Subramanyam Dogiparthi ఏమంటారంటే..? శివసేన సింబల్ని అభినవ కలియుగ విభీషణుడు షిండేకు కేటాయించటం ఉధ్ధవ్ ఠాక్రేకు షాక్ అని పత్రికలు వ్రాస్తున్నాయి. నాకు వెంటనే ఇందిరమ్మ రాజకీయ ప్రస్థానం గుర్తుకొచ్చింది. 1952 ఎన్నికల నుండి 1969 వరకూ కాంగ్రెస్ పార్టీ సింబల్ కాడెద్దులు . బ్యాంకుల జాతీయకరణ వంటి సోషలిస్టు నిర్ణయాలు తీసుకున్న తర్వాత , ఆనాడు కాంగ్రెస్ పార్టీలో సిండికేటుగా పిలవబడిన కామరాజు , మొరార్జీ వంటి హేమాహేమీలు ఇందిరమ్మను బయటకి నెట్టేసారు .
Ads
నిజమే… కానీ ఏకనాథ్ శిండే విభీషణుడు కాదు… లక్ష్మిపార్వతి అనే ఫ్యాక్టర్ నుంచి తెలుగుదేశాన్ని చంద్రబాబు అండ్ కో కాపాడుకున్నట్టే ఏకనాథ్ శిండే కూడా శివసేనను కాపాడాడు అని చెప్పుకోవచ్చు… స్థూలంగా చూస్తే ఇవి వెన్నుపోట్లుగా కనిపిస్తాయి… కానీ మరో కోణం నుంచి చూడాలి… ఈ పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఎప్పుడూ కుర్చీ మీద కూర్చోవాలని తాపత్రయపడలేదు… కింగ్ మేకర్‌గా ఉన్నాడు తప్ప కింగ్ కాలేదు…
తన పంథా వేరు… తన పార్టీ బేసిక్ రూట్స్ నుంచి పక్కకుపోలేదు… అదే పార్టీ బలం… కానీ తన వారసుడు ఉద్దవ్ ఠాక్రే ఏం చేశాడు..? కేవలం కుర్చీ కోసం, ప్రజలిచ్చిన తీర్పును కాలరాసి, తన పార్టీ బేసిక్ సిద్ధాంతాల్ని కాలరాచి, కాంగ్రెస్‌తో జతకట్టాడు… ఎన్సీపీతో పొత్తుకూడాడు… ఏ రెండు పార్టీలకు వ్యతిరేకంగా తాము పోరాడామో, వాళ్లతోనే కలిసి కుర్చీ పంచుకున్నామనే నెగెటివ్ ఫీలింగ్ శివసేన పార్టీ కేడర్‌లో పెరుగుతోంది…
కేవలం సంజయ్ రౌత్ అనే కోవర్టు చెప్పింది వింటూ కేడర్‌ను దూరం చేసుకున్నాడు ఉద్దవ్ ఠాక్రే… తన అధికార దాహం పార్టీ కేడర్‌కే నచ్చలేదు… శివసేన నాయకులకు ఫీల్డులో పదే పదే ఇదే ప్రశ్న ఎదురవసాగింది… డీమోరల్ అవుతున్నారు కార్యకర్తలు… ఈ స్థితిలో ధైర్యంగా పిల్లి మెడకు గంట కట్టడానికి ఏకనాథ్ శిండే రెడీ అయ్యాడు… తను బాల్ ఠాక్రేకు వీరశిష్యుడు… చాలామందితో మాట్లాడాడు… తరువాత బీజేపీ ఈ పరిణామాలు గమనించి, మద్దతు ఇవ్వడానికి, గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు స్పిరిట్ ప్రకారం వెళ్తామంటే మేం మళ్లీ కలుస్తామని హామీ ఇచ్చింది…
ఠాక్రేకు పాఠం చెప్పడానికి బీజేపికి శిండే రూపంలో చాన్స్ దొరికింది… ఇప్పుడు తనేమంటున్నాడు..? ఎన్నికల సంఘం బీజేపీకి అమ్ముడుబోయింది, మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది అని…! ప్రజాస్వామ్యంలో మెజారిటీయే నిర్ణేత… అందుకే ఎన్నికల సంఘం మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ సంఘాల బాధ్యుల లెక్కలన్నీ పరిశీలించి, కొన్నాళ్లు ఆగీ ఆగీ తన నిర్ణయాన్ని వెలువరించింది… సేమ్, తెలుగుదేశం పార్టీ పగ్గాలు, ఎన్నికల సింబల్ విషయంలో చంద్రబాబు గెలిచింది కూడా మెజారిటీ ప్రాతిపదికనే..
.
అసలు ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఎవరిని సూచిస్తే వాళ్లు వారసులు కావాలి… ఇక్కడ జరిగిందీ అదే… అంతేతప్ప కుటుంబ పార్టీ యవ్వారంలా బాల్ ఠాక్రే తరువాత ఉద్దవ్ ఠాక్రే, ఆయన తరువాత మరో ఠాక్రే శివసేన వారసులు కావడమే అప్రజాస్వామికం అనిపించుకుంటుంది… దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ అనబడే జాతీయ పార్టీతోపాటు దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలూ అలాగే ఉన్నాయి… ఇదేమైనా వారసత్వ ఆస్తియా..? కుటుంబవారసులు ఎంజాయ్ చేయడానికి..? ఎవడిని కేడర్ నమ్ముతుందో వాడే వారసుడు… మహారాష్ట్రలో జరిగింది అదే… దీనికి ఉద్దవ్ ఠాక్రే గింజుకోవాల్సిన పనేమీ లేదు… తను మారగలిగితే మళ్లీ జనంలోకి వెళ్లి, కష్టపడాల్సిందే… కాంగ్రెస్, ఎన్సీపీలతో దోస్తీ ఎందుకు చేశావ్ అనే ప్రజల ప్రశ్నకు జవాబు చెప్పుకునే ప్రయత్నం చేయాల్సిందే… !!
Share this Article