.
చాన్నాళ్ల క్రితం ఏదో పత్రికలో అమల అక్కినేని ఇంటర్వ్యూ… ముందు అది చదవండి, యథాతథంగా… ‘‘మొన్నీమధ్య ‘ఎలెక్ట్రిక్ డ్రీమ్స్’ అన్న సినిమా చూశాను. అందులో కథ చాలా వింతగానూ తమాషాగానూ ఉంది.’ తలుపు తీయడం, తలుపు వేయడం, కాఫీ అందించడం, లైటు వేయడం, టూత్ బ్రష్ మీద పేస్టు వేసివ్వడం- వగైరా పనులన్నీ ఆ ఇంట్లో కంప్యూటర్ ద్వారానే జరుగుతాయి. ఆ కంప్యూటర్ తాలూకు యజమాని పక్కింటి అమ్మాయిని ప్రేమిస్తుంటాడు.
మనుషుల్లా అన్ని పనులూ చేస్తున్నప్పుడు ప్రేమించడంలో మాత్రం ఎందుకు వెనుకబడాలని భావించిన కంప్యూటర్ తాను కూడా అదే అమ్మాయిని ప్రేమించడం మొదలెడుతుంది. అంతటితో ఆగిందా? ఉహూఁ… ఆ జంట మీదే ఈర్ష్యపడి తన యజమానిని నానారకాలుగా ఇబ్బంది పెడుతుంది.
Ads

పాపం ఇవేవీ ఎరగని ఆ యువకుడు జపాన్ నుంచి ఒక నిపుణున్ని పిలిపించి కంప్యూటర్ని అతని పరం చేయాలని ప్రయత్నిస్తాడు. కాని చివరిక్షణంలో అది మనసు మార్చుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ ప్రేమికుల జీవితం సుఖమయం కావాలని కోరుతూ ఒక కవిత రాసిపెట్టి మరీ చనిపోతుంది.
కంప్యూటర్కి బాగా కోపం వచ్చినప్పుడు అన్ని వస్తువులు చెల్లాచెదురుగా ఎగిరిపోవడం, అది బాధతో ఏడుస్తున్నప్పు డు అవన్నీ జాలిగా మౌనంగా ఉండిపోవడం- ఈ దృశ్యాలు చాలా ఆమోఘంగా చిత్రీకరించారు.

ఆమధ్య కొన్ని రోబోలు సొంతంగా వ్యవహరిస్తూ, బాస్ ఆర్డర్లను కూడా బేఖాతరు చేస్తూ, తిరగబడిన వార్తలు చదివాం కదా… కృత్రిమ మేధస్సు రాబోయే రోజుల్లో రోబోలకు, అనగా యంత్రాలకు కూడా మానవ ఉద్వేగాలను, రాగద్వేషాలను కల్పించబోతున్నదనే ఆందోళన కూడా వినిపిస్తోంది కదా… అది పెరిగితే అసలు మానవ మనుగడ? రాను రాను సైబోర్గుల శకమేనా?

ఈ చర్చ మాటెలా ఉన్నా… ఆమధ్య, అంటే 2010 లో… రజినీకాంత్ సినిమా వచ్చింది గుర్తుంది కదా… రోబో (యెంథిరన్)..! అందులో కూడా సేమ్, ఆ పాత 1984 నాటి ఎలక్ట్రిక్ డ్రీమ్స్ సినిమా కథే కదా… బాస్ (తన క్రియేటర్) ప్రేమించిన అమ్మాయినే తనూ పెళ్లి చేసుకుంటానంటూ విధ్వంసాన్ని సృష్టిస్తాడు కదా… సో, రజినీ రోబో కథ వెనుక ఆ పాత ఎలక్ట్రిక్ డ్రీమ్స్ అనే సినిమా ఉందన్నమాట… ఇన్నాళ్లూ అది మనవాళ్ల ఒరిజినల్ థాట్, స్టోరీ అనుకున్నాం… ప్చ్..!! అయ్యో, దర్శక శంకరా !!
Share this Article