాళ్ల పర్సుల్లోని డబ్బులు కూడా కలిపి లెక్కపెట్టి, సీజ్ చేసి పారేశారుట… సాక్షిలో వచ్చింది వార్త… ఇంతకుమించిన ఉదాహరణ ఏం కావాలి..? అంతేకాదు, 10 లక్షల మేరకు అధికారిక, బ్యాంకు లావాదేవీలు జరిగినా సరే ఐటీ నోటీసులట, దర్యాప్తు అట… అందుకే అనేది లాక్ డౌన్ ప్రకటిస్తే అయిపోయేది కదా…
ఇలా గ్రేటుగా రాయించేస్తారు… మొత్తం 230 కిలోల బంగారం అట, 119 కోట్ల నగదు, 975 కిలోల వెండి… మద్యం సరే, 17 కోట్ల డ్రగ్స్ అట… ఓహో, ఎన్నికల ప్రలోభాలకు డ్రగ్స్ కూడా సప్లయ్ చేస్తారా..? పైగా ఐటీ చెప్పే లెక్కలు వేరు, పోలీసులు రాయించే వార్తల్లో లెక్కలు వేరు… నిజానికి ఈ స్వాధీనాల్లో ఎన్నికల కోసం వెళ్లేది చాలా చాలా తక్కువ… ఏ పార్టీ కూడా ఇలా పట్టుబడదు… వాళ్లకు అన్ని మార్గాలూ తెలుసు… ఎటొచ్చీ బలయ్యేది మామూలు జనమే…
ఎన్నికల కోడ్ ఎంత ప్రహసనం అంటే… సరిగ్గా ఎన్నికల వేడిలో రైతుబంధు పేరిట వేల కోట్లు పంపిణీ చేస్తుంది అధికార పార్టీ… మరి దీన్నేమనాలి..? ఆపండి మహాప్రభో అని కాంగ్రెస్ ఖర్గే లెటర్ రాస్తే, చూశారా కాంగ్రెస్ రైతుద్రోహి, నోటికాడ బుక్కను ఎత్తగొడుతోంది అని ప్రచారం చేస్తున్నారు హరీష్ తదితరులు… అక్కడ మేడిగడ్డ కుంగిపోతే పూర్తి బాధ్యత వహించాల్సిన హరీష్ అవి మాత్రం మాట్లాడడు…
కాంగ్రెస్ ఏమంటోంది..? నోటిఫికేషన్ తరువాత పంపిణీ చేయొద్దు, నోటిఫికేషన్ లోపు చేసుకొండి అంటోంది… ఇక వాళ్లు అడ్డుపడ్డదేముంది..? రైతుబంధు అనే పథకమే పొలిటికల్ లబ్ధి కోసం… ఒక్క కౌలు రైతుకూ ఫాయిదా ఉండదు… సాగుచేయని వాళ్లకు సైతం కోట్లకుకోట్లు కట్టబెడుతున్న పథకం… నోటిఫికేషన్‌కు ముందే పంచుకొండి అని డిమాండ్ చేస్తే పాపమట, ఇవీ మన ఎన్నికల కోడ్ ప్రహసనాలు… చెబుతూ పోతే, రాస్తూ పోతే ఎన్నో… !!
Share this Article