అతను జన్మత బ్రిటిషర్… అతని తల్లి పేరు హన్నా… ఆమెవి స్పానిష్, ఐరిష్ రూట్స్… తండ్రి చార్లెస్‌వి ఫ్రెంచి రూట్స్… ఇద్దరూ వృత్తిరీత్యా నటులు… ఆట, పాట, హాస్యంతో కూడిన చౌచౌ ప్రదర్శనలతో డబ్బులు బాగానే వచ్చేవి… కానీ వచ్చిందంతా తండ్రి తాగుడుకే తగలేసేవాడు… ఇంట్లో అదే పేదరికం… ఆ తండ్రి కొన్నాళ్లకు ఆ కుటుంబాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు… మరికొన్నాళ్లకి చనిపోయాడు… తల్లి అష్టకష్టాలు పడి, పిల్లలను పెంచింది… కొన్నాళ్లకి ఆమెకి మతి చలించింది.., ఉన్మాదిని కావడంతో మానసిక చికిత్సాలయంలో చేర్పించారు… అతడు బాల్యం నుంచే పొట్టకూటి కోసం వేషాలు వేసేవాడు… అవీ సరిగ్గా దొరికేవి కావు… కూలీ నాలి చేసి పొట్టపోసుకునేవాడు… మార్కెట్‍లోనో, పార్కులలోనో పడుకునేవాడు…… చాలామందికి తెలిసిన చార్లి చాప్లిన్ బాల్యం, కుటుంబనేపథ్యం ఇది…
ప్రపంచం మొత్తాన్ని కొన్నేళ్లపాటు నవ్వించిన ఆయనకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు… ఒక అర్థ శతాబ్థానికిపైగా అతడు దేశదేశాల వారిని వయోభేదం, మత, వర్గభేదం లేకుండా నవ్వించాడు… కానీ తనను అమెరికన్ మీడియా, సొసైటీ ఎంత వేధించాయో, ఎంత పరాభవించాయో… తన నవ్వుల వెనుక ఎన్ని విషాదవీచికలు దాగున్నాయో తెలియాలి… ప్రత్యేకించి మీడియా దుర్మార్గం అప్పుడూ ఇప్పుడూ ఒకేతరహా… అదొక నీచమైన అక్షరవ్యాపారం… మతాల్ని మించిన ప్రమాదకారి…
అమెరికా… మొత్తం ప్రపంచాన్ని శాసించాలని భావిస్తుంది… అక్కడి మీడియా కూడా అంతే… చార్లి వ్యక్తిగత జీవితం పట్ల, రాజకీయ భావాల పట్ల ఎంతగా అసహనం, విద్వేషం ఏర్పడ్డాయంటే 1952 ప్రాంతాలలో అతడు అమెరికాను శాశ్వతంగా వదలిపెట్టి, స్విట్జర్లాండ్‌లో స్థిరపడవలసి వచ్చింది… పత్రికలవాళ్ళు అతడ్ని వ్యక్తిగతంగా, వృత్తి రీత్యా గూడా ఇబ్బందులపాలు చేస్తూనే ఉన్నారు… అతడ్ని అమెరికాకు వ్యతిరేకిగా, కమ్యూనిస్టని చాలా ఘోరంగా ప్రచారం చేశారు… ఇన్ అమెరికన్ యాక్టివిటీస్ కమిటీ, విచారణ పరిశోధన విభాగం న్యాయస్థానం ద్వారా చాప్లిన్‌కు తాఖీదులు పంపడం తరచూ జరిగేది… తను అమెరికాలో అప్పటికి 40 ఏళ్ళుగా నివసిస్తున్నప్పటికీ, చాప్లిన్ బ్రిటిష్ పౌరసత్వాన్ని వదులుకోలేదు… ఈ వంకతో అతడ్ని వేధించేవాళ్లు… కళాకారుడుగా తాను ప్రపంచ పౌరుడనని, ప్రత్యేకంగా ఏ ఒక్క దేశానికీ చెందినవాడ్నికాదని చాప్లిన్ చెప్పేవాడు… తనకు అమెరికా సొసైటీ నడత గురించి తెలుసు… ఎలాగైనా అతడ్ని జైలుపాలు చేయాలని ప్రయత్నించింది మీడియా… ఫలితం దక్కలేదు… అతడ్ని ఎలాగైనా రష్యా పంపించివేయాలని మీడియా చేయని ప్రయత్నం లేదు… దాంతో 1952 లో అమెరికాను వదలి, ఇంగ్లండ్ చేరుకొని అక్కడ నుంచి స్విట్జర్లాండ్‌లో స్థిరపడ్డాడు…
Ads
రాస్తూ పోతే, చాప్లిన్ జీవితమే నాలుగైదు సినిమాలకు సరిపడా… ఓ సాదాసీదా కమెడియన్ కాదు తను… ఇప్పుడు తన గురించి ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… ఓ వీడియో కనిపించింది… చిన్న బిట్… కానీ అది చూస్తుంటే కళ్లప్పగించి, ఆయన కళ్లల్లో జాలువారుతున్న ఆనందబాష్పాలను గమనిస్తూ, ఆయన మొహంలోని ఉద్వేగాల్ని పరిశీలిస్తూ… మనమూ ఓ ఎమోషన్‌కు గురవుతాం… 1972 నాటి వీడియో ఆస్కార్ అవార్డు తీసుకోవడానికి తిరిగి అమెరికా వచ్చాడు తను… 12 నిమిషాలపాటు ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు… ఆగకుండా చప్పట్లు, అభినందనలు… ఆస్కార్ అవార్డుల చరిత్రలో తొలిసారి, కడసారి… చాప్లిన్‌కు నిజమైన కళాభిమాన సమూహం ఇంతకుమించి ఏమివ్వాలి..? చాప్లిన్‌కు అంతకుమించి ఏం కావాలి..? పైన వీడియో బిట్ అదే… మీడియా, సొసైటీ, వ్యతిరేకులు ఆయన్ని తొక్కేయాలని విశ్వప్రయత్నం చేసినా… తనలోని నిజమైన ఆర్ట్, తపన ఒక్క క్షణం కూడా తలవంచుకోనివ్వలేదు… చివరకు వ్యతిరేకులే తలలు వంచుకున్నారు…!!
Share this Article