ఐపీఎల్ అంటేనే నాకు ఓ ఎలపరం… కానీ మన దేశంలో క్రికెట్ కూడా ఒక మతం… పెద్దలు, చిన్నలు ఊగిపోతారు… క్రికెటర్లతో అనుబంధాలు పెంచేసుకుంటారు… కాబట్టే బోలెడు వార్తలు… గాసిప్స్ కూడా… అనివార్యంగా అందుకే రాయకతప్పదు, ఫాలో కాకతప్పదు, చదవకతప్పదు…
ప్రతి బంతికీ బెట్టింగ్… ప్రతి మ్యాచ్‌కూ బెట్టింగ్… చివరి ఓవర్ వరకూ మ్యాచ్ సీరియస్ టెంపోతో వచ్చిందీ అంటే బెట్టింగ్ ఓ రేంజులో అదిరిపోతుంటుంది… ఇది రియాలిటీ… అసలు ఐపీఎల్ మొత్తం ఓ స్క్రిప్టెడ్ మెగా ఈవెంట్ అనే విమర్శలూ కోకొల్లలు… నగరాలు, రాష్ట్రాల పేర్లు పెట్టుకున్నా సరే, వాటికి ఆ ప్రాంతాలవాళ్లే ఓనర్లు కారు, క్రికెటర్లు అంతకన్నా కాదు…
డబ్బున్న పెట్టుబడిదారు కోట్లు పోసి, వేలంలో కొని, క్రికెటర్లను రేసుగుర్రాల్లా మైదానంలోకి దింపుతారు… ఆట నడుస్తూ ఉంటుంది… యాడ్స్, రెవిన్యూ, హంగామా, స్పాన్సరర్స్, అగ్రిమెంట్లు గట్రా యవ్వారం మరోవైపు సాగుతూ ఉంటుంది… బ్రాడ్‌బ్యాండ్, మ్యాచుల ప్రత్యక్ష ప్రసారం కూడా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు… ఒక్క ముక్కలో చెప్పాలంటే బడా కంపెనీలు ఆడుకునే పైసలాట ఇది… ఇందులో ఆటకన్నా ఆదాయమే పరమావధి…
Ads
ఈసారి ఐపీఎల్ విజేత కావ్య మారన్… ఒకరకంగా సన్ రైజర్స్ టీం అభిమానులే కాదు, ఐపీఎల్ వీక్షకులంతా ఆమెతో కలిసి ఓ ఎమోషనల్ జర్నీ చేశారు… ఆమె కూడా చిన్నపిల్లలా… ప్రతి బంతినీ, తమ జట్టు పాల్గొన్న ప్రతి క్షణాన్ని ఫీలైంది… ఎగిరింది, చప్పట్లు కొట్టింది, ఆలింగనం చేసుకుంది, షాక్ తిన్నది, తలపట్టుకుంది, చివరకు ఏడ్చింది, కన్నీళ్లు పెట్టుకుంది… అసలు ఐపీఎల్ ఓ స్క్రిప్టెడ్ ఈవెంట్ అనే ప్రచారాన్ని బ్రేక్ చేసింది ఒకరకంగా…
చాలా కంపెనీలు, చాలా డబ్బున్న మారాజులు ఐపీఎల్ టీమ్స్ రన్ చేస్తున్నాయి కదా… మరి ఆమే ఎందుకింత ఇన్వాల్వయింది… కోట్ల క్రికెట్ ప్రేమికుల్ని తనతోపాటు జర్నీ చేయించింది దేనికి..? సోషల్ మీడియా, మీడియా మొత్తం దృష్టి ఆమె కదలికలు, మొహంలో ఫీలింగ్స్‌పైనే… అందుకే సన్‌రైజర్స్ జట్టు ఫైనల్‌లో ఓడిపోగానే, అరెరె, పాపను ఏడిపించారు కదరా అంటూ సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తిపోయింది.,.
ఒక్కసారి ఈ కోణంలో చూడండి, ఎంతమంది నిజంగా స్టేడియంలోకి వచ్చి తమ జట్టు ఆటతీరును చూశారు..? తమ ఆటగాళ్లతో మమేకం అయ్యారు… ఫైనల్స్‌లో షారూక్ ఖాన్ కనిపించాడు… గతంలో పంజాబ్ కింగ్స్ ఓనర్లలో ఒకరైన ప్రీతి జింతా కూడా కావ్య మారన్‌లాగే రకరకాల ఎమోషన్స్ పలికించేది… మహానటి… కానీ కావ్య మారన్ నటి కాదు, ఆమె ఫీలింగ్స్ నేచురల్…
సరే, ఈసారి ఐపీఎల్ కథే చూద్దాం… ముంబై, చెన్నై, రాజస్థాన్ వంటి జట్లు ఎప్పుడో కొట్టుకుపోయాయి… వాటివి గత వైభవాలే… రోహిత్ శర్మలు, విరాట్ కోహ్లిలు, ఎంఎస్‌ధోనిలు గట్రా హేమాహేమీలు కూడా కొట్టుకుపోయారు… ఎక్కడో పదో స్థానంలో కనిపించే సన్ రైజర్స్‌ను ఫైనల్స్ దాకా రావడమే ఒక అచీవ్‌మెంట్… గెలుపో ఓటమో జానేదేవ్, ఒకరు ఓడతారు, ఒకరు గెలుస్తారు, జస్ట్, అదొక ఆట…
కానీ ఇంతగా జనాన్ని తనతోపాటు జర్నీ చేయించింది కదా, ఈ రేంజుకు ఆ జట్టును పాపులర్ చేసింది కదా… అందుకే కావ్య మారన్ ఈసారి విజేత… ఆమెకు చాలా వ్యాపారాలున్నయ్, చాలా వ్యాపకాలున్నయ్… ఐనా సరే ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు, ఇక ప్రతిక్షణం క్రికెటే ఆమె ప్రపంచం…
ఒక్కసారి లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయింకా తన కెప్టెన్‌పై అరుస్తూ, టీవీల ఎదుటే చిల్లరగా బిహేవ్ చేసిన తీరును కావ్య మారన్‌ను ఒక్కసారి పోల్చి చూడండి… ఇవే కాదు, చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్.., ఢిల్లీ కేపిటల్స్ ఓనర్ జీఎంఆర్, జేఎస్‌డబ్ల్యూ, పార్థ్ జిందాల్.., పంజాబ్ కింగ్స్ ప్రీతి జింతా, నెస్‌వాడియా.., ముంబై ఇండియన్స్ రిలయెన్స్ నీతా అంబానీ… కోల్‌కత్తా నైట్ రైడర్స్ జుహీ చావ్లా, ఆమె భర్త జే మెహతా… రాజస్థాన్ రాయల్స్ ఓనర్ బ్లెన్‌హేమ్ చాల్కోట్… బెంగుళూరు రాయల్స్ ఛాలెంజర్స్ యునైటెడ్ స్పిరిట్స్.., గుజరాత్ టైటాన్స్ సీవీసీ కేపిటల్స్…
మరి ఏ ఒక్కరూ కావ్య మారన్‌లాగా టీవీ తెరలపై వెలిగిపోలేదు..? క్రికెట్ తెలుగు ప్రేమికుల దగ్గరకొద్దాం… హైదరాబాద్ పేరున్న జట్టు కాబట్టి కావ్యను బాగా ప్రేమించారు… కలిసి ప్రయాణించారు… ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే బాధపడ్డారు… ప్లస్ వేణుస్వామి… తననూ సోషల్ మీడియా పోస్టుల్లోకి లాగారు… తను ఈసారి కావ్య మారన్ గెలుస్తుందని చెప్పాడట… కానీ నిజం కాదు, ఈసారి ఆమె జాతకం బాగుంది కాబట్టి బాగా ఆ జట్టు ఆడుతోంది అన్నాడు… అంటే కప్పు గెలుస్తుందని కాదు కదా…
చివరగా… అనుకోకుండా ఓ ఇంటికి వెళ్లబడ్డాను… 4కే, 85 ఇంచెస్‌కన్నా పెద్ద టీవీయే… ఇద్దరు పిల్లలు సన్‌రైజర్స్ కలర్ జెర్సీలు ధరించి మ్యాచ్ చూస్తున్నారు… అప్పటికింకా వికెట్ల పతనం స్టార్టవలేదు… పెద్ద పేపర్ బుట్టలో పాప్‌కార్న్, పక్కన పెద్ద థమ్సప్ సీసా… ఈ జెర్సీ ధరించి ఆట చూస్తేనే కిక్కొస్తుంది అంకుల్ అన్నాడు ఆ అబ్బాయి… ఇదే మా సంఘీభావం, మద్దతు అని పలికింది ఆ అమ్మాయి… ఎస్, క్రికెట్ అంటే మనకు మతమే… కాదు, కాదు… ఓ పిచ్చి..!!
మరీ చివరగా… పెద్దగా క్రికెట్‌ను ఇష్టపడని మరో ఇంట్లో… పిల్లలేమో టీవీ రిమోట్ పట్టుకుని వేరే ప్రోగ్రాం చూడనివ్వడం లేదు, చివరకు ఆటలో కావ్య ఓడిపోయింది… కన్నీళ్లు పెట్టుకుంది, ఈ పిల్లలూ కన్నీళ్లపర్యంతమయ్యారు… అది చూసి నవ్విన వాళ్ల అమ్మ ‘ఏమిటీ సంగతి’ అనడిగింది..? దానికి ఆయన ‘పాప ఏడ్చింది’ అని బదులిచ్చాడు… ‘వుడ్ వాటర్ గ్రైప్ వాటర్ పట్టకపోయారా..? చిన్నప్పుడూ ఈ ఇద్దరికీ నేను అదే పట్టేదాన్ని’ అని మరింత వెటకారాన్ని దట్టించి వదిలింది ఆమె..!!
Share this Article