.
డిజిటల్ వ్యామోహంలో మనుషులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. వైవిధ్యం కోసం ఉచితానుచితాలు మరచిపోతున్నారు. ఎక్కడ ఏమి చేయకూడదో అవే చేస్తున్నారు. ఎక్కడ ఏమి మాట్లాడకూడదో అవే మాట్లాడుతున్నారు.
పదేళ్లలో డిజిటల్ మీడియా ఆకాశం అంచులు దాటి ఇంకా ఇంకా పైపైకి వెళుతోంది. చేతి గడియారం, క్యాలిక్యులేటర్, స్టిల్ కెమెరా, వీడియో కెమెరా, డెస్క్ టాప్, టార్చ్ లైట్…ఇలా అనేక వస్తువులను స్మార్ట్ ఫోన్ మింగేసింది. ఇప్పుడు సెల్ ఫోనే బ్యాంక్, సెల్ ఫోనే పర్స్. సెల్ ఫోనే రేడియో. సెల్ ఫోనే టీ వి. సెల్ ఫోనే మీటింగ్ వారధి. సెల్ ఫోనే మనిషిని నడిపే సారథి.
Ads
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివారికి తాము డిజిటల్ మీడియాలో ఏదో ఒకటి చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. తమ మొహం అందంగా ఉండడం వల్ల లోకానికి చూపించాలని అనిపిస్తూ ఉంటుంది. లోపలనుండి తన్నుకొచ్చే జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టా, వాట్సాప్, యూ ట్యూబుల్లో పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది.
వాటికి జనం పెట్టే కామెంట్లను పదే పదే చదవాలనిపిస్తూ ఉంటుంది. క్షణక్షణానికి అందగించే తమ ముఖారవిందాలను వెను వెంటనే డి పి లుగా పెట్టుకుని లోకాన్ని అనుగ్రహించాలనిపిస్తూ ఉంటుంది. లక్షల వ్యూస్, లైకులు, షేర్లు రావాలనిపిస్తూ ఉంటుంది.
వ్యక్తిగతం, దాపరికం ఏమీ లేదు. డిజిటల్లో అంతా ఓపెన్. పెళ్లి, శోభనం, చావు, ఇంటా బయటా ఏదయినా లోకానికి చెప్పాలి. ఒకరిని చూసి ఒకరు…నువ్ తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా అన్నట్లు డిజిటల్ కంటెంట్ లో పోటీలు పడుతున్నారు.
వ్యూస్ బాగా వస్తే ఆనందం; ఉత్సాహం; ఉక్కిరిబిక్కిరి.
రాకపోతే వైరాగ్యం; నిరుత్సాహం; నైరాశ్యం.
సంసారాల్లో డిజిటల్ చిచ్చు భగ్గున మండి… లైకులు, కామెంట్ల బూడిద మిగులుతోంది. మండే అగ్గిలోకి మరింత పెట్రోల్ పొసే ఫాలోయర్లకు కొదవలేదు.
ఇప్పుడు బతుకొక గూగుల్ గజిబిజి సాలె గూడు.
జ్ఞానమొక వాట్సాప్ యూనివర్సిటీ.
జీవన దృశ్యమొక ఎడతెగని యూట్యూబ్.
మనిషి పేస్ ఒక ఫేస్ బుక్.
ఇష్టమొక ఇన్ స్టా గ్రామ్.
అభిప్రాయమొక పొట్టి ట్విట్టర్.
బలమయిన ఆహారం లైకులు.
అంతులేని ఆవేదన కామెంట్లు.
తరగని ఆస్తి సబ్ స్క్రిప్షన్.
జీవన సర్వస్వమొక సోషల్ మీడియా వ్యసనం. చివరకు మిగిలేది వర్చువల్ బూడిద!
తెలంగాణ సూర్యాపేటలో ఒక కులసంఘానికి ఎన్నికలు. ఎన్నికలన్నాక ఒకే కులమైనా సంకుల సమరంలో రెండుగా చీలిపోవాల్సిందే. అలా రెండు వర్గాలుగా విడిపోయి హోరాహోరీ పోరాడుతున్నారు. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు. విమర్శలు, ప్రతివిమర్శలు. సవాళ్ళు, ప్రతిసవాళ్ళు. అగ్గికి ఆజ్యం పోయడానికి వాట్సాప్ యూనివర్సిటీ ఉండనే ఉంది.
కులసంఘం వాట్సాప్ గ్రూపులో ఒకవర్గం నేతపై మరో వర్గం నేత పెట్టిన విమర్శకు ఆ బృందంలో సభ్యుడైన ఒక ఔత్సాహిక వ్యాపారి చప్పట్లు కొట్టే ఎమోజీ పెట్టి ఆ విమర్శకు తన మద్దతు తెలిపాడు. అంతే… ప్రత్యర్థికి కోపం కట్టలు తెంచుకుంది.
మరుసటిరోజు ఉదయం మందీ మార్బలంతో వెళ్ళి ఎమోజీ పెట్టిన వ్యక్తిని బలంగా చితకబాదారు. చప్పట్ల గుర్తు పెట్టిన వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆసుపత్రికి తీసుకెళితే… అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు తేల్చి చెప్పారు.
పోలీసు కేసు, విచారణ, అరెస్టులు షరా మామూలు. “చావుకొచ్చిన ఎమోజీ” అని సూర్యాపేట మౌనంగా రోదిస్తున్న వేళకు… ప్రపంచంలో ఎన్నెన్ని ఎమోజీలు ఎన్నెన్ని గుండెల్లో గునపాలు గుచ్చుతున్నాయో లెక్కగట్టగలిగినవారెవరు? – పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article