Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సానుభూతి నాటకాలు నిజంగానే వోట్ల పంటను పండిస్తాయా..?

April 19, 2024 by M S R

Murali Buddha……. ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరగగానే అది సానుభూతి కోసం ఆడిన డ్రామా అని టీడీపీ వర్గం , ఇది బాబు జరిపిన కుట్ర అంటూ వైయస్ఆర్ వర్గం పరస్పరం మాటల దాడులు జరుపుకుంటున్నారు … నిజంగా సానుభూతి నాటకాలు వోట్ల పంట పండిస్తాయా…?

రాజకీయ సానుభూతి ఆరోపణలతో ఉమ్మడి రాష్ట్రంలో అతి పెద్ద సానుభూతి రాజకీయ ఎత్తుగడలు గుర్తుకు వచ్చాయి …
1999 ఎన్నికల్లో వాజ్ పాయి ఒక్క ఓటుతో ఓడిపోవడం, ఆ సానుభూతి , గురిచూసి కొట్టినట్టు బాబు అదే సమయంలో బీజేపీతో జతకట్టి, స్వల్ప తేడాతో తిరిగి అధికారంలోకి వచ్చారు . వరుసగా నాలుగేళ్ళ కరువు , తెలంగాణ ఉద్యమం , విద్యుత్ ఉద్యమంతో ఈసారి బాబు ఓటమి ఖాయం అనే అభిప్రాయం బలంగా ఏర్పడింది . ఆ సమయంలో తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు వెళుతుండగా నక్సల్స్ బాబు కారును బాంబులతో పేల్చేశారు . బాబుతో పాటు , గోపాలకృష్ణారెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి .
బాబు ఇంటికి వచ్చాక రాజకీయం మొదలైంది . సానుభూతి పవనాలతో విజయం సాధించడం ఖాయం అనే ఆలోచనతో ముందస్తు ఎన్నికలకు సిద్ధం అయ్యారు . మొదట ఆంధ్రజ్యోతిలో ‘ముందస్తు ఎన్నికలకు’ అని రాయించారు . అలిపిరి సంఘటన తరువాత బాబు మీడియాతో మాట్లాడలేదు . ఈ వార్త వచ్చిన రెండు రోజులకు ముఖ్యమంత్రి చీఫ్ పిఆర్ఓ విజయ కుమార్ నుంచి ఫోన్ … బాబు మీడియాతో మాట్లాడతారు , ఐతే మీరెవ్వరు ఏమీ అడగవద్దు .. బాబు చెప్పింది విని వెళ్ళాలి, ఆ షరతుకు ఒప్పుకుంటే రావాలి అని పిలుపు .. సరే అని మీడియా వెళితే చేతికి కట్టుకట్టుకొని ఉన్న బాబు గంటకు పైగా ఉపన్యాసం . ఐదేళ్ల కాలంలో తాను ఎలా అభివృద్ధి చేసింది , తిరిగి తానే ఎందుకు సీఎం కావాలో చెప్పుకుపోయారు . అచ్చం ఎన్నికల ప్రచారంలో ఉపన్యాసంలానే సాగింది .
ఏమీ అడగవద్దు అనే షరతు వల్ల ఎవరూ ఏమీ అడగకుండానే బయటకు వచ్చారు . బాబు మనోగతం అంటూ ఏమన్నా రాయించదలుచుకుంటే జ్యోతి లేదా ఈనాడు , ఒక్కోసారి రెండింటికి చెబుతారు … ముందస్తు అని జ్యోతిలో రావడంతో ఈనాడు మిత్రుడికి అది నమ్మబుద్ది కాలేదు . బాబు ఉపన్యాసం వింటే ఎన్నికల ఉపన్యాసంలానే ఉంది, సానుభూతిపై ఆశలు పెట్టుకొని ముందస్తుకు వెళతారనే అనిపిస్తోంది అని బయటకు వచ్చాక జరిగిన చర్చలో నా అభిప్రాయం చెప్పాను . అనుకున్నట్టే అప్పటి నుంచి బాబు ఇంటి వద్ద సానుభూతి రాజకీయాలు ఉదృతం అయ్యాయి .
తొలుత మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తమ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులను బాబు నివాసానికి తీసుకువచ్చి ‘బాబు అంకుల్ మీరు త్వరగా కోలుకోవాలి’ అని గులాబీ పూలు ఇవ్వడం .. మీడియాలో దీనికి మంచి కవరేజ్ వచ్చింది . స్కూల్ పిల్లల తరువాత అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా పరామర్శ యాత్రలు నిర్వహించారు . అంటే ఏ అసెంబ్లీ నియోజక వర్గం క్యాడర్ , నాయకులు ఏ రోజు రావాలో ముందుగానే సమాచారం ఇస్తే ఆ రోజు వచ్చే వాళ్ళు .
చెప్పకుండానే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు . సానుభూతిపై టీడీపీ చాలా ఆశలు పెట్టుకొంది . ఐతే బయట ప్రజల్లో మాత్రం ఈ ప్రభావం ఏమీ లేదు . కృత్రిమ వర్షాలు కురిపించినట్టు , కృత్రిమ సానుభూతి పవనాలు కురిపించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శలు చేసింది . ముందు బాబు కుడి చేతికి కట్టు ఉండేది , తరువాత దాన్ని ఎడమ చేతికి మార్చుకున్నారు అని కే .రోశయ్య చేసిన విమర్శ దుమారం లేపింది .
బాబు కారు కింద నక్సల్స్ బాంబులు పేల్చింది , గాయాలు తగిలింది అంతా నిజమే . కానీ అప్పుడు బాబు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్ల బాంబు దాడి అంతా డ్రామానేమో అని భావించిన వారు , ప్రచారం చేసిన వారు కూడా ఉన్నారు .
ఎన్నికల ఫలితాల వరకు అవసరం లేదు .. దాడి జరిగినప్పుడే సానుభూతి పని చేయడం లేదు అని తెలిపే సంఘటన ఒకటి గుర్తొచ్చింది …
శంకర్ రెడ్డి అని తిరుపతిలో టీడీపీ నాయకులు ( అప్పటి మున్సిపల్ ఛైర్మెన్ ), చదువుకునే రోజుల నుంచి బాబు మిత్రుడు . అతనే ఓసారి టీడీపీ కార్యాలయంలో చెప్పిన విషయం ఇది. బాంబు దాడిలో బాబు దుస్తులు రక్తంతో తడిచిపోయాయి . దాడి తరువాత తిరుపతిలో షాప్స్ మొత్తం బంద్ చేస్తారనీ, షట్టర్ తెరిచి బట్టలు తేగలడు అని శంకర్ రెడ్డిని పంపితే , షాప్స్ అన్నీ తెరిచే ఉన్నాయట . ఒక్క షాప్ కూడా మూయలేదు .
సానుభూతిపై బోలెడు ఆశలు పెట్టుకున్నా ఆ ఎన్నికల్లో సానుభూతి పని చేయలేదు . టీడీపీ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా కేవలం 47 సీట్లు మాత్రమే వచ్చాయి . మంత్రి మణికుమారి భర్తను నక్సల్స్ హత్య చేస్తే ఆ ఎన్నికల్లో ఆమెకు డిపాజిట్ కూడా రాలేదు …
****
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సభలో శాంతిభద్రతల గురించి సీరియస్ చర్చ . తెరాస నుంచి గెలిచి, కాంగ్రెస్ లో చేరిన మందాడి సత్యనారాయణతో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడించారు . శాంతి భద్రతల వైఫల్యం అంటూ బాబు ఆవేశంగా మాట్లాడితే .. ముడ్డి కింద బాంబు పేలిస్తేనే దిక్కులేదు .. శాంతిభద్రతల గురించి మీరా మాట్లాడేది అంటూ మందాడి దాడి చేశారు .
***
అలిపిరి బాంబు దాడి , కోడి కత్తి , తాజాగా జగన్ పై రాయితో దాడి అన్నీ నిజమే . ఏ పార్టీ నాయకులైనా సరే రాజకీయాల్లో ఉండేవాళ్ళు మహా ముదుర్లు . యూ ట్యూబర్లంత చిల్లర ఆలోచనల్లో ఉండరు . తమ మీద తామే దాడి జరుపుకొని , సానుభూతి వస్తుంది అనుకునేంత అమాయకులు కాదు …
ఓటర్లు అనేక కోణాల్లో అలోచించి ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయించుకుంటారు . సహజంగా రెండు పక్షాలు ఈ అంశంపై తమ తమ రాజకీయ కోణం నుంచి మాట్లాడుతుంటాయి . ఐతే అలిపిరి దాడి సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలివిగా వ్యవహరించారు . బాంబు దాడి జరిగిన సమయంలో ఆంధ్రాలోనే ఉన్న రాజశేఖర్ రెడ్డి వెంటనే రోడ్డు మీద బైఠాయించారు,  ధర్నా చేశారు . దాడిని ఖండిస్తున్నట్టు , దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు . టీడీపీ వాళ్ళు తేరుకోక ముందే కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్నా చేయడం ప్రత్యేకంగా నిలిచింది… – బుద్దా మురళి .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ పదేళ్ల స్వరాష్ట్ర పరిపాలనకు మరో వికృతకోణం ఇది…
  • GenZ … నెట్ వీథుల్లో విప్లవరచన… అసలు ఏమిటీ తరం..? చదవండి..!
  • Air Bag to Air Bus …. ప్రయోగాలు ఫలిస్తే విమానప్రాణాలకు శ్రీరామరక్ష…
  • భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ… బీమా భరోసాలే కాదు, ఈ జాగ్రత్తలూ ముఖ్యమే…
  • వంశీ మార్క్ జమజచ్చ సినిమా.., అప్పట్లో జహిజట్… నవ్వుల్ డబ్బుల్…
  • ‘‘నేనెందుకు బాధపడాలి… బాధపడితే శోభన్‌బాబు పడాలి గానీ…’’
  • గుడిమల్లం..! ఉల్కశిల నుంచి చెక్కిన తొలి శివలింగ మూర్తి..?!
  • తాజా ఏబీసీ ఫిగర్స్… ఈనాడు- సాక్షి- ఆంధ్రజ్యోతి… ఏది ఎక్కడ..!!
  • ఒక మీడియా హౌజ్… ఆఫీస్ క్లోజ్… అందరూ కలం పోరాటయోధులే మరి..!!
  • Mirai..! భిన్నమైన ఓ కథకు రక్తికట్టించే ప్రజెంటేషన్… గుడ్ ఔట్‌పుట్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions