.
పింగళి దశరథరామ్.. కత్తి వేటుకు బలైన జర్నలిస్టు
“పనికి రాని – పని చేయని చమ్కీకోటు సిద్దాంతాలతో ఎన్‌కౌంటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ పని లేదు. ఎన్‌కౌంటర్ ఏ పార్టీకి సాగిలపడదు. ఎవడికీ బానిస కాదు. ఎవడికీ పెళ్లాంలా వెట్టి చాకిరీ చెయ్యదు. ఠాగూర్ గీతాంజలిలో ఆశించిన వ్యవస్థను నిర్మించటానికి ఎన్‌కౌంటర్ బలిపీఠం ఎక్కుతుంది.
మన రాజకీయ రంగంలో అడ్డు అదుపు లేకుండా స్వైరవిహారం చేస్తున్న హిట్లర్లని, అమీన్‌లని, నిక్సన్‌లని, స్టాలిన్‌లని, మావోలని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి ఒక భగత్‌సింగ్‌లా, ఒక బోస్‌లా, ఒక సీతారామరాజులా, ఒక అలెగ్జాండరు సోల్జినిత్సిన్‌లా, రస్సెల్‌లా, జీన్‌పాల్ సార్త్రెలా ప్రవర్తిస్తుంది. అలాంటి వాళ్లనే తయారు చేస్తుంది. అధోజగత్ సహోదరులను అగ్రభాగాన నిలబెట్టడానికి నిరంతర సమరాన్ని సమధికోత్సాహంతో సగర్వంగా ఎన్‌కౌంటర్ నిర్వహిస్తుంది”… – పింగళి దశరథరామ్ (‘ఎన్‌కౌంటర్’ పత్రిక ఎడిటర్)
Ads
***
హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో చూడగానే చాలా ఎమోషనల్‌గా ఫీలైన పుస్తకం ఇది. ‘ఎన్‌కౌంటర్ దశరథరామ్‌ని తలుచుకుందాం’ అంటూ ‘విజయవిహారం’ పత్రిక 2001 అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 2002 జనవరి, జూన్ సంచికల్లో ఎడిటర్ రమణమూర్తి రాసిన కథనాలన్నీ కలిపి ఇలా పుస్తకం వేశారు.
ఇప్పుడు చాలామందికి పింగళి దశరథరామ్ తెలియకపోవచ్చు. సాహిత్య, పాత్రికేయ రంగాలతో పరిచయం ఉన్నవారికి ఆయన చేసిన కృషి తెలిసి ఉండొచ్చు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన కొందరు ఇంకా ఆయన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు.
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి మనవడిగా కొందరికి, రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సినిమా రంగంలో సహాయ దర్శకురాలిగా పని చేస్తున్న పింగళి చైతన్య గారి తండ్రిగా మరికొందరికి తెలిసి ఉండొచ్చు.
అయితే వీటన్నింటినీ మించి, ‘ఎన్‌కౌంటర్’ పత్రిక నడిపి, తెలుగు నేల మీద సంచలనం సృష్టించి, రాజకీయ నాయకులను తీవ్రంగా విమర్శించి, ‘ఎన్టీవోడా ఇక నోరు మూస్కో’ అంటూ అప్పటి సీఎం నందమూరి తారక రామారావునే బలంగా ఎద్దేవా చేసిన ఎడిటర్ పింగళి దశరథరామ్‌గా చాలామంది ఆయన్ని గుర్తు పెట్టుకున్నారు.
‘ఎవడికో అమ్ముడుపోవడానికి తన పత్రిక వ్యభిచారి కాదు’ ప్రకటించిన వెన్నెముక కలిగిన ఎడిటర్‌గా గుర్తు పెట్టుకున్నారు. 29 ఏళ్లకే కత్తిపోట్లకు బలైన అమరజీవిగానూ గుర్తుపెట్టుకున్నారు.
డిసెంబర్ 5, 1979లో మొదలైన ‘ఎన్‌కౌంటర్’ పత్రిక, ఒక దశలో లక్ష కాపీలకు చేరింది. మొదట్లో యాడ్స్ ఆదాయంతో నడిచినా, ఆ తర్వాత కాలంలో కేవలం సర్క్యులేషన్ నుంచి వచ్చే డబ్బే ఆధారంగా నడిచిన అరుదైన పత్రిక ఎన్‌కౌంటర్. సెప్టెంబర్ 10, 1985లో దశరథరామ్ సంపాదకత్వంలో చివరి సంచిక వెలువడింది. 1985 అక్టోబర్ 20న విజయవాడ రోడ్ల మీద రిక్షాలో వెళ్తున్న ఆయన్ని నరికి చంపారు.
ఎందుకు? ఏంటి కారణం?
‘రాజకీయాల్లో రంకు వేషాలు’
‘తొడల పొందులో రాజకీయాలు’
‘ఆరుకోట్ల అక్కయ్య రంకు వేషాలు’
‘ఎక్కడ పెట్టాలో తెలియని ఎమ్మెల్యే’
‘దేశంలో మగ లంజలు’
‘ఓరీ అభిమాన సంఘ అజ్ఞాన మూర్ఖులారా’
‘ఈ దేశంలో కుర్రగొడ్లు అమ్మబడును కొనగలరా?’
‘కమ్యూనిస్టుల జాతి విద్రోహం’
‘ఇతగాడొక లోఫర్ ఛీఛీ’
ఇవన్నీ ఎన్‌కౌంటర్ పత్రికలో వచ్చిన వ్యాసాలు, కవర్ స్టోరీల టైటిల్స్. వినగానే ఉలిక్కపడే, చదవగానే కంగారు పుట్టించే టైటిల్స్. ఇలాంటి సంచలనాత్మక కథనాలకు ఎన్‌కౌంటర్ వేదిక. అందుకే ఒకానొక దశలో దశరథరామ్‌ని ఉరి తీయాలని ‘తెలుగు యువత’ కరపత్రం ప్రచురించింది. ఆ కరపత్రాన్ని తన పత్రికలో ప్రచురించిన దశరథరామ్ అందుకు తగ్గ సమాధానాలు ఇచ్చారు. తాను రాసినవి అబద్ధాలు అని తేలినప్పుడు తనకు ఉరి వేయండి అని ప్రకటించారు…
ఎన్‌కౌంటర్ ఆ రోజుల్లో విమర్శించని రాజకీయ నాయకులు ఎవరూ లేరనేది వాస్తవం. అన్ని మతాలు, అందులోని అక్రమాలపై ఆయన వ్యాసాలు రాశారు. కొన్ని సంచలనాత్మక కథనాలకు ఎన్‌కౌంటరే సాక్షిగా మారింది. అందులో అతి ముఖ్యమైనది ‘తెనాలి నరబలి’ కేసు.
తెనాలిలో ఒక బడా కాంగ్రెస్ నేతకు సంబంధించిన థియేటర్ నిర్మాణంలో నరబలి ఇచ్చారని 1981 డిసెంబర్ 25న ఎన్‌కౌంటర్‌లో వార్త వచ్చింది. ఫొటోలతో సహా ఆ వార్త ప్రచురించింది. దీనికి భయపడ్డ కొందరు తెనాలిలో ఆ పత్రిక విడుదల కాకుండా చూస్తే, పత్రికను అక్కడ ఉచితంగా పంచిపెట్టారు దశరథరామ్. ఆ తర్వాత ఈ నరబలి అంశం అసెంబ్లీలో చర్చకు దారితీసింది.
ప్రముఖ కమ్యూనిస్టు నేత కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూ కోసం కోర్టులో పిటీషన్ వేసి మరీ, ఆయన్ని ఇంటర్వ్యూ చేసి ఎన్‌కౌంటర్ పత్రికలో ప్రచురించారు. ఎన్టీఆర్ రూ.లక్ష ఇన్‌కమ్ ట్యాక్స్ బకాయి పడ్డారని, ఎన్టీఆర్ శవపూజలు చేస్తారని, రాత్రుళ్లు చీరలు కట్టుకుంటారని కూడా రాసి సంచలనం రేపారు. కారంచేడులో దళితులపై జరిగిన మారణహోమం గురించి ‘కారంచేడులో మారణహోమం’ పేరుతో విస్తృతంగా వార్తలు ప్రచురించారు…
కారంచేడు బాధితులకు సాయం చేయలేని తన నిస్సహాయత గురించి రాస్తూ “పదిరికుప్పంలో హరిజనుల మీద దాడి జరిగినప్పుడు ఎన్‌కౌంటర్ ఆర్థికంగా ఆదుకోగలిగింది. కానీ కారంచేడు హరిజనులకు గుప్పెడు బియ్యం ఇవ్వలేకపోయింది. ఫోన్ బిల్ కట్టక అది డిస్కనెక్ట్ అయినప్పటికీ ఈ ఎంక్వైరీ కమిషన్ల అనుభవాల దృష్ట్యా రూ.2500 భయంకర వడ్డీకి అప్పు చేసి మరీ సాక్ష్యాల కోసం ఆ సంఘటనలన్నింటినీ వీడియో ఫిలిం తీయటం జరిగింది. దీన్ని బట్టి మా పరిస్థితి వూహించుకోవచ్చు” అని ఆయన ఆవేదనతో రాసుకున్నారు.
ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ మరణాంతరం ఆయన చిత్రంతో కేంద్రం పోస్టల్ స్టాంప్ విడుదల చేయడాన్ని దశరథరామ్ నిరసించారు. ఆ చర్యకు నిరసనగా చిన్నపిల్లల హంతకులైన బిల్లా, రంగా ఫొటోలతో ఎన్‌కౌంటర్ పత్రికలో స్టాంప్‌లు విడుదల చేశారు దశరథరామ్. వాటిని కత్తిరించి కొందరు పాఠకులు ఉత్తరాలకు అంటించి పోస్ట్ చేశారు.
విచిత్రంగా, పోస్టల్ శాఖ సైతం ఆ విషయాన్ని గుర్తించకుండా ఆ ఉత్తరాలు బట్వాడా చేసింది. ఆ తర్వాత విషయం బయటకు వచ్చింది. దీంతో దశరథరామ్‌పై కేసు పెట్టారు. కొన్నాళ్ళు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ తర్వాత ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది…
ఎన్టీఆర్ తొలిసారి సీఎం అయినప్పుడు ఎన్జీవోలు తమ డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె చేశారు. ఆ సమయంలో ‘తెలుగు దొంగ’ అని సీఎంను ఉద్దేశిస్తూ ఎన్‌కౌంటర్‌లో ప్రచురించిన పోస్టర్ సంచలనం రేపింది. ఆ పోస్టర్‌ని ఎన్జీవోలు తమ ఉద్యమంలో వాడుకున్నాయి. అప్పట్లో విశాఖలో జరిగిన మహానాడులో తెలుగుదేశం నేతలు ఒత్తిడి చేసి చందాలు వసూలు చేశారని కూడా ఎన్‌కౌంటర్ వార్త రాసింది…
ఇన్ని సంచలనాలకు ‘ఎన్‌కౌంటర్’ కేంద్ర బిందువు కావడం వల్ల ఏ స్థాయిలో పాఠకుల ఆదరణ ఉండేదో, అదే స్థాయిలో ముప్పు కూడా దశరథరామ్‌కి పొంచి ఉండేది. దీంతోపాటు ఆ పత్రికలో అశ్లీలమైన చిత్రాలు, నగ్న బొమ్మలు ప్రచురిస్తారనే విమర్శ కూడా బలంగా ఉండేది. సంచలనం కోసమే కొన్ని వార్తలు నిరాధారంగా రాశారని, తిట్లతో కూడిన హెడ్డింగ్స్ పెట్టారనే మాట కూడా ఉంది…
ఒక రాజకీయ నేత సవాల్‌తో ఆవేశపడి, 1983 అసెంబ్లీ ఎన్నికల్లో రాజమండ్రి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా దశరథరామ్ పోటీ చేశారు. ఆ సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందని ఆయన ప్రకటించారు. అయితే అదంతా నాటకం అని, సింపతీ కోసమే అలా చేశారని ఆయన సన్నిహితుల మాట…
ఆ సమయంలోనే ఎన్నికల ప్రచారంలో కిటికీ ఊచల వెనుక నిలబడి ఫొటో దిగి, అవి జైలు ఊచలనీ, తాను జైల్లో ఉన్నానని జనానికి ఇంప్రెషన్ కలిగించేందుకు ప్రయత్నించారనే వాదనా ఉంది. దశరథరామ్‌కి సహచరుడిగా ఉన్న ‘బాంబు’ అలియాస్ ఎం.ఎస్.ఎన్.శాస్త్రి 1983లో దశరథరామ్ నుంచి విడిపోయి, ‘ఎన్‌కౌంటర్ దశరథరామ్ బండారం’ అనే పుస్తకం రాశారు. అయితే అది విడుదల కాకుండా దశరథరామ్ కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత కాలంలో వారిద్దరూ కలిసిపోయారు…
ఇంత నిర్దిష్టమైన, దృఢ నిశ్చయం కలిగిన దశరథరామ్‌ని చంపింది ఎవరు? అంత అవసరం ఎవరికి ఉంది? ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఊళ్లో ఉన్న దశరథరామ్ హైదరాబాద్ వెళ్లారని ఇంట్లో వాళ్లు ఎందుకు చెప్పారు? ప్రత్యక్ష సాక్షి అయిన రిక్షావాడు ఏం చెప్పాడు? ఆ తర్వాత అతను ఏమయ్యాడు? ఈ మొత్తం వ్యవహారంలో ఒక ప్రముఖుడి హస్తం ఉందా? ఆయన ఆ తర్వాత ఏమయ్యారు? కోర్టులో నిందితులున్నా వాళ్లకు వ్యతిరేకంగా ఎవరూ ఎందుకు నోరు విప్పలేదు?
దశరథరామ్ కుటుంబ జీవితానికి సంబంధించిన అంశాలను కూడా ఇందులో రాశారు… పింగళి వెంకయ్య రెండో కొడుకు హేరంబ చలపతిరావు. ఆయన భార్య జానకీ దేవి. వారి కొడుకే పింగళి దశరథరామ్. ఆయన భార్య సుశీల. పిల్లలు పింగళి చైతన్య, అన్వేష్, దశరథరామన్. దశరథరామ్ మరణాంతరం ఆయన భార్య సుశీల గారు పడ్డ ఇబ్బందులు, పిల్లల్ని పెంచిన తీరు గురించి ఇందులో వివరించారు…
ఇలాంటి చాలా విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. చిత్రాలతో సహా వారి గురించి రాశారు. చదువుతూ ఉంటే ఈ పుస్తకం నిండా చాలా ఆశ్చర్యపరిచే సంగతులున్నాయి. కత్తి వేటుకు బలైన దశరథరామ్ జ్ఞాపకాలున్నాయి. ఆయన సృష్టించిన సంచలనాల జాడలున్నాయి. జోహార్ దశరథరామ్! జోహార్! – విశీ (వి.సాయివంశీ)
Share this Article