Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏనుగులకూ వేర్వేరు పేర్లుంటయ్… అవి వాటితోనే పలకరించుకుంటయ్…

June 15, 2024 by M S R

పేర్లు పెట్టి పిలుచుకునే ఏనుగులు… మనుషులే ఎందుకు మాట్లాడుతున్నారు?
జంతువులు, పక్షులు, క్రిమి, కీటకాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి?
అని శాస్త్రవేత్తలు బుర్రలు బద్దలు కొట్టుకోగా…కొట్టుకోగా…
తేలిందేమిటయ్యా అంటే-
మనుషుల్లో మాత్రమే “స్వర త్వచం” ఏర్పడిందని. మిగతా ఏ ప్రాణుల్లో స్వర త్వచం ఏర్పడలేదని. స్వర తంత్రులకు కొనసాగింపుగా అదే ప్రాంతంలో రిబ్బన్ లా ఉండే ఒక అవయవ నిర్మాణాన్ని స్వర త్వచం అంటారు.

జపాన్ టోక్యోలో సెంటర్ ఫర్ ఎవల్యూషనరీ ఆరిజిన్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ లో దీని మీద విస్తృతమయిన అధ్యయనాలు జరిగాయి. నిజానికి మనిషి కూడా 84 లక్షల జీవరాశుల్లో ఒక జంతువే. కేవలం మాట్లాడ్డం వల్ల మనిషి 83,99,999 జీవరాశుల కంటే చాలా భిన్నం, ప్రత్యేకం అయ్యాడు.

మెదడులో ఒక ఆలోచన మాటగా బయటికి రావాలంటే పరా; పశ్యంతి, మాధ్యమా, వైఖరి అని నాలుగు దశలు దాటాలి. ఈ నాలుగు రూపాలకు సరస్వతి దేవత. పెదవి దాటిన మాట వైఖరి-ఎదుటివారికి వినపడుతుంది. మిగతా మూడు దశల వాక్కు గొంతులో, మనసులో, నాభిస్థానంలో బయలుదేరినప్పుడు ఎదుటి వారికి వినపడదు. మనతో మనమే స్వగతంలో మౌనంగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా లోపల పదాలు, వాక్యాలు, భావాల భాష పరా పశ్యంతి మధ్యమ దాకా ప్రవహిస్తూనే ఉంటుంది. మనిషి శరీర అవయవాల్లో భాష లేదా ధ్వనులు పుట్టి…మారి…బయటికి వినిపించడాన్ని ఇంత శాస్త్రీయంగా దర్శించిన పురాతన సమాజం ప్రపంచంలో బహుశా మనది తప్ప ఇంకేదీ ఉండకపోవచ్చు. మెదడులో ఇదివరకే రికార్డ్ అయి ఉన్న మాటలను భావానికి అనుగుణంగా శబ్దం లేదా మాటగా తీసుకురావడం సెకనులో వెయ్యో వంతు సమయంలో ఆటోమేటిగ్గా జరిగినట్లు అనిపిస్తుంది కానీ- ఆటోమేటిగ్గా జరగదు. మన ప్రయత్నంతోనే శబ్దం బయటికి వస్తుంది. ఆలోచన మెదడుది. మాటలు అందించేది మెదడు. శబ్దం వినపడేలా చేసేది మన ఊపిరితిత్తుల్లోని గాలి. నాభి దగ్గర పైకి ప్రయాణించే గాలి గొంతులో స్వర తంత్రుల దగ్గర మూర్ఛనలు పోతుంది. ఇక్కడే స్వర త్వచం పాత్ర చాలా కీలకమయినది. ఆపై నోట్లో అనేక భాగాల కదలికలతో ఒక్కో అక్షరం పలుకుతుంది.

Ads

మౌఖికంగా ఉన్న భాషకు శాశ్వతత్వం కల్పించేది లిపి. అ క్షయం- అక్షరం. పలికినా అక్షరమే. రాసినా అక్షరమే. చదివినా అక్షరమే. క్షయం కాకుండా ఉండాలంటే శబ్దానికి రూపం తప్పనిసరిగా ఉండాలి. అలా ఏర్పడిందే లిపి. లిపిలో ఉన్న శబ్దాలను చదువుతున్నప్పుడు ముందు కన్ను చదువుతుంది. తరువాత మెదడు చదువుతుంది. ఆపై నోరు పలుకుతుంది. బాగా నచ్చితే మెదడు రికార్డు చేసుకుంటుంది.

పరిణామ క్రమంలో మనిషి కోతి నుండి పుట్టాడు కాబట్టి జపాన్ పరిశోధనలో 43 రకాల కోతుల స్వర తంత్రులను, స్వర పేటిక నిర్మాణాన్ని, అరిచేప్పుడు గొంతులోపల జరిగే మార్పులను రికార్డు చేసి, అధ్యయనం చేశారు.

మంచిదే.
మనం మాత్రమే ఎలా మాట్లాడగలుగుతున్నామో తెలిసి…మనుషులుగా గర్వపడవచ్చు. పులకించిపోవచ్చు.

ఇన్ని యుగాలుగా జంతువులు కూడా మనతోపాటు పుడుతూనే ఉన్నాయి. వాటి భాష మనకు అర్థం కాకపోవచ్చు కానీ…వాటితో అవి మాట్లాడుకుంటూనే ఉన్నాయి. కాకి పిల్ల కాకికి ముద్దు కాబట్టి కావు కావు అన్న కాకి భాష సాటి కాకులకు కాకి గోల కాకపోవచ్చు. కోయిల పాట గాడిదకు కర్ణ కఠోరంగా ఉండి ఉండవచ్చు. సకిలింపు, ఓండ్రపెట్టడం, కిలకిలలు, కువకువలు, ఘింకారం, భౌ భౌలు, మ్యావ్ మ్యావ్ లు, బుసబుసలు మనకు అర్థం కాకపోయినంతమాత్రాన వాటికొచ్చిన నష్టమేమీ లేదు.

మనం పరమ పవిత్రంగా, ప్రామాణికంగా పరిగణిస్తున్న సప్తస్వరాలు జంతువులు, పక్షుల అరుపుల ఆధారంగా ఏర్పడినవే.

వెనక్కు ద్వాపర, త్రేతా, కృత యుగాల్లోకి వెళితే…కృష్ణుడితో గోవులు మాట్లాడాయి. రాముడితో జటాయువు పక్షి మాట్లాడింది. హనుమ బృందంతో సంపాతి పక్షి మాట్లాడి…సీతమ్మ జాడ చెప్పింది. రాముడి కొలువుకు వచ్చి దెబ్బ తిన్న వీధి కుక్క మాట్లాడి పెద్ద పంచాయతీ పెట్టింది. గరుత్మంతుడు మాట్లాడాడు. శివుడి మెడలో పాము వాసుకి మాట్లాడింది. నారాయణుడి డన్లప్ పరుపు ఆదిశేషుడు మాట్లాడాడు. పార్వతి చేతి చిలుక ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది.

ప్రబంధాల్లో రాయంచలు మాట్లాడి రాయబారాలే చేశాయి. పావురాలు ప్రేమలేఖలు చదివి వినిపించాయి. శకుంతల వెళ్లిపోతుంటే కణ్వుడి ఆశ్రమంలో జింకలు కన్నీళ్లతో గద్గద స్వరంతో మాట్లాడాయి.

యుగ యుగాలుగా జంతువులు, పక్షులు, క్రిమి, కీటకాలు మాట్లాడాల్సినదానికంటే ఎక్కువే మాట్లాడినట్లున్నాయి. ఇక చాల్లెమ్మని మాట్లాడ్డం మానేసినట్లున్నాయి.

జంతువులు ఎందుకు మాట్లాడలేకపోతున్నాయో శాస్త్రీయంగా చెప్పగలిగారు. ఏదో ఒకనాటికి ఆ స్వర త్వచం ఇతర ప్రాణుల్లో కూడా ఏర్పడితే? అన్ని ప్రాణులు మనలాగే మాట్లాడితే?
అప్పుడు- గుర్రం ఎగరావచ్చు. మాట్లాడనూ వచ్చు.

అప్పుడు-
మౌనమే నీ భాష ఓ మూగ మనిషీ!

చూడబోతే-
ఆ రోజు వచ్చేసినట్లుంది. కెన్యా అడవిలో వంద ఏనుగుల మీద జంతు శాస్త్రవేత్తలు సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఏనుగులు పరస్పరం పేర్లు పెట్టి పిలుచుకుంటున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. వంద ఏనుగుల అరుపులను, ప్రత్యేకించి ఇంకో ఏనుగును పిలిచేటప్పటి అరుపులను విడివిడిగా రికార్డు చేశారు. ఏనుగులకు విడిగా గుర్తుకు నంబర్లు పెట్టారు. ఉదాహరణకు రికార్డ్ చేసిన ఏడో నంబరు ఏనుగు పిలుపును సౌండ్ బాక్స్ లో దూరంగా ఉన్న పదిహేడో నంబరు ఏనుగు దగ్గర వినిపిస్తే…ఆ ఏనుగు ఎలాంటి తడబాటు లేకుండా గుంపులో ఉన్న ఏడో నంబరు ఏనుగు దగ్గరికే వెళ్లింది. కేవలం అరుపులను గుర్తు పట్టడమే కాకుండా ఒక ఏనుగు మరో ఏనుగును పిలవాలనుకున్నప్పుడు ఒకే రకమైన ధ్వనిని చేయడాన్ని ఈ అధ్యయనంలో గుర్తించారు.

సృష్టిలో మనిషే అత్యంత తెలివైనవాడని మనిషి అనుకుంటాడు. జీవకోటిలో మాట్లాడగలిగింది మనిషి ఒక్కడేనని మనిషి నమ్మకం.

“లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా!”
అని గజేంద్రుడు ఏనాడో మానవ భాషకంటే గొప్పగా మాట్లాడాడు కదా!

అయినా- మీకు నమ్మకం కుదరకపోతే
కెన్యా అడవులకు వెళ్లి…రండి. అక్కడ
పొరపాటున ఈ మాటంటే- ఏనుగులు పడి పడి నవ్వుతాయి. తమ గుంపులో ఒక్కొక్క ఏనుగును పేరు పెట్టి పిలిచి…మన పరువు తీసి…పంచనామా చేస్తాయి.

“ఏనుగమ్మ! ఏనుగు!
నాలుగుకాళ్ళ ఏనుగు
ఏ ఊరొచ్చిందేనుగు?
మా ఊరొచ్చిందేనుగు
ఏం చేసిందేనుగు?
నీళ్లు తాగిందేనుగు
ఏనుగు ఏనుగు నల్లన-
ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు-
ఎంతో చక్కని దేవుడు…”
అని ఒకానొకప్పుడు పిల్లలు పాట పాడుకునేవారు.
ఆ పాటలో-
“పేర్లు పెట్టిందేనుగు
మాట్లాడిందేనుగు…”
అని కొత్త చరణాన్ని కూడా కలుపుకోవాలి! -పమిడికాల్వ మధుసూదన్ 9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions