.
నల్లగొండ జిల్లాలో ఎలిమినేటి మాధవరెడ్డిది ప్రత్యేకమైన చరిత్ర. ఎగుడు దిగుడులు లేకుండా ఏకపక్షంగా సాగిన రాజకీయ ప్రయాణం ఆయనది. యుక్తవయస్సులోనే స్థానిక రాజకీయాల్లోకి వచ్చి, బలమైన పునాదులు వేసుకొని, రాష్ట్ర రాజకీయాల్లోకి కెరటంలా దూసుకువచ్చారు.
36 ఏళ్లకు ఎమ్మెల్యే, 45 ఏళ్లకు మంత్రి అయ్యారు. కానీ ఎంతో భవిష్యత్తు ఉండగానే 50 ఏళ్ల వయస్సులో తుది వీడ్కోలు తీసుకున్నారు. నక్సల్స్ మందుపాతరలకు మాధవరెడ్డి బలైన ఘటనకు 25 ఏళ్లు పూర్తయ్యాయి…
Ads
2000వ సంవత్సరం మార్చి 7న ఘట్‌కేసర్ వద్ద అప్పటి పీపుల్స్‌వార్ గ్రూపు నక్సల్స్ జరిపిన ‘యాక్షన్’లో మాధవరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. అప్పుడది దేశవ్యాప్త సంచలనం. అయితే మాధవరెడ్డి భౌతికంగా లేరన్నట్టేగానీ, ఈ పాతికేళ్లలో అనేక సందర్భాల్లో అనేకమార్లు వచ్చిన ఆయన ప్రస్తావన తీవ్ర చర్చలకు దారితీసింది.
మాధవరెడ్డి గాలివాటం రాజకీయ నేత కాదు. ప్రొఫెషనల్ పొలిటీషియన్. ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో బీఈ పూర్తి చేసుకున్న తర్వాత.. ఎన్టీఆర్ పిలుపు మేరకు 1983లో టీడీపీలో చేరారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న నల్లగొండ జిల్లాలో టీడీపీ అధినాయకత్వం నవ యువ నేతలకు నగిషీలు చెక్కిన పరంపరలో మాధవరెడ్డి నాయకుడిగా ఎదిగారు.
1985లో భువనగిరి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైంది మొదలు.. వెనక్కి చూడలేదు. 1989 అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ గాలిలో అనేకమంది టీడీపీ ఉద్దండులు మట్టి కరవగా, మాధవరెడ్డి రెండోసారి విజయం సాధించి ఎన్టీఆర్‌కు మరింత సన్నిహితమయ్యారు.
పార్టీలో చంద్రబాబు తర్వాత కీలకనేతగా ఎదిగారు. అటు చంద్రబాబుకూ దగ్గరయ్యారు. 1994లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించి ఎన్టీఆర్ కేబినెట్‌లో వైద్య, ఆరోగ్య మంత్రిగా చోటు దక్కించుకున్నారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య 1995 ఆగస్టులో చోటుచేసుకున్న ఎన్టీఆర్ పదవీచ్యుతి సంక్షోభంలో టీడీపీ ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలగా, మాధవరెడ్డి.. తనకు రాజకీయ బిక్ష పెట్టిన ఎన్టీఆర్ కాదని, తన మిత్రుడు చంద్రబాబు వెంట నిలిచారు.
అనంతర కాలంలో ఎన్టీఆర్ వెంట నిలిచిన వారు రాజకీయంగా అస్తిత్వం కోల్పోగా, చంద్రబాబుతో ఉన్న వారు మాత్రం అధికార ప్రభలో వెలిగిపోయారు. ఆ లెక్కన మాధవరెడ్డి తెలివైన నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయమూ ఉంది.
1995 సెప్టెంబరు 1న చంద్రబాబు కేబినెట్‌లో మాధవరెడ్డి ఏకంగా హోం మినిస్టర్ అయిపోయారు. అంటే ప్రభుత్వంలో నెంబర్ టూ అన్నమాట. ఎన్టీఆర్ ప్రభుత్వం నక్సల్స్‌పై నిషేధం ఎత్తివేస్తే, చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ నిషేధాస్త్రం ప్రయోగించింది.
తెలంగాణలో బలంగా వేళ్లూనుకున్న నక్సలిజంపై ఉక్కుపాదం మోపింది. పోలీసులకు విపరీతమైన స్వేచ్ఛనిచ్చింది. పోలీస్ స్టేషన్లకు ఆధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చింది. నక్సల్స్ హత్యాకాండలకు సమాధానంగా బూటకపు ఎన్‌కౌంటర్లను ప్రోత్సహించింది.
గద్దర్‌పై కాల్పులు జరిగాయి.. బెల్లి లలిత కిరాతకంగా హత్యకు గురైంది. గ్యాంగ్‌స్టర్ నయీం అరాచకాలకు అడ్డులేకుండా పోయింది. 1995 సెప్టెంబరు నుంచి 1999 ఆగస్టు వరకు చంద్రబాబు తొలి టర్మ్‌లో తెలంగాణ కల్లోల ప్రాంతంగా మారిపోయింది.
ఈ నెత్తుటి చరిత్రంతా అప్పుడు హోం మినిస్టర్‌గా ఉన్న మాధవరెడ్డి ఖాతాలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే మాధవరెడ్డిని పీపుల్స్‌వార్ గ్రూపు తన హిట్‌లిస్ట్‌లోకి చేర్చింది. వ్యక్తిగతంగా ఎంతో సౌమ్యుడిగా పేరున్న మాధవరెడ్డి.. మంత్రి హోదాలో నక్సల్స్‌పై ప్రదర్శించిన దూకుడు ఆ రోజుల్లో అధికార, విపక్షాలనే కాదు, పౌరసమాజాన్నీ ఆశ్చర్యపరిచింది.
1999 సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చారు. మొదటి టర్మ్‌లో మాధవరెడ్డికి నెంబర్ టూ పొజిషన్ ఇచ్చిన చంద్రబాబు.. రెండో టర్మ్‌కు వచ్చేసరికి టి.దేవేందర్‌గౌడ్‌ను తెరమీదకు తీసుకువచ్చారు.
హోం శాఖను దేవేందర్ గౌడ్‌కు ఇచ్చి, మాధవరెడ్డికి పంచాయతీరాజ్ శాఖను కట్టబెట్టారు. మాధవరెడ్డి ప్రాధాన్యం తగ్గించే ఉద్దేశంతోనే చంద్రబాబు కీలకశాఖను కట్ చేశారని, కాదు కాదు మాధవరెడ్డే ఇష్టపడి పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నారనే వ్యాఖ్యలూ వెలువడ్డాయి.
దేవేందర్‌గౌడ్ హోం మినిస్టర్ అయిన తర్వాత నక్సల్స్ అణచివేత మరింత ఊపందుకుంది. మంత్రులెవరైనా అది ప్రభుత్వ పాలసీ కావడంతో, పోలీసు ఉన్నతాధికారులు తమ గురిని మరింత పదునెక్కించారు. ఈ క్రమంలోనే 1999 డిసెంబరు 2న పీపుల్స్‌వార్ అగ్రనేతలు ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి, నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్‌ల ఎన్‌కౌంటర్ జరిగింది. పీపుల్స్‌వార్ దెబ్బతిన్న బెబ్బులిలా బద్‌లాకు సిద్దమైంది.
ఇక్కడ సీన్ కట్ చేస్తే, 2000వ సంవత్సరం మార్చి 7న రాత్రి మాధవరెడ్డి తన కాన్వాయ్‌తో యాదగిరి గుట్ట నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. రాత్రి 11 గంటల సమయంలో ఘట్‌కేసర్ వద్ద ఆర్వోబీ మీదుగా ప్రయాణిస్తున్న క్రమంలో పీపుల్స్‌వార్ నక్సలైట్లు సరిగ్గా గురి చూసి ముందుపాతరలు పేల్చారు.
మాధవరెడ్డి ప్రయాణిస్తున్న క్వాలిస్ వాహనం 50 అడుగుల ఎత్తుకు ఎగిరి తునాతునకలై పడిపోయింది. అది అత్యంత బీభత్స భయానక ఘటన. ఎవరూ ఊహించని విధంగా మాధవరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అప్పుడాయన వయస్సు కేవలం 50 ఏళ్లు.
ఈ ఘటన ఆనాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పటేల్ సుధాకర్‌రెడ్డి, ఆశన్న, శ్రీరాముల శ్రీనివాస్ తదితర అగ్రశ్రేణి నక్సల్స్‌తో కూడిన టీమ్ ఈ యాక్షన్‌కు పాల్పడినట్టు పోలీసులు ప్రకటించారు. అప్పుడప్పుడే అందుబాటులోకి వస్తున్న సెల్‌ఫోన్లను, నైట్‌విజన్ కెమెరాలను వాడటం ద్వారా నక్సల్స్ తమ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్టు గుర్తించారు. రాత్రి వేళ మందుపాతరను పేల్చడం అనేది నక్సల్స్ చరిత్రలోనే తొలిసారి.
అయితే భద్రత విషయంలో చంద్రబాబు సర్కారు అనుసరించిన వైఖరి వల్లే మాధవరెడ్డి మరణించారనే విమర్శలు గుప్పుమన్నాయి. హిట్ లిస్ట్‌లో ఉన్న మాధవరెడ్డికి హోం శాఖ ఇవ్వకపోవడం వల్ల భద్రత తగ్గి బలైపోయారని, చంద్రబాబుదే ఈ పాపం అని ఆయన అనుయాయులు ఆక్రోశించారు.
రాజకీయాల్లో తన నీడను కూడా నమ్మని చంద్రబాబు… తెలంగాణ నుంచి సమర్థుడైన నేతగా ఎదుగుతున్న మాధవరెడ్డిని నక్సల్స్‌కు బలిపశువును చేశారనే ఆరోపణలూ వచ్చాయి. మందుపాతర ఘటనపై సీబీఐచే విచారణ జరిపించాలని మాధవరెడ్డి సోదరుడు కృష్ణారెడ్డితో పాటు కేసీఆర్ కూడా డిమాండ్ చేసింది ఈ కారణాలతోనే. అయితే ఈ ఆరోపణలకూ ఎక్కడా మద్దతు దక్కలేదు. మాధవరెడ్డి సతీమణి ఉమ స్వయంగా ఈ ఆరోపణలను ఖండించారు.
మాధవరెడ్డి మరణించడానికి ముందే పట్లోళ్ల ఇంద్రారెడ్డి, దాస్యం ప్రణయ భాస్కర్ వంటి ఎన్టీఆర్ వర్గ టీడీపీ నేతలు.. తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారు. ఇంద్రారెడ్డి ప్రజాక్షేత్రంలోకి రాగా, ప్రణయభాస్కర్ అసెంబ్లీలో పలుమార్లు తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని బలంగా నొక్కిచెప్పారు.
మరోపక్క కాళోజీని ముందుపెట్టి ప్రజాసంఘాలు భువనగిరి వేదికగా తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. అయితే ఈ సంధికాలంలో మంత్రిగా వున్న మాధవరెడ్డి తెలంగాణ వాదం పట్ల తన వైఖరి ఏమిటో రేఖామాత్రంగానైనా తెలుపలేదు. పైగా భువనగిరి నుంచి తెలంగాణవాదాన్ని వినిపిస్తున్న బెల్లి లలితను 1999లో హత్య చేయించడంలో ఆయన పాత్ర ఉందంటూ గద్దర్ వంటి వారు వేలెత్తిచూపారు.
ఈ పరంపరలో మాధవరెడ్డి బతికుంటే తెలంగాణ ఉద్యమంలో భాగం అయ్యుండే వారా.. కాదా.. అనే ప్రశ్నకు జవాబు చెప్పడం ఊహాత్మకం అయినప్పటికీ, ప్రజల నుంచి ఎదిగి నేతగా అనివార్యంగా ఉద్యమాన్ని తలకెత్తుకునే వారేమో…
ఇక 2021లో ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న సన్నివేశాలూ మాధవరెడ్డిని మరోసారి వార్తల్లోకి తీసుకువచ్చాయి. అనాడు అధికారంలో వున్న వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా తదితరులు.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మాధవరెడ్డి పేర్లను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు నిర్ఘాంతపరిచాయి. బురద రాజకీయాల్లోకి మాధవరెడ్డి పేరును లాగడం వెగటు కలిగించింది. డర్టీ పాలిటిక్స్…
‘ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ..’ అంటూ చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయి, లైవ్‌లో వెక్కి వెక్కి ఏడ్చి, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1995లో చంద్రబాబు తొలిసారి సీఎం కావడానికి ప్రత్యక్షంగా వెన్నుదన్నుగా నిలిచిన మాధవరెడ్డి… 2024లో నాలుగోసారి చంద్రబాబు సీఎం కావడానికి పరోక్షంగా కారణం అయ్యారు.
రాజకీయాల్లో ఇది ఒక వైచిత్రిగా నమోదైంది. ఈరోజుకూ మాధవరెడ్డి వార్తల్లో వ్యక్తి అవుతున్నాడు… గడచిన 25 ఏళ్లుగా మాధవరెడ్డి తెలుగువారి రాజకీయాలతో, మరీ ముఖ్యంగా భువనగిరి ప్రజలతో ఒక బంధంగా పెనవేసుకునే వున్నారు.
ఆయన మరణం తర్వాత ఆయన సతీమణి ఉమ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు సందీప్‌రెడ్డి మొన్నటి వరకు జడ్పీ చైర్మన్‌గా వున్నారు. 15 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలే ఆలంబనగా మాధవరెడ్డి తనకంటూ ఇమేజ్‌ను, విలువను సృష్టించుకున్నారు. ఆయన వారసత్వ పరంపర మనుగడకు అవే ఆధారం.
సమకాలీన రాజకీయాల్లో, పరిణామాల్లో ఎక్కడో ఒక చోట మాధవరెడ్డి పేరు నిత్యం ప్రస్తావనకు వస్తూనే ఉంది. అంతెందుకు ఇటీవల కుప్పకూలిన ఎస్‌ఎల్‌బిసీ టన్నెల్ కూడా ‘ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం’లో ఒక భాగమే. మరణించి 25 ఏళ్లవుతున్నా ఏదో ఒక రూపంగా సజీవంగా మనగలుగుతుండటం ఒక్క మాధవరెడ్డికే చెల్లింది….. – శంకర్‌రావు శెంకేసి, 79898 76088
Share this Article