Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇమోజీ… ఇది అచ్చమైన విశ్వభాష… ఉద్వేగ సూచికలే అక్షరాలు… కానీ..?

July 28, 2023 by M S R

Its a Language:  ప్రపంచ భాషలన్నిటికీ ఇన్ని యుగాల్లో ఎప్పుడూ రాని పెద్ద ఉపద్రవం వచ్చి పడింది. భాషల నోట మాట రాక మౌనంగా రోదించాల్సిన సందర్భం వచ్చింది. భాషలకు శాశ్వతత్వం కల్పించిన అక్షరాలు చెదిరిపోయి…అక్షరాల అవసరమే లేని వినూత్న నిరక్షర భాష పుట్టింది. మానవ నాగరికత పురుడు పోసుకోకముందు పాతరాతియుగం గుహల్లో బొమ్మలతో భావాన్ని వ్యక్తం చేయడానికి ఆదిమ మానవుడు పడిన బాధ వర్ణనాతీతం అని చరిత్రలు చదివి కుండల కొద్దీ కన్నీరు కారుస్తున్నాం.

మనుషులు పశువుల్లా బతికిన యుగం, గుహల్లోకి మారిన పాతరాతి యుగం, పనిముట్లను కనుగొన్న లోహ యుగం, ఖండాలు దాటిన మధ్య యుగం, ఊహలకు రెక్కలు తొడిగిన ఆధునిక యుగం, కృత్రిమ సృష్టి చేయగలిగిన అత్యాధునిక ప్రస్తుత యుగం- అని కాలాన్ని ఏవో కాకి లెక్కలతో విభజించి పోటీ పరీక్షలకు కాలాతీతంగా చదువుకుంటున్నాం కానీ…పాతరాతి యుగం జీవన విధానం మీద మన మక్కువ తీరలేదు.

ఎంత అత్యాధునిక ప్రతి సృష్టి చేయగలిగిన రోజుల్లో ఉన్నా గుహల్లో మన పూర్వులయిన ఆదిమ మానవుల అలవాట్లను వెతికి పట్టుకుని…వాటిని అనుసరిస్తూ మన పితృ దేవతలకు తగిన మర్యాదను ప్రకటించుకుంటూ ఉంటాం. మిగతా వాటి సంగతి తరువాత చూద్దాం. లిపులు లేని పాతరాతి యుగం గుహల్లో వాడిన బొమ్మల భాష అంటే మనకున్న వ్యామోహంతో ప్రపంచ భాషల లిపుల ఉనికి ప్రశ్నార్థకం అయితే కావచ్చు…కానీ దాని వల్ల జరుగుతున్న ప్రహసనాలేమిటో ఒకసారి చూడండి.

Ads

1 . కెనడాలో ఒక రైతుకు- వ్యాపారికి మధ్య వాట్సప్ లో వ్యవహారం జరిగింది. కొంత టెక్స్ట్ సంభాషణలో ప్రశ్నలు- సమాధానాలు జరిగాయి. రైతు అడగాల్సినవి అడిగాడు. వ్యాపారి చెప్పాల్సినవి చెప్పాడు. ఆర్థికపరమయిన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. చివర రైతు 👍 ఈ  ఎమోజీ పెట్టాడు. కొన్ని నెలల తరువాత వ్యాపారి రైతును కోర్టుకు లాగాడు. నాకు రైతు ఇవ్వాల్సిన యాభై లక్షల రూపాయలు న్యాయంగా ఇప్పించండి అని.

ఇది మరీ అన్యాయంగా ఉంది యువరానర్! నేను కేవలం అకెడెమిక్ ఉత్సాహం కొద్దీ రేట్లను తెలుసుకున్నానే కానీ…సరుకు కొన్నానా? కొంటానని అన్నానా? అని అమాయక రైతు కోర్టు బోనులో న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు. 👍అన్న ఎమోజీకి ముందు జరిగిన వాట్సాప్ టెక్స్ట్ చాట్ ను మొత్తం పరిశీలించిన న్యాయమూర్తి వ్యాపారి అనుకున్న వాదనతోనే ఏకీభవించి…రైతుది తప్పని తేల్చి…ఆ యాభై లక్షల రూపాయలు చెల్లించాల్సిందేనంటూ తీర్పు ఇచ్చారు.

2 . ఇజ్రాయిల్ లో ఇంటి యజమానికి- అద్దెకుంటున్న వ్యక్తికి మధ్య ఇలాగే వాట్సాప్ లావాదేవీలు, వాద ప్రతివాదాలు జరిగాయి. ఎమోజీల ఆధారంగా కోర్టు తీర్పు చెప్పింది.

3 . ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పోలీసులకు దొరక్కుండా ఎమోజీ భాషనే వాడుకుంటోంది.

4 . అక్కడెక్కడో కెనడాలో, ఇజ్రాయిల్లో న్యాయస్థానాల దాకా వెళ్లి రుజువయిన ఎమోజీ భాష వార్తలను చదువుకుని మనం హాశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన రోజువారీ వ్యవహారాల నిండా ఉన్నది ఎమోజీలే.

నమస్కారం- 🙏
నవ్వొస్తోంది- 😃
ఏడుపొస్తోంది- 😢
ప్రేమిస్తున్నాను-❤️
గుండె పగిలింది-💔
హ్యాపీ బర్త్ డే-🎂
గ్రీటింగ్స్-💐
అలాగే-👍
బాగుంది-👌
బాగాలేదు-👎
అభినందనలు-👏
సంతాపం- 😓
గుడ్ మార్నింగ్-🌈
గుడ్ నైట్-🌚

కొన్ని కోట్ల సంవత్సరాలుగా భూగోళానికంతా ఒకే ఒక భాష ఉండాలని వసుధైక కుటుంబ భావనను కలగన్న విశ్వమానవులు పరితపించారు. ఇన్నాళ్లకు భాషాతీత ఎమోజీ బొమ్మల లిపిని కనుక్కోవడంతో ఆ కల నెరవేరింది. ఇక ప్రపంచంలో గుర్తింపు పొందిన 7,168 భాషల లిపులు ఎమోజీల్లో  లీనమై…లయమయ్యే నిరక్షర క్షణాలు ఎంతో దూరంలో లేవు!

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions